తెలుగు సినీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్‌ భారతదేశ సినీ ప్రేమికులు ప్రస్తుతం ఆస్కార్‌ వేడుక వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్‌ఆర్‌' సినిమాలోని ''నాటు నాటు..'' పాట ఆస్కార్‌ అవార్డ్‌ కు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్ కేటగిరీలో నామినేషన్స్ ను సొంతం చేసుకోవడమే. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన 'ఆర్ఆర్ఆర్‌' సినిమా నెట్‌ ఫ్లిక్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ''నాటు నాటు'' పాట ఆస్కార్ వేటలో ఒక్క అడుగు దూరంలో ఉన్న నేపథ్యంలో ఆ పాట గురించి లోకల్‌ నుంచి గ్లోబల్‌ వరకు చర్చ జరుగుతోంది. 

 

'నాటు నాటు'' పాటను ఉక్రెయిన్ అధ్యక్ష భవనం ముందు చిత్రీకరించారు. పాట చిత్రీకరణ సమయంలో అక్కడ ప్రశాంత వాతావరణం ఉండేది, కానీ ప్రస్తుతం అక్కడ యుద్ధం జరుగుతోంది. గత ఏడాది కాలంగా ఉక్రెయిన్‌ పై ఆధిపత్యానికి రష్యా యుద్దం సాగిస్తోంది. ఒక వేళ ఇప్పుడు షూట్‌ చేయాలి అంటే ఈ సమయంలో అక్కడ షూటింగ్ సాధ్యం అయ్యేది కాదు. అదృష్టం కొద్ది పాట చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత యుద్దం మొదలయ్యిందని ఒక ఇంటర్వ్యూలో చిత్ర యూనిట్ సభ్యుడు ఒకరు వ్యాఖ్యలు చేశారు.

అక్కడే ఎందుకంటే.. 


ఇటీవల రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో ‘‘నాటు నాటు’ పాటను ఉక్రెయిన్‌లో చిత్రీకరించడానికి గల కారణం గురించి తెలిపారు. ‘‘ఆ పాట చిత్రీకరించాలని అనుకున్నప్పుడు లొకేషన్‌ గురించి చాలా ఆలోచించాం. మొదట ఇండియాలోనే చిత్రీకరించాలని అనుకున్నాం. కానీ వర్షాకాలం అవ్వడం వల్ల షూటింగ్‌కు ఆటంకం ఏర్పడుతుందని భావించాం. అప్పుడే ఉక్రెయిన్‌ అధ్యక్ష భవనం ముందు చిత్రీకరించాలని నిర్ణయించుకున్నాం’’ అని తెలిపారు. 


‘‘ఉక్రెయిన్‌ అధ్యక్ష భవనానికి ఉన్న రంగులు, ముందు ఉన్న ఖాళీ ప్రదేశం.. అన్ని విధాలుగా ‘‘నాటు నాటు’’ పాటకు అనుకూలం ఉంటుందని అనుకున్నాం. అక్కడ అనుమతి దక్కుతుందా? లేదా? అనే అనుమానం కూడా మాకు కలిగింది. కానీ ఆ దేశ అధ్యక్షుడు సినిమా బ్యాక్‌ గ్రౌండ్ ఉన్న వ్యక్తి కావడం వల్ల పాట చిత్రీకరణకు అనుమతి దక్కింది’’ అని రాజమౌళి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పాట పూర్తయిన తర్వాత ‘‘నాటు నాటు’’కు చిత్రీకరణకు ఇదే సరైన ప్లేస్ అని చాలామంది కొనియాడారు. 


ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ కఠోర శ్రమ


‘‘నాటు నాటు’’ పాటకు లొకేషన్‌ ఎంపిక పెద్ద ప్రహసనం అన్నట్లుగా సాగింది. ఆ తర్వాత షూటింగ్‌ సమయంలో కూడా రాజమౌళి ఎక్కడ రాజీ పడలేదు. ముఖ్యంగా ఇద్దరు హీరోల స్టెప్స్ విషయంలో చాలా టేక్ లు తీసుకోవాల్సి వచ్చిందట. చిన్న చిన్న విషయాల వల్ల కూడా రీ టేక్ కు వెళ్లాల్సి వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ లు పేర్కొన్నారు. ఆ పాట చిత్రీకరణ సమయంలో రాజమౌళిపై కోపం కూడా వచ్చిందని సరదాగా ఆ ఇంటర్వ్యూలో చరణ్, తారక్ అన్నారంటే ఆయన వారిని ఎంత ఇబ్బంది పెట్టారో అర్థం చేసుకోవచ్చు. అంతగా కష్టపడ్డారు కాబట్టే ఇప్పుడు అది అంతర్జాతీయ స్థాయి గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతమైందని అభిమానులు అంటున్నారు. ఇప్పుడు ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డు నామినేషన్స్‌‌లో ‘‘నాటు నాటు’’ సాంగ్ ఉంది. ఒక్క అడుగు దూరంలో ఆస్కార్ అవార్డుకు చేరువలో ఉంది. మరి ఆ అవార్డు మనకు దక్కుతుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.