అందాల తార కాజల్ అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయ్యింది. ఆగ్ర హీరోలు అందరితో సినిమాలు చేసి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
కొడుకు విషయంలో కాజల్ కండీషన్లు
ఇక తన బాల్య స్నేహితుడు గౌతమ్ కిచ్లును 2020లో కాజల్ వివాహం చేసుకుంది. ఈ జంటకు 2022లో ఒక మగ బిడ్డ పుట్టింది. తమ అందాల కుమారుడికి నీల్ కిచ్లు అని పేరు పెట్టారు. అంతేకాదు, నిత్యం తన కొడుకుతో సరదగా గడిపే ఫోటోలు, వీడియోలను కాజల్ అభిమానులతో పంచుకుంటూనే ఉంది. తాజాగా తన కొడుకుకు సంబంధించిన పలు కీలక విషయాలను కాజల్ వెల్లడించింది. తన కొడుకు విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తన అబ్బాయికి 8 ఏండ్ల వయసు వచ్చే వరకు సినిమాలు చూడనివ్వనని చెప్పింది. స్మార్ట్ ఫోన్ కూడా ఉపయోగించకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించింది.
మా బాబుకు చూపించే తొలి సినిమా ‘తుపాకి’- కాజల్
నీల్ కిచ్లుకి 8 ఏండ్లు వచ్చిన తర్వాత సినిమాలు చూడటానికి అనుమతిస్తానని చెప్పింది కాజల్. తన కొడుక్కి చూపించబోయే తొలి సినిమా ‘తుపాకి’ అని చెప్పింది. కాజల్ అగర్వాల్ 2012లో నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘తుపాకి’. విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రం కాజల్ కెరీర్ లోనే బెస్ట్ మూవీస్ లో ఒకటి. ఈ సినిమా సక్సెస్ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ఏఆర్ మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆర్మీ మేన్ చేసే పోరాటాన్ని ఈ చిత్రంలో చూపించారు. ఈ సినిమాలో కాజల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత తమిళంలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది కాజల్ అగర్వాల్.
‘ఇండియన్ 2’లో నటిస్తున్న కాజల్
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కల్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఘోస్టీ’ సినిమాలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రం మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు కమల్ హాసన్ నటిస్తున్న ‘ఇండియన్ 2’ మూవీలోనూ ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది.
Also Read : హీరోగా కాదు అభిమానిగా ఆస్కార్స్‌కు రామ్ చరణ్ - అక్కడ వాళ్ళిద్దర్నీ చూడాలని...
Read Also: ఉమెన్ పవర్ - సినిమాల్లోనే కాదు, వ్యాపారాల్లోనూ దుమ్మురేపుతున్న టాలీవుడ్ హీరోయిన్స్