సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు రెండో కుమారుడు, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరొసారి వివాహ బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మనోజ్ తన స్నేహితురాలు భూమా మౌనిక రెడ్డిని మనోజ్ పెళ్ళి చేసుకున్నాడు. ఇటీవలే వీరి వివాహ వేడుక వైభవంగా జరిగింది. హైదరాబాద్ లోని మనోజ్ సోదరి మంచు లక్ష్మి నివాసంలో ఈ మ్యారేజ్ జరిగింది. మోహన్ బాబు దంపతులు, మంచు విష్ణు సహా పలువురు బంధువులు, సన్నిహితులు శ్రేయోభిలషులు ఈ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
నిజానికి మనోజ్ - మౌనిక రెడ్డిల పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకు ఇష్టం లేదని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. సోదరుడు విష్ణు సైతం తమ్ముడి వివాహం పట్ల ఆసక్తి కనబరచలేదని టాక్ వచ్చింది. పెళ్ళి వ్యవహారాల్లో ఎక్కడా కూడా మోహన్ బాబు - విష్ణు కనిపించకపోవడం ఈ వార్తలకు బలం చేకూరేలా చేసింది. అయితే, మోహన్ బాబు మధ్యలో ఒకసారి కనిపించి.. పది నిమిషాల తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారని టాక్.
మనోజ్ గతంలో ప్రణీత రెడ్డి అనే తన ఫ్రెండ్ ని ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి మధ్య మనస్ప్ధలు రావడంతో, కొన్నాళ్ళకు విడాకులు తీసుకున్నారు. మరోవైపు మౌనిక రెడ్డి సైతం తన మొదటి భర్త నుంచి డివోర్స్ తీసుకుంది. ఆమెకు ఇప్పటికే ఒక బాబు కూడా ఉన్నాడు. మౌనిక దివంగత టీడీపీ భూమా నాగిరెడ్డి - శోభా రెడ్డిల రెండో కుమార్తె. ఆమె సోదరి భుమా అఖిల ప్రియ ప్రస్తుతం తెదేపాలో కొనసాగుతోంది.
ఇలా మౌనిక టీడీపీ నేత కుమార్తె కావడమే కాకుండా.. ఆల్రెడీ విడాకులు తీసుకున్న మహిళ అయినందున మోహన్ బాబుకు ఈ సంబంధం ఇష్టం లేదని గుసగుసలు వినిపించాయి. మోహన్ బాబు - విష్ణులు వైసీపీకి మద్దతుదారులు మాత్రమే కాదు, సీఏం జగన్ కు దగ్గరి బంధుత్వం కూడా ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన వ్యక్తి కూతురును కోడలిగా తెచ్చుకోవడం ఇష్టంలేకనే ఆయన ఈ పెళ్ళికి నో చెప్పారని పుకార్లు వినిపించాయి.
కానీ, మనోజ్ మాత్రం మోనిక రెడ్డినే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో మంచు ఫ్యామిలీలో గొడవలు కూడా జరిగాయని.. ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారి వేర్వేరు ఇళ్ళల్లో ఉండే పరిస్థితి వచ్చిందని రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అయితే అన్ని పుకార్లకు చెక్ పెడుతూ మోహన్ బాబు దంపతులు తమ చిన్న కొడుకు వివాహ వేడుకలో కనిపించారు.
తల్లిదండ్రులు ఈ వివాహం దగ్గరుండి జరిపించడమే కాకుండా, కోడలు మౌనికని మోహన్ బాబు తన కూతురు వలెనే హృదయానికి హత్తుకొని దీవించిన దృశ్యం కనిపించింది. అలాగే మనోజ్ అన్న మంచు విష్ణు కూడా ఈ వివాహానికి హాజరై ఆశీస్సులు అందజేశారు. అయితే ఇలా మంచు ఫ్యామిలీ అంతా దగ్గరుండి మనోజ్ పెళ్లి జరిపించడం వెనుక సోదరి మంచు లక్ష్మి ఉందనే టాక్ వినిపిస్తోంది.
మంచు లక్ష్మి తన తమ్ముడు మనోజ్ వివాహ బాధ్యత భుజాన వేసుకొని అన్నీ సవ్యంగా జరిపించింది. తల్లిదండ్రులు దీనికి దూరంగా ఉండగా.. తానే పెళ్లి పెద్దగా వ్యవహరిస్తూ.. దగ్గరుండి పనులు చూసుకుందట. తమ్మున్ని పెళ్లి కొడుకును చేయడంతో పాటు మౌనిక మెడలో మూడు ముళ్ళు వేసే వరకు అన్ని బాధ్యతలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అలానే తన తండ్రి సోదరుడితో మాట్లాడి మనోజ్ పెళ్ళికి వచ్చేలా చేసిందని కూడా టాక్ నడుస్తోంది. ఆ తర్వాత వారిని తిరుమల తిరుపతికి కూడా తీసుకెళ్లింది లక్ష్మి.
మొత్తం మీద తమ్ముడి ప్రేమకు అక్క మంచు లక్ష్మీ సపోర్ట్ గా నిలిచి తన మంచి మనసు చాటుకుంది. ఈ నేపథ్యంలోనే మనోజ్ తన సోదరికి కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం వల్లనే సిస్టర్ గా దొరికావ్ అంటూ మంచు లక్ష్మీకి థాంక్స్ చెప్పారు. ఇది సరిపోదా.. అక్కా తమ్ముళ్ల అనుబంధం గురించి చెప్పడానికి. ఏది ఏమైనా.. కొన్ని కారణాల వల్ల నెరవేరదేమో అనుకున్న మనోజ్ కలను.. మంచు లక్ష్మి మంచి మనసుతో నెరవేర్చింది. నిజంగా అలాంటి అక్క దొరకడం మనోజ్ అదృష్టమే. మరి మీరేమంటారు.