సినీ ఇండస్ట్రీలో చాలా గ్యాప్ తర్వాత 'ది కేరళ స్టోరీ' అనే సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది హీరోయిన్ ఆదాశర్మ. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'హార్ట్ ఎటాక్' అనే సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్గా పరిచయమైన ఆదాశర్మ మొదటి సినిమాతోనే తన యాక్టింగ్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అనంతరం తెలుగులో కొన్ని సినిమాలు చేసినా.. అవి ఆమెకు అంతగా గుర్తింపును తేలేకపోయాయి. దాంతో ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అలా తాజాగా 'ది కేరళ స్టోరీ' అనే సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా హీరోయిన్ ఆదాశర్మ ఫోన్ నెంబర్ ఆన్లైన్లో లీక్ అయినట్లు తెలుస్తోంది. ఓ సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఆదా శర్మ ఫోన్ నెంబర్‌ను ఆన్లైన్ లో లీక్ చేశాడు. దాంతో ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా ఆదాశర్మ ఫోన్ నెంబర్ తెగ వైరల్ గా మారుతుంది.


ఇలా ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆమె అభిమానులు ఆ ఇన్స్టాగ్రామ్ యూజర్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అయితే ప్రస్తుతం ఆదాశర్మ వాడుతున్న ఫోన్ నెంబర్ ను సోషల్ మీడియాలో లీక్ చేసిన ఆ యూజర్ ఆమె కొత్త నెంబర్‌ను కూడా లీక్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. 'జాముండా బోల్తే' అనే పేరుతో ఉన్న ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఆదా శర్మ ఫోన్ నెంబర్ను సోషల్ మీడియాలో లీక్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ ఆ యూజర్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా హైదరాబాద్, ముంబై ట్విట్టర్ హ్యాండిల్స్ కు ట్యాగ్ చేస్తూ మరీ ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ ఇన్స్టాగ్రామ్ యూజర్ అకౌంట్ డీయాక్టివేట్ అవ్వగా, అతను పెట్టిన పోస్టులు మాత్రం సోషల్ మీడియాలో ఇంకా వైరల్ గానే మారుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై హీరోయిన్ ఆదాశర్మ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి స్పందనను కనపరచలేదు.


బెదిరింపు కాల్స్ రావడం సాధారణంగా జరుగుతూనే ఉంటుందని, సెలబ్రిటీలకు ఇది మామూలే అంటూ  ఈ విషయాన్ని అంతగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ కొంతమంది సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ది కేరళ స్టోరీ సినిమాలో ఆదాశర్మ మెయిన్ లీడ్ పోషించగా.. సుదీప్తో సోన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విపుల్ అమృతల్ షా ఈ సినిమాని నిర్మించారు. టెర్రరిజం, ఇస్లామిక్ మతం, లవ్ జిహాద్ గురించి కొన్ని నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని విడుదలకు ముందు పలు వివాదాలు వెంటాడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా శాంతి భద్రతల కారణంగా ఈ సినిమాను ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నిషేధించారు. వెస్ట్ బెంగాల్లో ఈ సినిమాని పూర్తిగా నిషేధించడం జరిగింది. తమిళనాడులోనూ కొన్ని ప్రాంతాల్లోని థియేటర్స్ లో ఈ సినిమాకి అనుమతి ఇవ్వలేదు. కాగా బిజెపి పాలిత రాష్ట్రాలు మాత్రం ఈ సినిమాకి టాక్స్ మినహాయింపులు ఇవ్వడం గమనార్హం.


Also Read: పోస్టర్‌లో ఎన్టీఆర్‌ను అలా చూసి, ఆ సినిమా చూడకూడదు అనుకున్నారు: పరుచూరి గోపాలకృష్ణ