అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్రవేసుకున్న మహా నాయకుడు, నటుడు నందమూరి తారక రామారావు. ఆయన వ్యక్తిత్వం, సినిమాలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ తరం ప్రేక్షకులకు ఆయన గురించి పూర్తిగా తెలియకున్నా.. సీనియర్ నటీనటులు, సినీ ప్రముఖులు చెప్పే విషయాలు వింటే తప్పకుండా ఎన్టీఆర్‌కు అభిమాని అయిపోతారు. తాజాగా ఎన్టీఆర్, ఆయన నటించిన సాంఘిక చిత్రాల గురించి సినీ నటుడు, ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఒక అభిమానిగా తనకు ఎంతో ఇష్టమైన ఎన్టీఆర్ సినిమాల గురించి వివరించారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాల గురించి ప్రస్తావిస్తూ.. అలనాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు.


పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. "ఆ రోజుల్లో అన్నగారు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరూ సాంఘిక చిత్రాల్లో నటించేవారు. 'కన్యాశుల్కం' అనే సినిమాతో ఎన్టీఆర్ తానేంటో నిరూపించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన 'కలిసి ఉంటే కలదు సుఖం' సినిమాలో ఆయన పోస్టర్ చూసి చాలామంది అభిమానులు ఆ సినిమాకి వెళ్లాలని అనుకోలేదు. ఎందుకంటే ఆ సినిమాలో ఎన్టీఆర్ గారు దివ్యాంగుడి పాత్రలో నటించారు. అందుకే అభిమానులంతా తాము ఎంతగానో అభిమానించే హీరోను దివ్యాంగుడి పాత్రలో చూడ్డానికి ఇష్టపడలేదు. కానీ ఆ సినిమా క్లైమాక్స్ లో చూసిన ప్రేక్షకులంతా ఈలలు వేశారు. సినిమా పూర్తయి శుభం కార్డ్ పడిన తర్వాత కూడా థియేటర్లోనే చాలాసేపు అభిమానులు అలాగే నిలబడిపోయారు’’ అని తెలిపారు.


‘‘ఈ సినిమాని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఎన్టీఆర్ నటన కోసమైనా కచ్చితంగా చూడాలి. అలాగే ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో 'రక్తసంబంధం' అనే సినిమా అద్భుతంగా ఉంటుంది. అప్పటివరకు ఆయన పక్కన హీరోయిన్గా నటించిన సావిత్రి  'రక్తసంబంధం' సినిమాలో ఏకంగా ఆయనకు చెల్లెలుగా నటించి మెప్పించారు. 'కలిసి ఉంటే కలదు సుఖం' సినిమాలో భార్యాభర్తలుగా నటించిన ఎన్టీఆర్, సావిత్రి.. ఆ తర్వాత వచ్చిన 'రక్తసంబంధం' లో అన్నా చెల్లెలు గా అద్భుతమైన హావభావాలు పండించారు.


'రక్తసంబంధం' సినిమా అప్పట్లో ఏకంగా 25 వారాలు ఆడింది. అంటే 175 రోజులు ఆడింది. అలాగే ఎన్టీఆర్ గారి కెరియర్ లో 'గుండమ్మ కథ' అనే సినిమా మరో అద్భుతం. ఇప్పటి సినిమాలు చూసేవాళ్లంతా ఒక్కసారి 'గుండమ్మ కథ' సినిమా చూడాలి. అందులో ఎన్టీఆర్ గారి వేషధారణ, ఆయన చెప్పే డైలాగ్ లు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆ సినిమానైతే నేను ఎన్నిసార్లు చూశానో గుర్తులేని సినిమా అది. ఇక ఆ తర్వాత 'బడిపంతులు' సినిమా. నాకు ఉద్యోగం వచ్చిన కొత్తలో తాడేపల్లిగూడెంలో చూసిన సినిమా బడిపంతులు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ముసలివాడిగా కనిపించారు. టీచర్ల కష్టాలు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ ఆయన చివరి దశలో నటించిన 'కొండవీటి సింహం', 'బొబ్బిలి పులి', 'జస్టిస్ చౌదరి' సినిమాల్లో ఎన్టీఆర్ లోని సంపూర్ణమైన నటుడు బయటికి వచ్చారు" అని చెప్పుకొచ్చారు పరుచూరి గోపాలకృష్ణ.


Also Read: తోటి బైకర్కు అజిత్ సర్‌ప్రైజ్ - రూ.12.5 లక్షల విలువైన బైక్‌ గిఫ్ట్!