Thalapathy Vijay Last Movie: టాలీవుడ్ లో అపజయం ఎరుగని డైరెక్టర్ గా దూసుకెళ్తున్న టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. తాజాగా ఈ డైరెక్టర్ కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ చివరి సినిమాకి దర్శకత్వం వహించే గోల్డెన్ ఛాన్స్ ని మిస్ చేసుకున్నాడన్న వార్తని ప్రముఖ తమిళ నటుడు వీటీవీ గణేష్ బయట పెట్టారు.
విజయ్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన అనిల్
టాలీవుడ్లో హిట్ మెషిన్ గా దూసుకెళ్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఏ హీరోతో సినిమా చేసినా సరే ప్రేక్షకులను అలరించడంలో మాత్రం ఫెయిల్ అవ్వరు. ఆ హీరోలో ఉన్న ప్లస్ పాయింట్ ని పట్టుకొని, దానికి తనదైన శైలిలో కామెడీ టచ్ ఇస్తూ సినిమాను ఎంటర్టైనింగ్ తో పాటు ఎలివేషన్స్ తో ముందుకు తీసుకెళ్తారు అనిల్ రావిపూడి. ఇక ఇప్పటికే టాలీవుడ్లో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న అనిల్ రాయపూడికి తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చివరి సినిమాకి దర్శకత్వం వహించే గోల్డెన్ ఛాన్స్ వచ్చిందట. కానీ అనిల్ రావిపూడి మాత్రం ఆ ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. తాజాగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ప్రమోషన్లలో భాగంగా మ్యూజికల్ ఈవెంట్ ని నిర్వహించారు.
ఆ ఈవెంట్ లో తమిళ నటుడు వీటీవీ గణేష్ మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దాని గురించి మాట్లాడొద్దని అనిల్ రావిపూడి ఎంత రిక్వెస్ట్ చేసినా ఆయన వినలేదు. గణేష్ మాట్లాడుతూ "6 నెలల క్రితం విజయ్ తో షూటింగ్ చేస్తున్నప్పుడు నన్ను పిలిచి, భగవంత్ కేసరి సినిమాకు 5 సార్లు చూశానని, తన చివరి మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం చేస్తే బాగుంటుందని స్వయంగా అడిగారు. అయితే 'దళపతి 69' సినిమాకు దర్శకత్వం వహించమని నేను అనిల్ ని అడిగాను. కానీ ఆయన రిజెక్ట్ చేశాడు. కారణం ఏంటో తెలీదు గానీ ఇప్పుడు కూడా ఆయన చెప్పనివ్వట్లేదు. 'దళపతి 69' సినిమాకు దర్శకత్వం వహించడానికి నలుగురు పెద్ద డైరెక్టర్లు లైన్ లో ఉన్నారు. కానీ అదే ఛాన్స్ అనిల్ రావిపూడికి వస్తే ఆయన వద్దనుకున్నారు. ఆ మూవీ వద్దని 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీని డైరెక్ట్ చేశారు" అంటూ అసలు ఏం జరిగిందో వెల్లడించారు.
క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి
ఇక అనిల్ రావిపూడి కూడా ఈ విషయంపై స్పందిస్తూ రీమేక్ కు దర్శకత్వం చేయమన్నారు కాబట్టే 'దళపతి 69' సినిమాను రిజెక్ట్ చేసానంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ 'దళపతి స్వయంగా నాకు ఫోన్ చేశారు. దీని గురించి ఇద్దరి మధ్య డిస్కషన్స్ జరిగాయి. అయితే దళపతి 69 గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కాబట్టి దాని గురించి మాట్లాడడం లేదు. నా మీద ప్రేమతో గణేష్ ఈ విషయాన్ని బయటపెట్టారు. కానీ నాకు - విజయ్ కి మధ్య జరిగిన డిస్కషన్ వేరు. ఆయనంటే నాకు ఎంతో గౌరవం. స్క్రిప్ట్ కు చాలా ప్రాముఖ్యతను ఇస్తారు" అంటూ విజయ్ సినిమాను ఎందుకు రిజెక్ట్ చేసాడో చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి గత కొన్ని రోజులుగా 'దళపతి 69' మూవీ 'భగవంత్ కేసరి' మూవీకి రీమేక్ అని జరుగుతున్న ప్రచారాన్ని ఇటు అనిల్ రావిపూడి, అటు గణేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' ఈవెంట్ వేదికగా కన్ఫర్మ్ చేశారు.