రాజకీయం... ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. రాజకీయాలలో శాశ్వత శత్రువులు - మిత్రులు ఎవరు ఉండరని ఒక నానుడి. అందుకే రాజకీయ నేపథ్య చిత్రాలలో బోలెడన్ని మలుపులు, మెరుపులు ఉంటాయ్. మాస్ మసాలా కమర్షియల్ సినిమాకు కావాల్సిన కథ కథనాలు రాజకీయాలలో ఉంటాయి. 'ఒకే ఒక్కడు' వంటి పొలిటికల్ సినిమా తీసి భారతీయ ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు శంకర్.
సందేశాత్మక రాజకీయ సినిమాలు తీయడం దర్శకుడు శంకర్ శైలి. ఆయన తీసిన మెజారిటీ సినిమాలలో రాజకీయాల ప్రస్తావన ఉంటుంది. ఇప్పుడీ దర్శకుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'గేమ్ చేంజర్'తో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. దీనికి ముందు తెలుగులో వచ్చిన బెస్ట్ పొలిటికల్ డ్రామా లేదా థ్రిల్లర్ సినిమాలు ఏమున్నాయి? అందులో మీరు ఎన్ని చూశారు? ఒక లుక్కు వేయండి.
రానా దగ్గుబాటికి రాజకీయంతో విజయాలు!
తెలుగులో యువ కథానాయకులలో రాజకీయ నేపథ్య సినిమాతో వెండితెరకు పరిచయమైన హీరో రానా దగ్గుబాటి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'లీడర్' ఆయనకు మంచి పేరు తీసుకు రావడమే కాదు... తెలుగు నాట రాజకీయాలు ఎలా ఉంటాయో చూపించింది. 'లీడర్' తర్వాత రానా చేసిన మరొక పొలిటికల్ సినిమా 'నేనే రాజు నేనే మంత్రి'. తేజ దర్శకత్వం వహించారు. ఇదొక ఫిక్షనల్ బయోపిక్. ఇదీ మంచి హిట్. విలనిజంతో కూడిన హీరో పాత్రలో రానా అదరగొట్టారు.
అవినీతిపరుడైన తండ్రి (సుమన్) మరణం తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కుమారుడు పదవిని కాపాడుకోవడం కోసం ఓ కుమారుడు ఏం చేశాడు? తప్పనిసరి పరిస్థితుల్లో అవినీతిపరులకు మద్దతు ఇచ్చిన తర్వాత ఎటు వైపు అడుగులు వేశాడు? అనేది 'లీడర్' కథ అయితే... 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో ఒక సామాన్య వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎటువంటి అడుగులు వేశాడు అనేది చూపించారు రానా.
భరత్ అనే నేను... మహేష్ బాబు క్లాస్ హిట్!
రాజకీయ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన సినిమా 'భరత్ అనే నేను'. 'లీడర్' సినిమాలో తండ్రి మరణం తర్వాత విదేశాల నుంచి వచ్చిన కుమారుడు ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాడో... ఈ సినిమాలోనూ ఇంచు మించు అంతే! అయితే, రెండు సినిమాల్లో ప్రస్తావించిన అంశాలు వేర్వేరు. విద్యా వ్యవస్థను కొంతమంది వ్యాపారంగా ఎలా మార్చినది చూపించడం నుంచి ట్రాఫిక్ నిబంధనలను సామాన్యులు ఎలా ఉల్లంఘిస్తున్నారు అనే అంశం వరకు దర్శకుడు కొరటాల శివ చాలా అంశాలను ప్రస్తావించారు.
వెండితెరపై వైయస్ ఫ్యామిలీ రాజకీయ 'యాత్ర'
తెలుగులో తెరకెక్కిన రాజకీయ బయోపిక్స్ చాలా తక్కువ. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ 'యాత్ర' సినిమా తీసి విజయం సాధించారు. ఆ తరువాత రాజశేఖర్ రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ముందు చేసిన పాదయాత్ర నేపథ్యంలో 'యాత్ర 2' చేశారు. అయితే మొదటి చిత్రానికి వచ్చిన స్పందన రెండు చిత్రానికి రాలేదని చెప్పాలి.
చిత్రసీమలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితంపై ఆయన తనయుడు బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ రూపొందింది. రెండో భాగంలో రాజకీయాలే ప్రధాన అంశంగా ఉంటాయి.
రాజకీయ సినిమాలలో 'ప్రస్థానం' చాలా ప్రత్యేకం!
తెలుగులో వచ్చిన రాజకీయ నేపథ్య చిత్రాలలో దర్శకుడు దేవ కట్టా తీసిన ప్రస్థానం చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. రాజకీయాలకు మాత్రమే ఆ కథ పరిమితం కాలేదు... కుటుంబ రాజకీయాలతో పాటు సవతి సోదరుల మధ్య పోరును సైతం చక్కగా ఆవిష్కరించారు. సాయి దుర్గా తేజ హీరోగా దేవ కట్టా దర్శకత్వం వహించిన 'రిపబ్లిక్' సినిమాలోనూ రాజకీయాల ప్రస్తావన ఉంటుంది. ప్రభుత్వ అధికారులపై రాజకీయ నేతల ఒత్తిడి ఎలా ఉంటుంది? అధికారంలో ఉన్న నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తారు? వంటి అంశాలను ఆ సినిమాలో ఆవిష్కరించారు.
రాజకీయం... వ్యక్తిగతం... పవన్ కళ్యాణ్ చిత్రం!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాలో కూడా రాజకీయ నేపథ్యం ఉంటుంది. అందులో ప్రకాష్ రాజ్ పాత్ర చిత్రీకరణ పట్ల అప్పట్లో కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఉద్యమం చేసిన నాయకుడి స్ఫూర్తితో విలన్ పాత్ర చిత్రీకరించాలని ఆగ్రహం చూపించారు. బాలకృష్ణ 'లెజెండ్' సినిమాలో రాజకీయాల ప్రస్తావన ఉంటుంది. డబ్బుకు ఆశపడి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, రాజకీయ నేతల అమ్మకాలు - కొనుగోలు, బేరసారాలు వంటివి ఉంటాయి. చిరంజీవి 'గాడ్ ఫాదర్' కూడా పొలిటికల్ బేస్డ్ ఫిల్మే.
Also Read: సుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?
ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ హీరో నారా రోహిత్ రాజకీయాల నేపథ్యంలో రెండు సినిమాలు చేశారు. ముఖ్యమంత్రిని ఓ సామాన్యుడు ప్రశ్నించే కథతో 'ప్రతినిధి తెరకెక్కించారు. ఆ సినిమాకు మంచి స్పందన లభించింది. అయితే 'ప్రతినిధి 2' ఆశించిన విజయం సాధించలేదు. పోసాని కృష్ణమురళి రచన, దర్శకత్వంలో శ్రీకాంత్ కథానాయకుడిగా వచ్చిన 'ఆపరేషన్ దుర్యోధన' సంచలన విజయం సాధించింది. జగపతిబాబు హీరోగా నటించిన 'అధినేత', రాజశేఖర్ 'ఎవడైతే నాకేంటి' సినిమాలు కూడా ప్రేక్షకుల మన్ననలు పొందాయి.
Also Read: చిరంజీవి షూస్ చూడటానికి సింపులే... కానీ, కొనాలంటే ఎంత రేటో తెలుసా?