జాతర... అప్డేట్స్ జాతర... ఒకట్రెండు కాదు, పదికి పైగా సినిమాల అప్డేట్స్ ఒక్కరోజు వచ్చాయి. తెలుగు సినిమాలో స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన కొత్త కబుర్లు వచ్చాయి. విజయ దశమి సందర్భంగా టాలీవుడ్ టాప్ స్టార్స్ సినిమాల అప్డేట్స్ వచ్చాయి. అందులో ముఖ్యమైన అప్డేట్స్ ఏవి? ఎవరెవరు ఏయే కబుర్లు చెప్పారు? అనేది ఒక్కసారి చూడండి.


బాలకృష్ణ ట్రిపుల్ ధమాకా... సినిమాలతో పాటు షో కూడా!
నట సింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఈ విజయ దశమి నిజమైన పండగ అని చెప్పాలి. 'ఇది బాలయ్య పండగ' అంటూ ఆహా ఓటీటీ 'అన్ స్టాపబుల్'‌ సీజన్ 4 షో ట్రైలర్ విడుదల చేసింది. నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దాంతో పాటు కొత్త సినిమాల అప్డేట్స్ కూడా ఇచ్చారు.


బాబి కొల్లి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని ప్రకటించారు నిర్మాత సూర్యదేవర నాగ వంశీ. ఈ దీపావళికి టైటిల్ టీజర్ విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఈ చిత్రానికి 'సర్కార్ సీతారాం' టైటిల్ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.‌ దీని తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేయనున్నారు. ఆ సినిమా ప్రారంభోత్సవం ఈ నెల 26న జరగనుందని చెప్పారు.






మెగా అప్డేట్స్... చిరు, పవన్, చరణ్ సందడి!
మెగా అభిమానులకు విజయదశమి రోజు మూడు అప్డేట్స్ వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న తాజా సినిమా విశ్వంభర టీజర్ విడుదల చేశారు. అలాగే, ఏపీ వరద సహాయక చర్యలకు అనౌన్స్ చేసిన కోటి రూపాయల విరాళం చెక్ అందించడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లారు చిరు. 



'విశ్వంభర' టీజర్ విడుదలకు కొన్ని గంటల ముందు ఆ సినిమా సంక్రాంతికి విడుదల కావడం లేదని... తాము రిక్వెస్ట్ చేయడంతో వాయిదా వేసుకున్నారని నిర్మాత 'దిల్' రాజు తెలిపారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఆయన నిర్మిస్తున్న 'గేమ్ చేంజర్'ను సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల చేయనున్నట్లు స్పష్టత ఇచ్చారు.


Also Readచిరంజీవి షూస్ చూడటానికి సింపులే... కానీ, కొనాలంటే ఎంత రేటో తెలుసా?



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఏయం రత్నం నిర్మాణంలో ఓ హిస్టారికల్ సినిమా 'హరిహర వీరమల్లు' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పాట పాడారు. త్వరలో ఆ పాట విడుదల చేస్తామని... అలాగే, అక్టోబర్ 14 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించి, నవంబర్ 10 నాటికి చిత్రీకరణ అంతా పూర్తి చేస్తామని చిత్ర బృందం తెలిపింది.


క్రిస్మస్ సీజన్ తెలుగు సినిమాలపై క్లారిటీ...
రామ్ చరణ్ కాదు... నితిన్ అండ్ ప్రియదర్శి!
డిసెంబర్ 20న 'గేమ్ చేంజర్' విడుదల అవుతుందని క్రిస్మస్ సీజన్ మీద ఇతర సినిమాలు కాన్సెంట్రేట్ చేయలేదు. ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడడంతో మిగతా సినిమాలు థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతున్నాయి. 


నితిన్, శ్రీ లీల జంటగా 'భీష్మ' దర్శకుడు వెంకీ కుడుములు రూపొందిస్తున్న సినిమా 'రాబిన్ హుడ్'. ఈ చిత్రాన్ని ముందుగా డిసెంబర్ 20 విడుదల చేయాలని అనుకున్నారు. అయితే... 'గేమ్ చేంజర్' వస్తుందని సైలెంట్ అయ్యారు. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా విడుదల వాయిదా పడడంతో మరోసారి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేస్తూ దసరాకు కొత్త పోస్టర్ విడుదల చేశారు.

ప్రియదర్శి హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న 'సారంగపాణి జాతకం' చిత్రాన్ని సైతం డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు దసరాకు ప్రకటన వచ్చింది.


Also Readమర్డర్ తర్వాత 'బిగ్ బాస్' క్యాన్సిల్ చేసి మరీ సల్మాన్ ఖాన్ ఎందుకు వెళ్లారు? ఆస్పత్రికి బాలీవుడ్ స్టార్స్ క్యూ కట్టారెందుకు? ఎవరీ బాబా సిద్ధిఖీ??



కొత్త సినిమా కబుర్లతో నాని, రామ్...
హిస్టారికల్ యాక్షన్స్ ఫిలింతో సిద్ధూ!
'దసరా' దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాచురల్ స్టార్ నాని మరో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. 'దసరా' నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించే ఈ సినిమాను విజయదశమి నాడు పూజతో ప్రారంభించారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు.


రామ్ పోతినేని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఓ సినిమా నిర్మించనున్నారు. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను విజయదశమికి అనౌన్స్ చేశారు. 


'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' సినిమాలతో యువతలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. ఆయన హీరోగా 'కోహినూర్' అనే హిస్టారికల్ యాక్షన్ సినిమాను విజయదశమి సందర్భంగా ప్రకటించారు. జనవరి 2026లో విడుదల చేస్తామని చెప్పారు. 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' తర్వాత ఆ చిత్రాల నిర్మాతలు సిద్ధూతో చేస్తున్న చిత్రమిది. 


'మ్యాడ్' ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా '8 వసంతాలు'. 'మను'తో దర్శకుడిగా పరిచయమైన ఫణీంద్ర నర్సెట్టితో చేస్తున్న కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ టీజర్ దసరాకు విడుదల చేశారు.


Also Readథియేటర్లు ఖాళీ, అలియా టికెట్స్ కొని ఫేక్ కలెక్షన్స్ చెబుతోంది - 'జిగ్రా' బాగోతం బట్టబయలు చేసిన నిర్మాత భార్య