గురుర్బహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్‌ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః.. సమాజంలో 'గురువు'కు ఉన్న స్థానం ఎంతో ఉన్నతమైనది. ‘గు’ అంటే చీకటి, ‘రు’ అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మనలో అజ్ఞాన పొరలు తొలగించి, జ్ఞానదీప్తిని వెలిగించేవాడు 'గురువు'. మ‌న‌లోని శ‌క్తి సామ‌ర్థ్యాలను మొద‌ట‌గా గుర్తించే వ్యక్తి గురువు. ఎప్ప‌టిక‌ప్ప‌డు మ‌న‌ల్ని మార్గ‌నిర్దేశం చేస్తూ జీవితానికి భ‌రోసా కల్పించేది గురువు. కృషి ఉంటే ఏదైనా సాధ్య‌మ‌నే ధైర్యాన్ని అందించే గురువు పాత్ర ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎంతో కీల‌కం. భవిష్యత్ తరాలను సమున్నతంగా తీర్చిదిద్దే 'ఉపాధ్యాయులు' వెండితెరపైనా ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగునాట గురువుల ప్రాధాన్యం తెలియజేసే సినిమాలు ఎన్నో వచ్చాయి. నేడు ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబరు 5 - టీచర్స్ డే) సందర్భంగా గురువుల గొప్పదనాన్ని చాటిచెప్పిన సినిమాలు, గురువులపై వచ్చిన సినిమాల గురించి తెలుసుకుందాం!


'బడిపంతులు': నట సార్వభౌమ నందమూరి తారకరామారావు కథానాయకుడిగా పి. చంద్రశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'బడిపంతులు'. 1972లో వచ్చిన ఈ సినిమా ఆనాటి ఉపాధ్యాయుల స్థితిగతులను తెలియజెప్పడమే కాదు, గురువుల గొప్పదనాన్ని చాటిచెప్పింది. ఇందులో నిజాయితీతో విలువలతో కూడిన జీవితం గడిపే టీచర్ గా ఎన్టీఆర్ కనిపించారు. ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు ఎలా ఉండాలనేది ఆయన పాత్ర ద్వారా తెలియజెప్పారు. ఈ సినిమాలో రామారావు మనవరాలిగా అలనాటి నటి శ్రీదేవి నటించడం విశేషం. 


'విశ్వరూపం': ‘బడిపంతులు’ తర్వాత ఎన్టీఆర్‌ అధ్యాపకుడి పాత్రలో నటించిన చిత్రం ‘విశ్వరూపం’. 1981లో దర్శకరత్న దాసరి నారాయణ రావు ఈ సినిమాని తెరకెక్కించారు. విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండాలని, స్వార్థపరులైన రాజకీయ నాయకుల కుట్రలకు బలికావద్దని భోదించే చిత్రమిది. స్వార్థ రాజకీయ కుట్రలకు విద్యార్థులు ఏవిధంగా బలి అవుతుందన్న విషయాన్ని దాసరి చక్కగా వివరించారు. ఇందులో కళాశాలలో దారి తప్పుతున్న విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పిన లెక్చరర్‌ పాత్రలో ఎన్టీఆర్‌ నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. టీచర్స్ డే సందర్భంగా ప్రతీ స్కూల్ లో ప్రదర్శించే ‘నూటికో కోటికో ఒక్కరూ.. ఎప్పుడో ఎక్కడో పుడతారు.. మా దేవుడు మీరే మాస్టారు’ ఈ సినిమాలోనిదే.


'హై హై నాయకా': 1989లో జంధ్యాల దర్శకత్వంలో నరేష్ హీరోగా నటించిన చిత్రం 'హై హై నాయకా'. తండ్రి గారాబంతో చిన్నా పెద్దా తేడా లేకుండా బూతులు మాట్లాడే చిన్నపిల్లవాడిని ఒక తెలుగు పంతులు ఎలా మార్చాడన్నది ఈ చిత్ర ప్రధాన కథాంశం. గురువుల స్థితిగతులు, తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది జంధ్యాల తనదైన శైలి హాస్యాన్ని జోడించి చెప్పారు. 


Also Read: 'ఖుషి' విజయాన్ని పురస్కరించుకుని రూ.1 కోటి విరాళం ప్రకటించిన విజయ్ దేవరకొండ


'సుందరకాండ': విక్టరీ వెంకటేష్ హీరోగా కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సుందరకాండ'. లెక్చరర్ ను ప్రేమించిన ఒక అమ్మాయి కథ ఇది. ఇందులో లెక్చరర్ పాత్రలో వెంకీ చాలా న్యాచురల్ గా నటించారు. 1992లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించడమే కాదు, పలు అవార్డులు అందుకుంది. ఇది తమిళంలో కె. భాగ్యరాజా స్వీయదర్శకత్వంలో నటించిన 'సుందరకాండం' చిత్రానికి రీమేక్.  


'మాస్టర్': మెగాస్టార్ చిరంజీవి లెక్చరర్ గా నటించిన మొదటి సినిమా ‘మాస్టర్‌’. 1997లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇందులో పెడదారి పట్టిన విద్యార్థులను మంచివారిగా తీర్చిదిద్దడమే కాదు, కాలేజీ వాతావరణాన్ని కలుషితం చేయడానికి ట్రై చేస్తున్న రౌడీ మూకలకు సరైన బుద్ధి చెప్పే తెలుగు మాస్టర్ గా చిరు కనిపిస్తారు. ఓవైపు క్లాస్‌లో పాఠాలు చెబుతూనే, మరోవైపు క్యాంటీన్‌లో ప్రేమ పాటలు చెప్పడం ప్రేక్షకులను బాగా అలరించింది. 2020లో 'మాస్టర్' టైటిల్ తో తలపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందింది. జువైనల్ హోంకు టీచర్ గా వెళ్లిన హీరో, జైల్లో జరుగుతున్న డ్రగ్స్ వ్యాపారాన్ని ఎలా రూపుమాపాడనేది ఈ చిత్రంలో చూపించారు. 


'ఠాగూర్‌': 'మాస్టర్' తర్వాత చిరంజీవి అధ్యాపకుడిగా కనిపించిన చిత్రం 'ఠాగూర్‌'. సమాజంలో పేరుకుపోయిన అవినీతి, లంచగొండితనాలపై తన విద్యార్థులను అస్ర్తాలుగా సంధించే ఓ ప్రొఫెసర్‌ కథని ఈ సినిమాలో చూపించారు. ‘యాంటీ కరప్షన్‌ ఫోర్స్‌’ (ఏసీఎఫ్‌) తో ఠాగూర్‌ అవినీతిపరులకు ఎలా బుద్ధిచెప్పాడనేది ప్రధానాంశం. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి, మెగాస్టార్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తిండిపోయే మూవీగా నిలిచింది. ఇది తమిళ్ లో హిట్టైన 'రమణ' సినిమాకి రీమేక్ అనే సంగతి తెలిసిందే. 


ఇవే కాకుండా ఉపాధ్యాయుల గొప్పదనాన్ని తెలియజెప్పిన మరికొన్ని సినిమాలు ఉన్నాయి. జంధ్యాల దర్శకత్వంలోనే తెరకెక్కిన ‘ఆనందభైరవి’ సినిమా శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకోవడానికి అర్హత కులం కాదనీ, గుణమే అనీ నిరూపించింది. ‘కోడెనాగు’, ‘త్రిశూలం’, ‘రేపటి పౌరులు’ వంటి చిత్రాలు గురువుల ప్రాధాన్యాన్ని తెలియజేస్తూనే, మంచి విజయాలు అందుకున్నాయి. విశ్వనాథ్‌, బాపు వంటి దర్శకులు ఏ ఇతివృత్తంతో సినిమాలు తీసినా గురువు ఘనతను తెలియజేసే ఒకట్రెండు సన్నివేశాలైనా జోడిస్తుంటారు. 


‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’, ‘స్వర్ణ కమలం’, ‘స్వాతి కిరణం’ సినిమాలలో గురువు ఔన్నత్యాన్ని చూపించారు. ‘పిల్ల జమీందారు’ సినిమాలో ‘భాష చచ్చిపోతున్నది. ఎలాగైనా బతికించుకోవాలి’ అని ఆరాటపడే తెలుగు మాస్టార్ గా ఎమ్మెస్‌ నారాయణ ఆకట్టుకున్నారు. అలానే 'మిరపకాయ్' మూవీలో మాస్ రాజా రవితేజ హిందీ లెక్చరర్ గా కనిపించి అలరించారు. ఇక హిందీలో గురువుల నేపథ్యంలో 'హిచ్కి', 'తారే జ‌మీన్ ప‌ర్', 'సూప‌ర్ 30', 'బ్లాక్' వంటి చిత్రాలు వచ్చాయి.


Also Read: డబ్బులిచ్చి మరీ నా మీద, నా సినిమాపైన దాడులు చేయిస్తున్నారు - విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial