Kollywood Film News: యూట్యూబ్ చానెళ్లు, కొంత మంది రివ్యూ రైటర్లు సినిమా సక్సెస్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు తమిళ సినిమా నిర్మాతల మండలి భావిస్తున్నది. వారిని కట్టడి చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే  యూట్యూబ్ ఛానెళ్లలను ఎట్టి పరిస్థితుల్లో థియేటర్ల ప్రాంగణంలోకి రానివ్వకూడదని నిర్ణయించింది. ఈ మేరకు నిర్మాతల మండలి ఏకగ్రీవ తీర్మానం చేసింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది.  


యూట్యూబ్ ఛానెళ్ల విశ్లేషణలకు కట్టడి


ఈ ఏడాది విడుదలైన చాలా సినిమాలపై ప్రతికూల రివ్యూలు ప్రభావం చూపించాయని నిర్మాతల మండలి అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలైన తొలి రోజు యూట్యూబ్ ఛానెళ్లలను థియేటర్లలోకి అనుమతించకూడదని నిర్ణయించినట్లు వెల్లడించింది. “ఈ సంవత్సరం రిలీజ్ అయిన చాలా సినిమాల మీద నెగెటివ్ రివ్యూలు తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ రివ్యూల కారణంగానే ‘ఇండియన్ 2’, ‘వేట్టయాన్’, ‘కంగువా’ లాంటి చిత్రాల వసూళ్ల మీద ఎఫెక్ట్ పడింది. యూట్యూబ్ ఛానెళ్ల రివ్యూలు సినిమా పరిశ్రమకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ప్రతికూల పరిస్థితులను కట్టడి చేసేందుకు సమిష్టిగా కీలక నిర్ణయం తీసుకున్నాం. థియేటర్ల యాజమాన్యాలు యూట్యూబ్ చానెళ్లను తమ ప్రాంగణంలోకి రానివ్వకూడదు. తొలి రోజు, తొలి షో సమయంలో పబ్లిక్ రివ్యూలకు అవకాశం కల్పించకూడదు. రివ్యూల పేరుతో సినిమా నిర్మాతలను, దర్శకులను, నటీనటులను వ్యక్తిగతంగా విమర్శిచాడన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాం. ఇకపై పద్దతి మార్చుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం” అని నిర్మాతల మండలి వెల్లడించింది.  


తమిళనాట రివ్యూ రైటర్ల అత్యుత్సాహం


తెలుగు సినిమా పరిశ్రమలో రివ్యూ రైటర్లతో పోల్చితే తమిళనాడులో పరిస్థితి కాస్త శృతి మించి ఉంటుంది. కొంత మంది రివ్యూ రైటర్లు, కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు పనిగట్టుకుని నెగెటివ్ ప్రచారాన్ని మొదలు పెట్టేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. తమ వ్యూస్ కోసం ఫిల్మ్ మేకర్స్ ను, యాక్టర్లను పర్సనల్ గా అటాక్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, కమల్ హాసన్ నటించిన ‘ఇండియన్ 2’ సినిమాపై తీవ్ర స్థాయిలో నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ సినిమాలోని నటీనటులు, దర్శక నిర్మాతలపై అసభ్య రీతిలో విమర్శలు చేశారు. రీసెంట్ గా విడుదలైన ‘కంగువా’ విషయంలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. సూర్య నటన బాగుందని ప్రశంసించినప్పటికీ, ఓవరాల్ గా సినిమాపై నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జ్యోతిక నేరుగా రివ్యూ రైటర్ల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. నెగెటివ్ అంశాలనే కాదు, పాజిటివ్ అంశాలను కూడా ప్రస్తావించాలని సూచించింది. చాలా సినిమాల్లో మహిళలను కించపరిచినా, సన్నివేశాలు బాగాలేకపోయినా ఇలాంటి రివ్యూలు చూడలేదన్నారు. తొలి రోజునూ ‘కంగువా’ సినిమాపై గతంలో ఎప్పుడూ లేని రీతిలో నెగెటివ్ ప్రచారం చేయడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలకు ఇండస్ట్రీ నుంచి మంచి మద్దతు లభించింది. సినిమా రివ్యూలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు.  


Read Also: వేణు ఉడుగుల నిర్మాణంలో మట్టి పరిమళాల కురిపించే ప్రేమ కథ... తండేల్ వచ్చిన వెంటనే థియేటర్లలోకి