Raju weds Rambhai Movie: చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు ఉడుగుల. ‘నీదీ నాదీ ఒకే కథ’, ‘విరాట ప‌ర్వం’ లాంటి సినిమాలో దర్శకుడిగా సత్తా చాటుకున్నారు. ‘విరాటపర్వం’ సినిమా తర్వాత ఆయన చాలా కాలంగా మరో సినిమా ప్రకటించలేదు. తాజాగా ఆయన నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సాయిలు కంపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ... ఈటీవీ విన్‌, రాహుల్ మోపిదేవితో క‌లిసి ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేశారు. 


ఆకట్టుకునే విలేజ్ లవ్ స్టోరీ!


‘రాజు వెడ్స్‌ రాంబాయి’ టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మట్టి పరిమళాలను వెదజల్లే ప్రేమకథగా తెరకెక్కినట్లు అర్థం అవుతోంది. “నా పేరు య‌న‌గంటి రాంబాయి... మా నాన్న పేరు య‌న‌గంటి వెంక‌న్న” అంటూ ఫిమేల్ వాయిస్‌ తో టీజ‌ర్ మొద‌ల‌వుతుంది. “నేను మా ఊళ్ల‌నే ఒక అబ్బాయిని ప్రేమించిన... వాడి పేరు రాజు. నిజానికి ఒక అమ్మాయి ప్రేమించడానికి కావాల్సిన అర్హ‌త‌లు వాడి ద‌గ్గ‌ర ఒక్క‌టి కూడా లేవు. కానీ వాడు బ్యాండు కొట్టుడు చూసి ప‌డిపోయిన. బొగ్గుతోని మా ఇల్లందు మండ‌లంకి ఎంత‌పేరు వ‌చ్చిందో మా ప్రేమ‌తో మా ఊరికి అంతా పేరు వ‌చ్చింది. మా ప్రేమ ఒక తీన్మార్... ఒక దోమార్... ఒక నాగిని... ఇంట్లాంటి మా క‌థ‌ను సాయిలు కంపాటి సార్ సినిమా తీస్తుండు” అంటూ టీజ‌ర్‌ లో చూపించారు. తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్, ఖ‌మ్మం జిల్లాల సరిహ‌ద్దుల మ‌ధ్య ఉన్న గ్రామంలోని నిజ జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 14న ప్రేమికుల దినోత్సవం కానుకగా విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి నటీనటుల వివరాలను వెల్లడించనున్నారు.






వాస్తవ ఘటన ఆధారంగా రాసిన కథతో... వేణు ఉడుగుల


టైటిల్ గ్లింప్స్ లాంచ్ సందర్భంగా మాట్లాడిన వేణు, ఈ సినిమాను సాయిలు వాస్తవ ఘటన ఆధారంగా రాసిన కథతో తెరకెక్కించినట్లు వెల్లడించారు. “ఒక వాస్తవ సంఘటన ఆధారంగా చేసుకుని సాయిలు రాసిన కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ కథ విన్నప్పుడు నాకు అద్భుతం అనిపించింది. ఎగ్జైట్‌మెంట్‌ కలిగింది. కథలో ఉన్న ఇన్నోసెన్స్, కథ జరిగే ప్రాంతం, పాత్రలు, ఆ పాత్రల మధ్య సంఘర్షణ బాగా అట్రాక్ట్ చేశాయి. క్లైమాక్స్ మూడు రోజులపాటు నిద్రపోనివ్వలేదు. ఇంత వైవిధ్యమైనటువంటి ప్రేమ కథని నేనెప్పుడూ చూడలేదు. వినలేదు. ఈ కథని సినిమాగా తీయాలని స్ట్రాంగ్ ఇంటెన్షన్ తో ఈటీవీ విన్ వాళ్లతో షేర్ చేయడం జరిగింది. వాళ్లు కూడా కథ విని హ్యాపీగా ఫీలయ్యారు. ఈ కొలాబరేషన్ తో మీ ముందుకు వచ్చాం. ఇప్పుడు టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశాం. ఇది మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా వుంది” అన్నారు.


“ఇది రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ కథ. పాత్రలన్నీ చాలా సహజంగా వుంటాయి.  వేణు, మేం కలసి ప్రొడ్యూస్ చేసి థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. సినిమా తప్పకుండా అందరినీ గొప్పగా అలరిస్తుంది” అని ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.  “థియేటర్స్ కి సత్తా వున్న కథని తీసుకెళ్దామని అనుకున్నాం. అందులో మేము చేస్తున్న మొదటి ప్రయత్నం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ కథ విన్నప్పుడే థియేటర్స్ సినిమా అనుకున్నాం.  గొప్ప థియేటర్స్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది” అని ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ వెల్లడించారు. 


ఈ సినిమాకును ధోలముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్స్ టేల్స్ బ్యానర్లపై వేణు ఉడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, మిట్టపల్లి సురేందర్ సాహిత్యం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా వాజిద్ బేగ్ వ్యవహరిస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను నరేష్ అడుప చూసుకుంటున్నారు. 


Read Also: మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్