Vishwak Sen’s Warning to Review Writers : టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మెకానిక్ రాకీ’. కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా వరంగల్ లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. ఈ వేడుకలో ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ను కూడా లాంఛ్ చేశారు.
పర్సనల్ అటాక్ చేస్తే బాగోదు- విశ్వక్ సేన్
ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన విశ్వక్ సేన్ రివ్యూ రైటర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నటీనటుల పర్సనల్ వ్యవహారాల గురించి అటాక్ చేస్తే వీపులు పగులుతాయంటూ వార్నింగ్ ఇచ్చారు. “మేం చాలా కష్టపడి సినిమాలు చేస్తాం. ఎంతో కష్టపడి ప్రమోట్ చేసుకుంటాం. సినిమా క్రిటిక్స్, రివ్యూవర్స్ సినిమా గురించి ఏం రాసిన పర్వాలేదు. కానీ, పర్సనల్ అటాక్ చేయకూడదని కోరుతున్నాను. రివ్యూ రైటర్లు పర్సనల్ ఒపీనియన్ చెప్పినప్పుడు, ఆ పర్సనల్ ఒపీనియన్ పై మాట్లాడే ఫ్రీడమ్ అఫ్ స్పీచ్ మాకు ఉంది. సినిమా ప్రచారంలో భాగంగా నేను మా టీమ్ కష్టం గురించి చెప్పా. దాన్ని కొందరు ట్రోల్ చేశారు. మేం ఇలానే మా సినిమాలను ప్రమోట్ చేసుకుంటాం. మేం ఏ తప్పూ చేయట్లేదు. చోరీలు అస్సలే చేయట్లేదు. గర్వంగా సినిమాలు చేస్తున్నాం.
ఇటీవల ‘మెకానిక్ రాకీ’ సినిమా ఫైనల్ కాపీ చూశా. ఈ సినిమా ఆడకపోతే షర్ట్ లేకుండా చెక్ పోస్ట్ దగ్గర తిరుగుతా, ఫిల్మ్ నగర్ లో ఉన్న ఇల్లు ఖాళీ చేస్తానని ఛాలెంజ్ చేయాలనుకోవట్లేదు. ఇది హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇక్కడే ఉంటా. ‘నేనింతే’లో రవితేజ చెప్పినట్టు.. నాకు తెలిసిందొక్కటే సినిమా.. సినిమా.. సినిమా. రివ్యూవర్లపై నాకు గౌరవం ఉంది. కానీ, రాసేటప్పుడు రివ్యూవర్లు కూడా బాధ్యతగా ఉండాలి. ఈ సినిమా తర్వాత రివ్యూస్ గురించి క్రిటిక్స్ గురించి నేను మాట్లాడను. మీరు స్వేచ్ఛగా రాసుకోవచ్చు. కానీ, పర్సనల్ విషయాల జోలికి రాకండి. లేదంటే వీపులు పగిలిపోతాయ్. నేను చేసిన పది సినిమాల అనుభవంతో చెబుతున్నాను. ఇది చాలా మంచి సినిమా. ఐదు నిమిషాలు కూడా బోర్ కొట్టదు” అన్నారు.
వరంగల్ అభిమానుల ప్రేమకు హీరోయిన్లు ఫిదా
ఇక వరంగల్ అభిమానులు తమ పట్ల చూపించిన ప్రేమకు ఫిదా అయినట్లు హీరోయిన మీనాక్షి చౌదరి చెప్పారు. ఫస్ట్ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చిందన్న ఆమె, రెండో ట్రైలర్ కూడా నచ్చుతుందన్నారు. యూత్ అండ్ మాస్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్నారు. అటు ఈ సినిమాను అందరూ థియేటర్స్ లో చూడాలని మరో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కోరారు. సినిమా బంపర్ హిట్ అయిన తర్వాత మళ్లీ అందరిని కలుస్తామన్నారు. ఈ మూవీని ఎస్‌ఆర్‌టి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించారు. జోక్స్ బిజోయ్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
Read Also: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు