AR Rahman Divorce: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ జీవితంలో సంచలన పరిణామం చోటు చేసింది. సుమారు మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆయన సతీమణి సైరా బాను ప్రకటించారు. ఈ మేరకు ఆమె లాయర్ వందనా షా విడాకుల ప్రకటనను విడుదల చేశారు. భావోద్వేగపూరితమైన గాయం కారణంగా రెహమాన్ నుంచి సైరా విడిపోతున్నారని లాయర్ ఈ ప్రకటనలో వెల్లడించారు. ఈ ప్రకటనపై తాజాగా రెహమాన్ రియాక్ట్ అయ్యారు.
భార్య విడాకుల ప్రకటనపై స్పందించిన రెహమాన్
తన భార్య వివాడాకుల ప్రకటన చేసిన నేపథ్యంలో రెహమాన్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టు పెట్టారు. “మా వివాహ బంధం త్వరలోనే 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని భావించాం. ఇంతలోనే అనూహ్య రీతిలో ముగింపు పలకాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. పగిలిన హృదయాలు దైవ నిర్ణయాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ విరిగిన మనసులు మళ్లీ అతుక్కోలేవు. కఠిన పరిస్థితులలో తమ వ్యక్తిగత ప్రైవసీని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను” అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
రెహమాన్ భార్య తన ప్రకటనలో ఏం చెప్పిందంటే?
నవంబర్ 19న సాయంత్రం రెహమాన్ భార్య విడాకుల గురించి కీలక ప్రకటన చేసింది. ఆమె తన న్యాయవాది వందన ద్వారా ఈ ప్రకటనను రిలీజ్ చేయించింది. గత కొద్ది సంవత్సరాలుగా మానసిక బాధకు గురైన తర్వాతే విడాకుల ప్రకటన చేస్తున్నట్లు అందులో వెల్లడించారు. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతోనే 29 ఏండ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించారు. ‘‘పెళ్లయిన చాలా సంవత్సరాల తర్వాత భర్త రెహమాన్ నుంచి విడిపోవాలని సైరా బాను కఠిన నిర్ణయం తీసుకున్నారు. వారి వైవాహిక బంధానికి తగిలిన భావోద్వేగ గాయం కారణాంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఒకరిపై మరొకరికి ప్రేమ ఉన్నప్పటికీ, దంపతుల మధ్య చెలరేగిన ఇబ్బందికర పరిస్థితులు ఇద్దరినీ ఒక్కటిగా కలిసి ఉండనివ్వలేదు. ఈ నేపథ్యంలో కలిసి ఉండటం కష్టం అని భావించారు. ఎంతో బాధ, ఆవేదనతో సైరా బాను విడాకుల ప్రకటన చేస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో క్లిష్ట పరిస్థితులలో ఉన్న కారణంగా ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకూడదని విజ్ఞప్తి చేశారు” అని లాయర్ వందన విడాకుల ప్రకటనలో వెల్లడించారు.
29 ఏండ్ల క్రితం పెద్దలు కుదిర్చిన వివాహం
రెహమాన్, సైరా బాను 1995లో పెళ్లి చేసుకున్నారు. పెద్దలు కుదిరిచ్చిన వివాహం చేసుకున్నారు. 29 ఏండ్ల పాటు వీరి వివాహ బంధం కొనసాగించింది. ప్రస్తుతం వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు ఖతీజా, రహీమా, అమీన్. విడాకుల తర్వాత పిల్లలు ఎవరి దగ్గర ఉంటారు? అనేది త్వరలో తెలియనుంది. వీరి విడాకులకు అసలు కారణం ఏంటి? అనేది ప్రస్తుతానికి బయటకు రాలేదు. త్వరలోనే అసలు విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Read Also: వేణు ఉడుగుల నిర్మాణంలో మట్టి పరిమళాల కురిపించే ప్రేమ కథ... తండేల్ వచ్చిన వెంటనే థియేటర్లలోకి