Suriya: కొందరు సినీ సెలబ్రిటీలు.. బయట సమాజంలో జరిగే విషయాలను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ, దానిపై స్పందిస్తూ ఉంటారు. అలా చేసేవారిలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఒకరు. చారిటీలో పాల్గొనడం, ఇతరులకు సహాయం చేయడంలో సూర్య ఎప్పుడూ ముందుంటారు. అలాంటి హీరో తాజాగా తమిళనాడు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. తమిళనాడులో కల్తీ మద్యం తాగి మనుషులు చనిపోతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుతం సూర్య చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.


ఇప్పుడు స్పందిస్తున్నారు..


‘ఒక చిన్న గ్రామంలో 50 మంది చనిపోవడం అనేది చాలా బాధాకరం. వర్షాలు, వరదలు, తుఫానులు లాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా ఇన్ని సంఖ్యలో మరణాలు సంభవించలేదు. ఇంకా 100 మందికి పైగా హాస్పిటల్‌లోనే ఉన్నారనే విషయం మరింత బాధాకరం. మరణించిన వారి కుటుంబాల ఏడుపు మనసును కలచివేస్తోంది. తాము ప్రేమించినవారు విషం తీసుకొని మరణించారని ఏడుస్తున్న ఈ కుటుంబాలకు ఏం చెప్పి ఓదార్చాలి? ఇప్పుడు రాజకీయ పార్టీలు, మీడియా, జనాలు అంతా ఈ విషయంపై పట్టించుకొని కోపం, బాధ చూపిస్తున్నారు. ప్రభుత్వం త్వరగా జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టింది’ అంటూ సూర్య చెప్పుకొచ్చారు.


మార్పు లేదు..


‘‘అంత నష్టం జరిగిన తర్వాత కూడా ఈ సమస్యకు షార్ట్ టర్మ్ సొల్యూషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు. గతేడాది విల్లుపురం జిల్లాలో మెథనాల్ కలిపిన కల్తీ మద్యం తాగడం వల్ల 22 మంది చనిపోయారు. అప్పుడు ప్రభుత్వం సీరియస్‌గా చర్యలు తీసుకుంటానని మాటిచ్చింది. ఇప్పుడు ఆ జిల్లాకు దగ్గర్లోనే చాలా సంఖ్యలో జనాలు అదే మెథనాల్ కలిపిన కల్తీ మద్యాన్ని తాగి మరణిస్తున్నారు. అప్పటికీ, ఇప్పటికీ ఏం మార్పు రాకపోవడం అనేది బాధాకరం. తమిళనాడులో పరిస్థితులు మారాలని జనాలు ఓట్లు వేస్తున్నారు. కానీ 20 ఏళ్లుగా ప్రభుత్వాలు.. టాస్మాక్ అనే కంపెనీని పెట్టి జనాలను తాగమని ఎలా బలవంతం చేస్తున్నాయో చూడడం తప్పా ఏం చేయలేకపోతున్నారు’ అని వాపోయారు సూర్య.






ఆల్కహాలిజం పాలసీ..


‘‘ఆల్కహాలిజం పాలసీ అనే పేరుతో ప్రతీసారి మద్యాన్ని నిషేదిస్తాం, కల్తీ మద్యం వల్ల ప్రజల ప్రాణాలు కోల్పోకుండా చూస్తామని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు మాటిస్తున్నారు.  ఆ విషయంపై కూడా సూర్య స్పందించారు. ‘ఆల్కహాలిజం పాలసీ అనేది ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు బజ్ క్రియేట్ చేయడానికి తప్పా దేనికి పనికిరావడం లేదు’’ అని సీరియస్ అయ్యారు సూర్య. ఇక సూర్య చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా చాలామంది నెటిజన్లు.. ఈ హీరో చేసిన పనికి ప్రశంసిస్తున్నారు. ప్రభుత్వాలను ప్రశ్నించడానికి ఆయన ముందుకు రావడం మచిం విషయమని అన్నారు.



Also Read: అమ్మే వేరే వ్యక్తుల దగ్గరకు పంపింది - అక్క అందరి ముందు నన్ను అవమానించింది: షకీలా