Tollywood Producers Meeting With Pawan Kalyan: తెలుగు సినిమా పరిశ్రమ నిర్మాతలు (Tollywood Producers) సోమవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో సమావేశమయ్యారు. చాలా కాలంగా ఏపీ రాజకీయాలతో పాటు, సినిమా రంగం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమావేశం సోమవారం విజయవాడలోని పవన్ క్యాంప్ కార్యాలయంలో జరిగింది. సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ దిగ్గజ నిర్మాతలు ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్‌తో భేటీ అయ్యారు. అనంతరం సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ పాత్రికేయులతో మాట్లాడారు. పవన్‌తో నిర్మాతల సమావేశం ఉల్లాసంగా సాగిందని తెలిపారు.
చంద్రబాబు, పవన్‌కు త్వరలోనే సన్మానం
టాలీవుడ్ నిర్మాతలందరికి ఈ రోజు సంతోషకరమైన రోజు అని అల్లు అరవింద్ అన్నారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చామని చెప్పారు. సమావేశంలో పవన్‌తో నిర్మాతలు సరదాగా మాట్లాడినట్లు చెప్పారు. రాజకీయాలు మాట్లాడుకోలేదన్నారు. సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అభినందన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఓ రోజు కేటాయించమని అడిగినట్లు మీడియాకు తెలిపారు. సీఎం చంద్రబాబు అపాయింట్‌మెంట్ లభిస్తే సినిమా ఇండస్ట్రీకి చెందిన పలు విభాగాల వారితో కలిసి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను అభినందిస్తామని చెప్పారు. ఇందు కోసం సీఎం అపాయింట్‌మెంట్ తప్పకుండా ఇప్పిస్తానని పవన్ హామీ ఇచ్చినట్లు అల్లు అరవింద్ తెలిపారు.
అబ్బే.. అలాంటి ఏమీ లేవు!
సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయాలు కాకుండా ఇతర విషయాలేమైనా చర్చించారా? అని విలేకర్లు ప్రశ్నించగా.. అల్లు అరవింద్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పవన్‌తో సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో సాగిందని, సినిమా పరిశ్రమ సమస్యల గురించి ఈ సమావేశంలో ఎలాంటి ప్రస్తావన రాలేదని చెప్పారు. అలాగే టికెట్ ధరల పెంపు అనేది చాలా చిన్న విషయం అని అన్నారు. చిత్ర పరిశ్రమ ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసినప్పుడు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను చెబుతామని అన్నారు.
ఎవరెవరు పవన్‌ని కలిశారంటే?
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలిసిన వారిలో పలువురు ప్రముఖులు ఉన్నారు. ఏపీ పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, నిర్మాతలు అశ్వనీదత్, ఏఎం రత్నం, సురేష్ బాబు, రాధాకృష్ణ (చినబాబు), దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య, సుప్రియ, ఎన్వీ ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశీ కృష్ణ, వై.రవిశంకర్ తదితరులు పవన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.