Andhra Pradesh News :  ఆంధ్రప్రదేశ్‌లో  గంజాయి అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది.  గంజాయి అరికట్టేందుకు సబ్ కమిటీ వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  సబ్  కమిటీసూచనల మేరకు చర్యలు తీసుకోనున్నారు. సబ్ కమిటీలో హోంమంత్రి అనితతో పాటు  లోకేశ్, గుమ్మడి సంధ్యారాణి, సత్యకుమార్, కొల్లు రవీంద్ర ఉంటారు. 


వంద రోజుల్లో గంజాయిని కనిపించకుండా చేయాలని పట్టుదల


వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ గంజాయి రాజధానిగా మారిందని టీడీపీ నేతలు పదే పదే విమర్శించేవారు. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో గంజాయిని కనిపించకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు అధికారం చేపట్టిన వెంటనే హోంమంత్రి అనిత పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. గంజాయి వ్యాపారం చేసేవారు ఎవరైనాసరే మానుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. అయితే గంజాయి సమస్య మూలాల నుంచి పెకిలించి వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందలో భాగంగానే సబ్ కమిటీని నియమించారు. 


మన్యం నుంచి దేశం మొత్తానికి గంజాయి సరఫరా అవుతుందని విమర్శలు        


దేశం మొత్తానికి గంజాయి ఏపీలోని మన్యం నుంచే  సరఫరా అవుతుందని పోలీసులు వర్గాలు చెబుతూంటాయి.  ఆంధ్రా, ఒరిస్సా బోర్డర్‌లో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు వెళ్లలేని చోట గంజాయిని పండించి దేశవ్యాప్తంగా అమ్ముతూ ఉంటారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా అది ఏపీ నుంచే సరఫరా అవుతుందని అక్కడి పోలీసులు చెబుతూంటారు. ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా చాలా సార్లు విశాఖ మన్యంలో నిందితుల్ని పట్టుకునేందుకు వచ్చారు. గంజాయి సాగును పూర్తిగా నిర్వీర్యం చేస్తే.. గంజాయి వినియోగం కూడా తగ్గుతుదంని భావిస్తున్నారు. 


యువగళం పాదయాత్రలో డ్రగ్స్ పై లోకేష్ కీలక ప్రకటన                                  


అలాగే  గత ఐదేళ్లలో విచ్చలవిడిగా పెరిగిపోయిన మత్తుపదార్థాల వాడకం ఏపీ యువతకు పెను శాపంగామారింది. కాలేజీలు సహా ప్రధాన వీధుల్లో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి. గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలు కూడా దొరికిన ఘటనలు వెలుగు చూశాయి. ఈ క్రమంలో మొత్తం డ్రగ్స్ ను ఏపీ నుంచి తరిమేస్తామని యువగళం పాదయాత్ర సమయంలో  నారా లోకేష్ ప్రకటించారు. ఆ మేరకు అధికారంలోకి  రాగానే చర్యలు చేపట్టారు. 


కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాల తర్వాత కీలక ప్రకటనలు                                                


కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చే సిఫారసులు ఆధారంగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటికే గంజాయి సాగు ఎవరు చేస్తారు.. ఎలా అమ్ముతారు...ఎలా రవాణా చేస్తారన్నదానిపై పూర్తి స్థాయిలో పోలీసుల వద్ద సమాచారం ఉందని భావిస్తున్నారు. వచ్చే మూడు నెలల్లో ఏపీలో డ్రగ్స్ మాఫియాపై పెద్ద ఎత్తున యుద్ధం జరిగే అవకాశం ఉంది.