Amitabh Bachchan About Kalki 2898 AD: ప్రస్తుతం ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో ఎక్కడ చూసినా ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’ గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే పలుమార్లు వాయిదాపడింది. ఫైనల్‌గా జూన్ 27న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. అందుకే మూవీ టీమ్ అంతా ఇంటర్వ్యూలు, ప్రమోషన్స్‌లో బిజీ అయ్యారు. ‘కల్కి 2898 AD’ కోసం అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె లాంటి బాలీవుడ్ బడా స్టార్లను రంగంలోకి దించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. తాజాగా ‘కల్కి 2898 AD’లో నటించిన అనుభవం గురించి అమితాబ్ బచ్చన్ మాట్లాడారు.


మొత్తం 3 గంటలు..


‘కల్కి 2898 AD’లో అమితాబ్ బచ్చన్.. అశ్వద్ధామగా కనిపించనున్నారు. ఆయన క్యారెక్టర్ గురించి, అందులో ఆయన మేక్ ఓవర్ గురించి ఫస్ట్ లుక్‌తోనే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు మేకర్స్. ముఖ్యంగా అశ్వద్ధామగా కనిపించడానికి మేకప్ విషయంలో అమితాబ్ చాలా కష్టపడ్డారు. తాజాగా అసలు అలా మేకప్ వేసుకోవడానికి ఎంత సమయం పట్టిందో ఆయన బయటపెట్టారు. ముందుగా మేకప్ వేయడం సామాన్యమైన విషయం కాదని ఆయన చెప్పుకొచ్చారు. తన మేకప్ వేయడానికి ఆ ఆర్టిస్ట్‌కు 3 గంటలు పట్టేదని బయటపెట్టారు. వేయడానికి మాత్రమే కాదు.. తీయడానికి కూడా గంటన్నర పట్టేదని తెలిపారు.


తిట్టుకోవద్దు..


మేకప్ వేయడానికి, తీయడానికి అంత సమయం పట్టినా కూడా దానిని తానెప్పుడూ టార్చర్ లాగా భావించలేదని అమితాబ్ బచ్చన్ అన్నారు. స్క్రీన్ పై చూసినప్పుడు ఆ కష్టం కనిపిస్తుందని తెలిపారు. ‘కల్కి 2898 AD’ ట్రైలర్‌ చూస్తే అమితాబ్‌కు, ప్రభాస్‌కు మధ్య ఫైట్ సీక్వెన్స్‌లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఆ ఫైట్ సీన్స్ షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో అమితాబ్ చెప్పుకొచ్చారు. నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 AD’ కథతో తన దగ్గరికి వచ్చినప్పుడే ప్రభాస్‌ను ఎదిరించే పాత్ర అని తనకు వివరించారని తెలిపారు. అందుకే సినిమాలో ప్రభాస్‌తో తను ప్రవర్తించిన తీరుకు తనను తిట్టుకోవద్దని ఫ్యాన్స్‌ను కోరారు అమితాబ్. అది సినిమాలో భాగమని క్లారిటీ ఇచ్చారు.


ఏం తింటున్నాడు.?


‘కల్కి 2898 AD’లో ప్రభాస్‌తో గొడవపడినందుకు ఫ్యాన్స్ అంతా తనను క్షమించాలని, చేతులు జోడించి మరీ వారందరినీ క్షమాపణలు అడిగారు అమితాబ్ బచ్చన్. ‘కల్కి 2898 AD’లోని విజువల్స్ గురించి మాట్లాడుతూ.. కొన్ని విజువల్స్ చూస్తే అసలు నమ్మేలా ఉండవని అన్నారు. వాటన్నింటిని స్క్రీన్ పై చాలా బాగా చూపించారని, ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం తనకు సంతోషంగా ఉందని ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం అని సంతోషం వ్యక్తం చేశారు. నాగ్ అశ్విన్.. తనతో ఈ కథ చెప్పి వెళ్లిన తర్వాత ఇంత గొప్పగా కథ రాసేలా ఇతను ఏం తింటున్నాడా అని చాలాసేపు ఆలోచించాను అని నవ్వుతూ చెప్పారు అమితాబ్ బచ్చన్. ఇప్పటికే ‘కల్కి 2898 AD’ ట్రైలర్‌పై, అందులో అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రేక్షకులు.



Also Read: నాకు అసలు సంబంధం లేదు - 'కల్కి' మూవీ టికెట్ బుకింగ్స్‌పై రాజశేఖర్‌ ఫన్నీ పోస్ట్ వైరల్