Jackky Bhagnani - Vashu Bhagnani: బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలలో 'పూజా ఎంటర్‌టైన్‌మెంట్' ఒకటి. 1986లో వాషు భగ్నాని చేత డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా ప్రారంభించబడిన ఈ సంస్థ.. 1995లో సినిమా ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టింది. 'కూలీ నెం. 1', 'హీరో నెం. 1', 'బివి నెం.1', 'బడే మియాన్ చోటే మియాన్', 'ఖామోషీ' లాంటి ఎన్నో హిట్ సినిమాలు ఈ బ్యానర్ లో వచ్చాయి. అయితే గత కొన్నేళ్లుగా ఈ సంస్థ నుంచి వస్తున్న సినిమాలన్నీ పెద్దగా విజయం సాధించడం లేదు. భారీ బడ్జెట్ తో రూపొందించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. దీంతో ఈ నిర్మాణ సంస్థ తమ ఉద్యోగులకు సైతం సకాలంలో వేతనాలు చెల్లించలేని స్థితికి చేరుకుందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


వాషు భగ్నాని తనయుడు జాకీ భగ్నానీ సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త అనే సంగతి తెలిసిందే. హిందీ చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం పూజా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ వ్యవహారాలన్నీ అతనే చూసుకుంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో జాకీ నిర్మాణంలో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారుతున్నాయి. రీసెంట్ గా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా 'బడే మియా ఛోటే మియా' అనే భారీ చిత్రాన్ని నిర్మించారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, మానుషి చిల్లర్, అలయ, సోనాక్షి సిన్హా లాంటి స్టార్ క్యాస్టింగ్ నటించారు. దాదాపు ₹ 350 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ యాక్షన్ మూవీ, ఘోర పరాజయం చవిచూసింది. కనీసం 90 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. దీంతో ఈ సినిమాకు పని చేసిన చాలామందికి బకాయిలు ఇవ్వలేదని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. 


బాలీవుడ్ లో రెమ్యునరేషన్ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు. సినిమా షూటింగ్ అయిపోయిన రెండు నెలల లోపు చెల్లింపులన్నీ జరిగిపోవాలని అగ్రిమెంట్లు రాసుకుంటారు. కానీ నెలలు గడుస్తున్నా 'బడే మియా ఛోటే మియా' చిత్రానికి వర్క్ చేసిన వారికి ఇంతవరకూ బకాయిలు చెల్లించలేదట. పూజా ఎంటర్టైన్మెంట్స్ లో పనిచేసిన ఉద్యోగులకు రెండు ఏళ్లుగా సరిగ్గా వేతనాలు కూడా ఇవ్వడం లేదని పలు ఇంగ్లీష్ వెబ్ పోర్టల్స్ లో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు వరుస ఫ్లాపుల మధ్య నిర్మాత వాషు భగ్నాని తన ఆఫీస్ ను అమ్మకానికి పెట్టారని, ఇప్పటికే తమ సంస్థలో 80 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నారని కథనాలు ప్రసారం చేస్తున్నాయి. 


నిజానికి కోవిడ్ పాండమిక్ నుంచే పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ కు ఇబ్బందులు తలెత్తినట్లుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. వరుణ్ ధావన్, సారా అలీఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన 'కూలీ నంబర్ 1' సినిమా కరోనా కారణంగా థియేట్రికల్‌ రిలీజ్ కు నోచుకోలేదు. దీంతో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో నేరుగా విడుదల చేసారు. దీనికి ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించలేదు. అలానే అక్షయ్ కుమార్, వాణి కపూర్ లతో తీసిన 'బెల్ బాటమ్‌' మూవీ కూడా జాకీ భగ్నానీని తీవ్రంగా నిరాశ పరిచింది. పాండమిక్ తర్వాత థియేటర్లలో రిలీజైన ఫస్ట్ స్టార్ హీరో సినిమా ఇది. మిక్స్డ్ రివ్యూస్ పొందిన ఈ సినిమా మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. సెకండ్ వేవ్, వివిధ రాష్ట్రాలలో లాక్డౌన్ కారణంగా దారుణమైన పరాజయం చవిచూడాల్సి వచ్చింది. 


ఇదే క్రమంలో అక్షయ్ కుమార్ హీరోగా జాకీ నిర్మించిన 'కట్‌పుట్ల్లి' సినిమా డిస్నీ+ హాట్‌ స్టార్‌లో డైరెక్టర్ ఓటీటీ విధానంలో రిలీజయ్యింది. 2023లో వచ్చిన 'మిషన్ రాణిగంజ్' మూవీ కూడా ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. అదే ఏడాది విడుదలైన 'గణపత్' చిత్రం సైతం భారీ డిజాస్టర్ గా మారింది. టైగర్ ష్రాఫ్, అమితాబ్ బచ్చన్, కృతి సనన్ లాంటి స్టార్ క్యాస్టింగ్ తో దాదాపు 190 కోట్ల బడ్జెట్ తో తీస్తే.. బాక్సాఫీస్ దగ్గర 15 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. దీనికి తోడు నెట్‌ ఫ్లిక్స్ ఓటీటీతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ క్యాన్సిల్ అవ్వడంతో కంపెనీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని, సంస్థ ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కొందని టాక్ ఉంది. అయినప్పటికీ 'బడే మియాన్ చోటే మియాన్‌' సినిమాతో తిరిగి పుంజుకోవచ్చని భారీగా పెట్టుబడులు పెట్టారు. కానీ ఇది కూడా ప్లాప్ అవ్వడంతో నిర్మాతలు నష్టాల్లో కూరుకుపోయారని, అప్పును తీర్చడానికి ఆఫీసును అమ్మేయడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 


ఇందులో నిజా నిజాలు పూర్తిగా తెలియదు కానీ, రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ తన నిర్మాణ సంస్థలో పని చేసిన ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదనే వార్త టాలీవుడ్ వర్గాల్లోనూ హాట్ టాపిక్ అయింది. దశాబ్దాలుగా బాలీవుడ్ లో కొనసాగుతున్న నిర్మాణ సంస్థకు ఇలాంటి పరిస్థితి రావడంపై పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. హీరోహీరోయిన్లకు ఎప్పటికప్పుడు రెమ్యునరేషన్లు ఇచ్చే నిర్మాణ సంస్థలు, సిబ్బంది జీతాలు చెల్లించడానికి మాత్రం ఇష్టపడరని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై భగ్నానీ ఏం స్పందిస్తారో చూడాలి. 


Also Readప్రభాస్ ఒక్కో సినిమాకు ఏవరేజ్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 300 కోట్లు... ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే రేంజ్‌ డార్లింగ్స్.... రెబల్ స్టార్‌ను 'ఢీ' కొట్టేదెవరు