Akkada Ammayi Ikkada Abbayi actress Supriya Yarlagadda met Pawan Kalyan: ఆంధ్రప్ర‌దేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడుపుతున్నారు. పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి, పర్యావరణం అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా మూడు శాఖలను నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నారు. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధి, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై టాలీవుడ్ పెద్దలతో చర్చించారు. ఈ సమావేశంలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. పవన్ తన మొదటి సినిమా హీరోయిన్ ను కలుసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. 


మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మైన సంగతి తెలిసిందే. ఇదే సినిమాతో దివంగత అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, కింగ్ నాగార్జున మేన కోడలు సుప్రియ యార్లగడ్డ హీరోయిన్ గా లాంచ్ అయింది. 1996లో ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రం మంచి విజయం సాధించింది. డెబ్యూ జంటకు పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి నటించలేదు. ఎక్కడా పెద్దగా కలిసి కనిపించలేదు. అయితే దాదాపు 28 ఏళ్ళ తరువాత ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ - సుప్రియ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. 


ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన పవన్ కళ్యాణ్ ను సినీ పరిశ్రమ తరఫున అభినందించడానికి, ఈరోజు సోమవారం పలువురు టాలీవుడ్ నిర్మాతలు హైదరాబాద్ నుంచి విజయవాడలోని క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. పవన్ తో భేటీ అయిన నిర్మాతల్లో సుప్రియ యార్లగడ్డ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ''మా నిర్మాత సుప్రియ గారు గౌరవనీయులైన ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలుసుకుని అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు'' అని పోస్ట్ లో పేరొన్నారు. 






‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ - సుప్రియ యార్లగడ్డ ఇన్నేళ్ల తర్వాత కలిసి కనిపించడం ఇరువురి అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. సినిమాల్లో మళ్ళీ కలిసి నటించకపోయినా, ఇలా అయినా కలుసుకోవడం హ్యాపీగా ఉందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎలాగైతేనేం చాలా కాలం తర్వాత అక్కడి అమ్మాయి ఇక్కడి అబ్బాయిని కలిసిందంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో ప‌వ‌న్, సుప్రియల ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. 


నిజానికి 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రంలో నటించిన తర్వాత సుప్రియ టాలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగలేదు. అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకుంటూ, నిర్మాతగా బిజీగా మారిపోయింది. అయితే 2018లో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన 'గూఢచారి' సినిమాలో కీలక పాత్ర పోషించడం ద్వారా చాలా ఏళ్ళ తర్వాత కెమెరా ముందుకు వచ్చింది. ప్రస్తుతం దీనికి సీక్వెల్ గా రూపొందుతున్న 'G 2' లోనూ ఆమె భాగమయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. 


మరోవైపు పవన్ కల్యాణ్ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ 'పవర్ స్టార్' అని పిలుచుకునే స్థాయికి ఎదిగారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే, జనసేన అనే రాజకీయ పార్టీ స్థాపించి ప్రజా సమస్యలపై పోరాటం చేసారు. ఆయన హీరోగా నటిస్తున్న 'OG', హరిహర వీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, మళ్ళీ ఎప్పుడు సెట్స్ లో అడుగుపెడతారనేది క్లారిటీ లేకుండా పోయింది. అందుకే ఈ ఏడాదిలో రిలీజ్ చేయాలనుకున్న 'ఓజీ' చిత్రాన్ని కూడా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 


Also Read: చిక్కుల్లో రకుల్ ప్రీత్ సింగ్ భర్త - అమ్మకానికి ఆఫీస్.. అసలు ఏమైంది?