Shakeela: ఒకప్పుడు సౌత్‌లో సెన్సేషనల్ హీరోయిన్ అనిపించుకున్నవారిలో షకీలా కూడా ఒకరు. అయితే తను హీరోయిన్ అవ్వక ముందు, అయిన తర్వాత తను ఎదుర్కున్న కొన్ని చేదు అనుభవాల గురించి షకీలా చాలాసార్లు ఓపెన్‌గా మాట్లాడారు. పైగా తన సొంత కుటుంబం వల్లే తను చాలా కష్టాలు పడ్డానని కూడా స్టేట్‌మెంట్ ఇచ్చారు. కొన్నాళ్ల క్రితం ఆమె పాల్గొన్న ఇంటర్వ్యూలో కూడా తన అక్క, తల్లి వల్ల ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంత బాధపడ్డారో బయటపెట్టారు షకీలా. ముఖ్యంగా తన అక్క కొడుకు పెళ్లిలో తనకు జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. దాంతో పాటు తన తల్లి చనిపోయిన పరిస్థితుల గురించి కూడా మాట్లాడారు.


దూరం పెట్టారు..


‘‘మా అక్క కొడుకు పెళ్లి అని చీర పెట్టి, కార్డ్ ఇచ్చి రమ్మని చెప్పి వెళ్లింది. పెళ్లికి రాలేనని రిసెప్షన్‌కు వెళ్లాను. చుట్టాలు అందరూ కూర్చొని ఉన్నా నేను డైరెక్ట్‌గా స్టేజ్‌పైకి వెళ్లిపోయాను. అందరిలాగే స్టేజ్ మీద ఫోటో దిగడానికి నిలబడ్డాను కానీ అప్పుడే పెళ్లికూతురు స్టేజ్ మీద లేదు. వాష్‌రూమ్‌కు వెళ్లిందేమో దిగి మళ్లీ పైకి వెళ్దామనుకున్నా. అలా నేను దిగేటప్పుడు ఆ అమ్మాయి పైకి వచ్చింది. అయినా నేను కిందకి వెళ్లి 5 నిమిషాలు కూర్చున్నాను. మా అక్క వచ్చి నన్ను స్టేజ్‌పైకి వెళ్లకు ఉండు అంటుంది. నేను వేరే చోటికి కూడా వెళ్లాలని అంది. చిరాకు వచ్చి గిఫ్ట్ ఇచ్చేసి వెళ్లిపోతానని స్టేజ్ ఎక్కాను. పెళ్లికొడుకు పక్కన నిలబడి ఫోటో దిగుదామనుకుంటే నన్ను మెల్లగా దూరం జరిపేశారు’’ అంటూ ఆరోజు జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నారు షకీలా.


పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాను..


‘‘వాళ్లు అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు. కానీ కావాలనే దూరం చేస్తున్నారేమో అనిపించి స్టేజ్‌పైనే ఏడ్చేశాను. పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాను. కొన్నిరోజులు బాధపడ్డాను. ఆ తర్వాత మా అక్క ఫోన్ చేసి నీ కాళ్లు పట్టుకుంటాను అంటూ సారీ చెప్పింది. అందరి ముందు అవమానించి ఇప్పుడు కాళ్లు పట్టుకోవడమేంటి? అసలు ఏమైంది అని అడిగాను. పెళ్లికూతురికి ఏ సినిమా ఆర్టిస్ట్ కూడా రావడం ఇష్టం లేదు అని చెప్పింది. ఆ అమ్మాయి ఖుష్భూ మ్యానేజర్ వాళ్ల అన్న కూతురు’’ అని తెలిపారు షకీలా. ఆ తర్వాత తన తల్లి గురించి చెప్తూ.. ‘‘ఆమె సంపాదించలేదు, నేను సంపాదించింది దాచిపెట్టలేదు’’ అంటూ తన తల్లి చనిపోయే ముందు జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చారు షకీలా.


అక్క తోడుగా వచ్చింది..


‘‘మా అమ్మ చనిపోయే ముందు ట్రీట్మెంట్ చేయించడానికి నా దగ్గర పైసా లేదు. అప్పుడు మా అక్కకు ఫోన్ చేసి ఏడ్చాను. నేను సంపాదించిన డబ్బుతో ఎక్కడైనా స్థలం కొనిపెట్టుంటే అది అమ్మి అమ్మకు ట్రీట్మెంట్ చేయించేదాన్ని కదా అన్నాను. స్థలం ఏమైనా కొనిపెడితే పక్షి ఎగిరిపోతుందని అమ్మ చెప్పిందని అక్క నాకు చెప్పింది. అప్పుడే అమ్మ దగ్గరకు వెళ్లి ఈ మాట అడిగాను. అది ఎప్పుడో అన్న మాట అని చెప్పింది’’ అని బాధపడ్డారు షకీలా. ఇక తన తల్లే తనను వేరే వ్యక్తుల దగ్గరికి పంపడం గురించి మాట్లాడుతూ.. ఇంట్లో సమస్యలు ఉన్నాయి వెళ్లు అనగానే అక్కతో కలిసి అక్కడికి వెళ్లాను అని షాకింగ్ విషయం బయటపెట్టారు షకీలా.


Also Read: ఏడేళ్ల ప్రేమ, ఎన్నో సవాళ్ల తర్వాత భార్యభర్తలం అయ్యాం - పెళ్లి అనంతరం సోనాక్షి ఎమోషనల్‌ పోస్ట్‌