Sundeep Kishan supports Kumari Aunty: ఈరోజుల్లో సోషల్ మీడియా అనేది ఎవరినైనా ఫేమస్ చేసేయగలదు. అలా గత కొన్నేళ్లలో ఎంతోమంది ఫేమస్ అయ్యారు. చిన్న సైజ్ సెలబ్రిటీలు అయిపోయారు. ఆ లిస్ట్‌లోకి తాజాగా యాడ్ అయ్యారు కుమారీ ఆంటీ. ఈమె మాదాపూర్‌లోని స్ట్రీట్ ఫుడ్ ఏరియాలో ఒక షాప్ పెట్టుకున్నారు. అక్కడ తక్కువ ధరకు నాన్ వెజ్ లంచ్ ఏర్పాటు చేస్తుంటారు. అదే సమయంలో ‘రెండు లివర్లు ఎక్స్‌ట్రా’ అంటూ వైరల్ అయిన ఒక వీడియోతో ఆమె తెగ ఫేమస్ అయిపోయారు. అప్పటినుండి కుమారీ ఆంటీ షాప్ దగ్గరికి చాలామంది తినడానికి వస్తున్నారు. దీంతో అనుమతి లేకుండా షాప్ పెట్టిందంటూ మూయించేశారు ట్రాఫిక్ పోలీసులు. దీంతో హీరో సందీప్ కిషన్.. కుమారీ ఆంటీకి మద్దతు తెలిపుతూ ముందుకు వచ్చాడు.


కుమారీ ఆంటీకి అండగా..


‘రెండు లివర్లు ఎక్స్‌ట్రా’ అనే డైలాగుతో కుమారీ ఆంటీ స్ట్రీట్ ఫుడ్ తెగ ఫేమస్ అయిపోయింది. దీంతో చాలామంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు తన బిజినెస్ గురించి తెలుసుకోవడానికి అక్కడికి వచ్చారు. ఎవరు వచ్చి ఏం అడిగినా ఆ ప్రశ్నలు అన్నింటికి ఓపిగ్గా సమాధానం చెప్పారు కుమారీ ఆంటీ. అదే క్రమంలో తన ఆదాయం, లాభాల వివరాలు కూడా బయటికి వచ్చాయి. అది తన బిజినెస్‌పై ఎఫెక్ట్ పడేలా చేసింది. కొన్నిగంటల్లోనే అనుమతి లేకుండా స్ట్రీట్ ఫుడ్‌ను ఏర్పాటు చేశారని ట్రాఫిక్ పోలీసులు.. ఆమె షాప్‌ను మూసివేశారు. ఇది తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. ఇక సినీ సెలబ్రిటీల్లో ముందుగా హీరో సందీప్ కిషన్.. ఈ విషయంపై స్పందించడమే కాకుండా నేరుగా వెళ్లి కుమారీ ఆంటీని కలిసొచ్చారు.


సినిమాకు కావాల్సినంత ప్రమోషన్..


కుమారీ ఆంటీ స్ట్రీట్ ఫుడ్ సెంటర్‌ను ట్రాఫిక్ పోలీసులు మూసివేయడంతో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి.. మళ్లీ ఓపెన్ చేయమని చెప్పారు. ఇక హీరో సందీప్ కిషన్ సైతం.. కుమారీ ఆంటీ లాంటివారు ఇతర మహిళలకు ఆదర్శంగా ఉంటారని అని ఆమెకు సపోర్ట్‌గా నిలిచాడు. ఆమెకు వీలైనంత సాయం చేస్తానని ప్రకటించాడు. సందీప్‌తో పాటు హీరోయిన్స్ వర్ష బొల్లామా, కావ్య థాపర్, దర్శకుడు వీఐ ఆనంద్ కూడా కుమారీ ఆంటీ స్ట్రీట్ ఫుడ్‌ను సందర్శించారు. వీరు చేసిన ఈ పనితో తమ సినిమా ‘ఊరు పేరు భైరవకోన’కు కావాల్సినంత ప్రమోషన్ దొరుకుతుందని నెటిజన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఆంటీ పేరే వినిపిస్తోంది. 






వెనకడుగు వేసిన సందీప్..


ముందుగా సందీప్ కిషన్, వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఊరు పేరు భైరవకోన’ ఫిబ్రవరీ 9న రిలీజ్‌ను ఏర్పాటు చేసుకుంది. కానీ ‘ఈగల్’ వల్ల ఈ సినిమాకు విడుదల తేదీ విషయంలో సమస్యలు ఎదురయ్యాయి. ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాన్ని గౌరవిస్తూ.. తెలుగు సినిమా స్పిరిట్‌ను ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రస్తుతం వెనకడుగు వేస్తున్నాం’ అంటూ ప్రపంచవ్యాప్తంగా ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ ఫిబ్రవరీ 16న విడుదలవుతుందని సందీప్ కిషన్.. తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ మూవీకి సోలో రిలీజ్ కల్పించడం కోసం ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతలు అంతా కలిసి ‘ఊరు పేరు భైరవకోన’ టీమ్‌ను ఒప్పించారు. 


Also Read: మళ్లీ ప్రేక్షకుల ముందుకు ‘రామాయణ్’ సీరియల్, ఆ చానెల్‌లో టెలికాస్ట్?