Overseas Rights of Upcoming Telugu Movies: తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ అనేది చాలా కీలకం. కోవిడ్ పాండమిక్ టైంలో మార్కెట్ పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ, మళ్ళీ ఇప్పుడు ట్రేడ్ పుంజుకుంది. ఎప్పటిలాగే మన సినిమాకు అక్కడ మంచి క్రేజ్ ఏర్పడింది. 'సలార్' మూవీ $ 8.9 మిలియన్లతో ఆల్-టైమ్ ఓవర్సీస్ హయ్యెస్ట్ గ్రాసర్ లిస్టులో మూడో స్థానంలో నిలిచింది. అలానే 'హను-మాన్' 5 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టి టాప్-10లో చోటు సంపాదించింది. ఇటీవల కాలంలో కొన్ని చిత్రాలు డొమెస్టిక్ మార్కెట్ కు ధీటుగా కలెక్షన్స్ రాబట్టాయి. అందుకే ఇప్పుడు తెలుగు సినిమాల ఓవర్ సీస్ హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పోటీ పడి మరీ ఫ్యాన్సీ రేటుకు రైట్స్ కొనుగోలు చేస్తున్నాయి. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న భారీ సినిమాల ఓవర్సీస్ హక్కులు ఎన్ని కోట్లకు అమ్ముడయ్యాయో ఇప్పుడు చూద్దాం.
దేవర - పార్ట్ 1:
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా ఈ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. చెరుకూరి సుధాకర్ దీనికి నిర్మాత. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ కు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో సినిమా ఓవర్ సీస్ హక్కులను 27 కోట్లకు హంసిని ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది రీసెంట్ టైమ్స్ లో భారీ డీల్ అని చెప్పాలి. ఈ సినిమాకున్న బజ్ ప్రకారం చూసుకుంటే, హిట్ టాక్ వస్తే టార్గెట్ రీచ్ కావడం పెద్ద కష్టం కాదు.
గేమ్ ఛేంజర్:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్'. దిల్ రాజ్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఓవర్ సీస్ డీల్ ఇప్పటికే క్లోజ్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఫార్స్ ఫిలిమ్స్ పంపిణీ సంస్థ 22.5 కోట్లకు రైట్స్ తీసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే, శంకర్ లాంటి అగ్ర దర్శకుడు.. RRR హీరో కాంబినేషన్ సినిమాగా చూసుకుంటే ఈ ఇది కాస్త తక్కువ అనే అనుకోవాలి. కాకపోతే ఈ డీల్ చాన్నాళ్ల క్రితమే కుదిరించుకున్నారని, ఇప్పుడైతే రేటు మరోలా ఉండేదనే టాక్ కూడా నడుస్తోంది.
Also Read: ఆడు జీవితం - 'ది గోట్ లైఫ్'.. 'సలార్' యాక్టర్‌తో చేతులు కలిపిన 'మైత్రీ'
విశ్వంభర:
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'విశ్వంభర'. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవలే ప్రారంభమైన ఈ సోసియో ఫాంటసీ సినిమాపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. 2025 సంక్రాంతికి రిలీజ్ చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే చిరు ఇంకా సెట్స్ లో అడుగుపెట్టకముందే ఈ మూవీ ఓవర్ సీస్ హక్కులను అమ్మేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సరిగమ సంస్థ 18 కోట్లకు రైట్స్ తీసుకుందని ప్రచారం ఊపందుకుంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ, మెగా బాస్ మూవీకి ఇది మంచి రేటు అనే చెప్పాలి.
OG:
పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా They Call Him OG. సింపుల్ గా 'ఓజీ' అని పిలవబడుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంపై పవర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మూడు డబ్బింగ్ సినిమాల తర్వాత పవన్ నటిస్తున్న ఒరిజినల్ మూవీ కావడంతో అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను 17.5 కోట్లకు ఫార్స్ ఫిలిమ్స్ సంస్థ కొనుగోలు చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. మిగతా పెద్ద హీరోల సినిమాలతో పోల్చుకుంటే ఇది కాస్త తక్కువే అనుకోవాలి. ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా 2024 సెప్టెంబర్ 27న విడుదల కానుంది.
ఇకపోతే రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 AD', 'పుష్ప: ది రూల్' వంటి మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల ఓవర్సీస్ డీల్స్ విషయంలో అనేక వార్తలు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ డీల్స్ ఇంకా అఫిషియల్ గా క్లోజ్ అవ్వలేదని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాల హక్కులపైనా క్లారిటీ వచ్చే అవకాశం వుంది.
Also Read: బ్లాక్ ఫారెస్ట్‌లో మహేష్ బాబు ట్రెక్కింగ్ - ఈ భయానక అడవి ప్రత్యేకతలు ఇవే!