Pawankalyan's Flop Movie Redy For Re-Release : గత కొంతకాలంగా టాలీవుడ్ రీ-రిలీజుల ట్రెండ్ నడుస్తోంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్​గా నిలిచిన చిత్రాలను, కల్ట్ క్లాసిక్ సినిమాలను 4K రెజల్యూషన్​లో మళ్ళీ థియేటర్లలో విడుదల చేయడం మనం చూస్తున్నాం. హీరోల బర్త్ డే స్పెషల్​గా, లేదా మరేదైనా ప్రత్యేకమైన రోజుల్లో రిలీజ్ చేసిన సినిమాలను జనాలు బాగానే ఆదరించారు.'పోకిరి', 'జల్సా', 'ఖుషి', 'చెన్న కేశవ రెడ్డి', 3, 'బిజినెస్ మ్యాన్', 'సూర్య S/o కృష్ణన్', 'ఆరెంజ్', 'సింహాద్రి', 'మన్మథుడు' వంటి చిత్రాలను ఆడియన్స్ విశేషంగా ఆదరించారు. కానీ ఈ మధ్యకాలంలో మళ్లీ రీ రిలీజ్ ల హవా తగ్గిపోయింది. అందుకు కారణం జనాలు రీ రిలీజ్ సినిమాలకి ఆసక్తి చూపించకపోవడమే.


రీసెంట్ టైమ్స్ లో రీ రిలీజ్ అయిన 'గుడుంబా శంకర్', 'యోగి', 'శంకర్ దాదా ఎంబిబిఎస్' వంటి సినిమాలకు ఆడియన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అందుకే ఇటీవల కొన్ని సినిమాలను రీ రిలీజ్ చేద్దాం అనుకున్నా కూడా పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో క్యాన్సల్ చేసేసారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓ సినిమా మాత్రం ఇప్పుడు రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాని రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైన వేళ ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతుండడం సర్వత్ర ఆసక్తికరంగా మారింది.


2012లో పవన్ కళ్యాణ్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అప్పట్లోనే 1600లకు పైగా స్క్రీన్స్ లో విడుదలై రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమాలో రాంబాబుగా పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగ పాత్రలో తమన్నా నటించారు. ఇందులో మొదట మెకానిక్ అయిన రాంబాబు అన్యాయాలను ఎదిరించేవాడిగా ఉంటూ జర్నలిస్ట్ అవ్వడం, ఆ తర్వాత సమాజంలో జరిగే అన్యాయాలు, అరాచకాలను ఎదిరించే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. అప్పట్లోనే భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కించుకోలేకపోయింది. ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.


యూనివర్సల్ మీడియా పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాని రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఓ సరైన డేట్ చూసి ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాలకి ఆడియన్స్ స్పందన కరువైన వేళ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' ఏ రేంజ్ కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.. తన సినిమా షూటింగ్స్ అన్ని పక్కన పెట్టేసి ప్రస్తుతం రాజకీయాలపైనే పూర్తి దృష్టి సారించారు. ఏపీ ఎలక్షన్స్ పూర్తయిన అనంతరం తిరిగి షూటింగ్స్ లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది.


Also Read : ఆ దర్శకుడిపై ఐశ్వర్య రాజేష్ ఫైర్ - వైరల్ అవుతున్న ట్వీట్!