Aadu Jeevitham - The Goat Life: టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో 'మైత్రీ మూవీ మేకర్స్' ఒకటి. స్టార్ హీరోలందరితో సినిమాలు నిర్మించిన నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టారు. తెలుగుతో పాటుగా ఇతర భాషల్లోనూ సినిమాలు రూపొందిస్తున్నారు. రీసెంట్ గా 'సలార్', 'హను-మాన్' వంటి చిత్రాలతో డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ లాభాలు ఆర్జించారు. అయితే మైత్రీ మేకర్స్ ఇప్పుడు మలయాళంలో తెరకెక్కుతున్న 'ఆడు జీవితం' అనే ఓ కంటెంట్ ఓరియెంటెడ్ మూవీని మన తెలుగు ప్రేక్షకులకు అందించడానికి రెడీ అయ్యారు. 


'సలార్' ఫేమ్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ‘ఆడుజీవితం’. ఈ సర్వైవల్‌ డ్రామాని ఇంగ్లీష్‌లో ‘ది గోట్‌ లైఫ్‌’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఉత్తమ దర్శకుడిగా నేషనల్ ఫిలిం అవార్డు అందుకున్న బ్లెస్సీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2024 ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయబోతున్నట్లు తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 'అద్భుతమైన బృందం చెప్పిన అద్భుతమైన కథ' అంటూ సరికొత్త పోస్టర్స్ ను పంచుకున్నారు. ఇందులో పృథ్వీరాజ్‌ మూడు భిన్నమైన లుక్స్ లో కనిపిస్తున్నారు. 






'ది గోట్ లైఫ్' (ఆడు జీవితం) అనేది పూర్తిస్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. 90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి సౌదీకి వలస వెళ్లిన నజీబ్ మొహమ్మద్ అనే మలయాళీ జీవిత కథను ఈ చిత్రంలో ఆవిష్కరించబోతున్నారు. పొట్టకూటి కోసం అరబ్ కంట్రీస్ కి వలస వెళ్లిన యువకుడు ఎన్ని కష్టాలు పడ్డాడు? అక్కడ బానిస బతుకు నుంచి బయటపడేందుకు ఎడారి బాట పట్టిన అతడు ఎలా బతికాడు? అనేది చూపించబోతున్నారు. 


Also Read: 'అత్తారింటికి దారేది' రిలీజ్ డేట్‌కు OG


బెన్యామిన్ రాసిన 'గోట్ డేస్' నవల ఆధారంగా ‘ఆడు జీవితం’ చిత్రాన్ని తీర్చిదిద్దారు. డైరెక్టర్ బ్లెస్సీ ఈ సినిమా కోసం ఒకటికాదు రెండు కాదు, ఏకంగా 15 ఏళ్ళ పాటు వర్క్ చేస్తూ వచ్చారు. ఒక వ్యక్తి జీవితంలో జరిగిన అనూహ్య ఘటనలను ప్రేక్షకులకు వాస్తవిక అనుభూతిని కలిగించేలా వీలైనంత సహజంగా తెరకెక్కించే ప్రయత్నం చేసినట్లు దర్శకుడు చెబుతూ వచ్చారు. వాదీరమ్‌, జోర్దాన్‌, సహారా, అల్జీరియా ఎడారుల్లో ఈ సినిమాని చిత్రీకరించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్, గతేడాది ఏప్రిల్ లో వచ్చిన ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తప్పకుండా సినిమా చూడాలంటే ఆసక్తిని కలిగించాయి. 


హీరో పృథ్వీరాజ్ సుకుమార్ సైతం ‘ఆడు జీవితం’ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ట్రైలర్ లో పృథ్వీరాజ్ తన నటనతో కట్టిపడేశారు. బానిస బతుకు అనుభవిస్తున్న వలస కూలీగా, ఎడారిలో ఆహారం దొరక్క బక్క చిక్కిపోయిన వ్యక్తిగా డిఫెరెంట్ వేరియేషన్స్ చూపించారు. ఇక షూటింగ్ కోసం చిత్ర యూనిట్ జోర్దాన్ వెళ్లినప్పుడు కోవిడ్ ఆంక్షలు విధించడంతో, వారంతా రెండు నెలల పాటు ఎడారుల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో పృథ్వీరాజ్ తన భార్యా పిల్లలను తలచుకుంటూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.


'ది గోట్ లైఫ్' (ఆడు జీవితం) చిత్రంలో పృథ్వీరాజ్ తో పాటుగా హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఆస్కార్‌ అవార్డు గ్రహీతలు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం సమకూర్చగా, రసూల్‌ పూకుట్టి సౌండ్‌ ఇంజినీర్‌గా వర్క్ చేసారు. సునీల్ కేఎస్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి నేషనల్ అవార్డు విన్నర్ శ్రీకర్ ప్రసాద్‌ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా మలయాళం, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. 'సలార్' తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్ నుంచి రాబోతున్న ఈ సర్వైవల్‌ డ్రామా, తెలుగు ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Also Read: బ్లాక్‌ ఫారెస్ట్‌లో మహేష్ బాబు ట్రెక్కింగ్ - ఈ భయానక అడవి ప్రత్యేకతలు ఇవే!