OG Release Date: పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ డైరెక్టర్ సుజీత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'OG'. పవర్ స్టార్ ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న సినిమా ఇది. అందుకే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఇటీవల కాలంలో ఆ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో వారంతా కాస్త నిరాశలో ఉన్నారు. అయితే ఇప్పుడు అభిమానులను ఎగ్జైట్ చేసే ఓ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ను థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ రిలీజ్ డేట్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. 


'ఓజీ' సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యింది. పవన్ కళ్యాణ్ మరో 15 రోజులు కాల్ షీట్స్ ఇస్తే చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. కానీ జన సేనాని ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటంతో డిలే అవుతూ వస్తోంది. దీంతో ఈ సినిమాని ఎప్పుడు కంప్లీట్ చేస్తారు.. ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు ఫిక్స్ చేసారు. 2024 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురన్నారని, త్వరలోనే అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇస్తారని సినీ వర్గాలు వెల్లడించాయి. 


సెప్టెంబర్ 27 అనేది పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే డేట్. ఎందుకంటే 2013లో ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'అత్తారింటికి దారేది' అదే రోజున విడుదలైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాదు, అప్పటికి అత్యధిక కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అందుకే అప్పుడు పవన్ కు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఆ తేదీన ఇప్పుడు 'OG' చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


Also Read: హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-10 డబ్బింగ్ సినిమాలివే!


ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ `ఓజీ` సినిమాకి డేట్స్ ఇస్తారని వార్తలు వచ్చాయి. వీలైనంత త్వరగా మిగిలిన భాగం షూటింగ్ పూర్తి చేసి, ఆగస్ట్ నెలలో సినిమాని రిలీజ్‌ చేయాలని టీమ్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు టాక్ నడిచింది. ఒకవేళ 'పుష్ప 2' చిత్రం వాయిదా పడితే, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నారు. అయితే చివరకు 'అత్తారింటికి దారేది' తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారని సమాచారం. మరి దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారేమో చూడాలి. 


ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ కథాంశంతో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా 'ఓజీ'. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో అభిమానుల్లోనే కాదు, ట్రేడ్ లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టుగానే నాన్ థియేట్రికల్ అండ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆడియో రైట్స్ ను సోనీ సంస్థ 20 కోట్ల రూపాయలకు తీసుకుందని టాక్. అలానే 17 కోట్లకు ఓవర్ సీస్ హక్కులు అమ్ముడయ్యాయని భోగట్టా. 


OG చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, వెంకట్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్. థమన్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


Also Read: అప్పుడు ‘అరుంధతి’, ఇప్పుడు ‘హనుమాన్’ - 15 ఏళ్ల తర్వాత మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్!