టాలీవుడ్ లో మహేష్ బాబు బావగా 'SMS' సినిమాతో వెండితెరకు పరిచయమైన సుధీర్ బాబు విభిన్న తరహా కథలు ఎంచుకొని తన నటనతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్యకాలంలో వరుస అపజయాలు ఎదుర్కొంటున్నా ఈ హీరోకి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మామా మశ్చీంద్ర'. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా ఆకట్టుకున్న హర్షవర్ధన్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. సుధీర్ బాబు సరసన ఈషా రెబ్బ, మృణాళిని రవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోగా కెరియర్ లో ఫస్ట్ టైం ఈ సినిమా కోసం సుధీర్ బాబు ఎంతో కష్టపడ్డాడు.
సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేస్తూ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. మామ, అల్లుళ్ళ రివెంజ్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఒకసారి ట్రైలర్ ని గమనిస్తే.. సుధీర్ బాబుకు ఇద్దరు కూతుళ్లు ఈషా, మృణాళిని. ఆ ఇద్దరూ అచ్చం తమ తండ్రిలా ఉండే ఇద్దరు కుర్రాళ్ళను ప్రేమిస్తారు. వాళ్లని చూసి సుధీర్ బాబు ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత వాళ్లు తన చెల్లి కొడుకులని, తన చెల్లిని చంపింది కూడా తానే అని, అప్పుడు ఆ పిల్లలు అక్కడ లేరని, వదిలేసి వచ్చానని చెప్పడంతో సుధీర్ మేనల్లుల్లే హీరోలు అని, ఇద్దరు కూడా ట్విన్స్ అని తెలుస్తుంది.
అయితే వాళ్ల తల్లిదండ్రులను చంపిన మేనమామ మీద పగ తీర్చుకోకుండా మరదళ్లతో ప్రేమ వ్యవహారం సాగిస్తుండడం సుధీర్‌కు నచ్చదు. దీంతో వాళ్ళిద్దరిని చంపేయాలని సుధీర్ బాబు ప్లాన్ చేస్తాడు. అప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఒక్కటై మేనమామను ఏం చేశారు? సొంత చెల్లిని సుధీర్ బాబు ఎందుకు చంపాల్సి వచ్చింది? మాయా మశ్చీంద్రలుగా వచ్చిన అల్లుళ్లకు ఈ మామా మశ్చీంద్ర ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. ఇక ట్రైలర్ మొత్తంలో సుధీర్ బాబు మెయిన్ హైలెట్ గా నిలిచాడు. మూడు విభిన్న తరహా పాత్రల్లో అదరగొట్టేసాడు.
ఒక పాత్ర ఓల్డ్ గెటప్ లో ఉంటే, మరో పాత్ర యంగ్ అండ్ స్టైలిష్ గా, మూడో పాత్ర లావుగా కనిపిస్తుంది. ప్రస్తుతం 'మామ మశ్చీంద్ర' ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సృష్టి సెల్యూలాయిడ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ పతాకంపై సునీల్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాకి చైతన్ భరద్వాజ సంగీతం అందిస్తుండగా సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. హర్షవర్ధన్, అభినయ, అలీ రెజా, అజయ్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ ఈ చిత్రం అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : టైగర్ నాగేశ్వరరావు స్టువర్టుపురం సెట్ చూశారా?