Sudheer Babu's Maa Nanna Superhero Movie Review: నవ దళపతి సుధీర్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'మా నాన్న సూపర్ హీరో'. జీ 5 ఒరిజినల్ వెబ్ సిరీస్ 'లూజర్' ద్వారా విమర్శకులతో పాటు ప్రేక్షకుల్ని మెప్పించిన అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించారు. ఇందులో సాయి చంద్ త్రిపురనేని, షాయాజీ షిండే కీలక పాత్రల్లో నటించారు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ ముక్కోణపు ప్రేమ కథ ఎలా ఉందో చూడండి. 


కథ (Maa Nanna Superhero Story): జానీ (సుధీర్ బాబు) కార్ రెంటల్ సర్వీస్ గ్యారేజీలో పని చేస్తుంటాడు. అతని తండ్రి శ్రీనివాస్ (షాయాజీ షిండే)కు షేర్స్ కొనడం అంటే పిచ్చి. తన దగ్గర డబ్బులు లేకున్నా అప్పులు చేసి మరీ షేర్స్ కొని డబ్బులు పోగొట్టుకుంటాడు. తండ్రి చేసిన అప్పులు తీర్చడం జానీ పనిగా మారుతుంది. 


శ్రీనివాస్, జానీ సొంత తండ్రీ కొడుకులు కాదు. జానీని చిన్నతనంలో ఓ అనాథ ఆశ్రమం నుంచి దత్తత తీసుకుంటాడు శ్రీనివాస్. జాతకాలు నమ్మని శ్రీనివాస్, భార్య (ఆమని) మరణం తర్వాత తమ ఇంటికి జానీ వచ్చినప్పటి నుంచి దురదృష్టం వెంటాడుతోందని నమ్మడం మొదలు పెడతాడు. తండ్రి ఎన్ని అప్పులు చేసినా పల్లెత్తు మాట అనని జానీ... ఒకానొక దశలో అసహనం వ్యక్తం చేస్తాడు. లోకల్ లీడర్ డబ్బులు పోగొట్టిన కేసులో జైలులో ఉన్న తండ్రిని బయటకు తీసుకు రావడం కోసం జానీ కోటి రూపాయలు కట్టాల్సిన పరిస్థితి. అప్పుడు ఏం చేశాడు? 
దత్తత తీసుకున్న తండ్రిని జానీ వదిలేశాడా? కోటి కట్టాడా? జానీ కన్న తండ్రి ఎవరు? కేరళ ఎందుకు వెళ్లాడు? ఆ ప్రయాణంలో అతనికి పరిచయమైన వ్యక్తులు (సాయి చంద్, రాజు సుందరం) ఎవరు? తర్వాత ఏమైంది? అనేది మిగతా కథ. 


విశ్లేషణ (Maa Nanna Superhero Review Telugu): కళాత్మక చిత్రాలు అంటుంటాం. కానీ, తెలుగులో అటువంటి చిత్రాలు అరుదు. కథ, కథాంశంలో కళాత్మక అంశాలు ఉన్నా హీరో ఇమేజ్ లేదంటే ప్రేక్షకులు ఆదరిస్తారో? లేదో? అనే అనుమానంతో అనవసరమైన అంశాలు చొప్పించి అసలు అంశాన్ని మిగతావి డామినేట్ చేసేలా కమర్షియల్ హంగులతో తెరకెక్కిస్తారు. అటువంటి జిమ్మిక్స్ ఏమీ చేయకుండా కేవలం కథకు కట్టుబడి తీసిన సినిమా 'నా నాన్న సూపర్ హీరో'.


యువ హీరో సుధీర్ బాబుకు యాక్షన్ ఇమేజ్ ఉంది. ఆయన్ను అభిమానులు, దర్శక నిర్మాతలు 'నవ దళపతి' అంటున్నారు. పలు సినిమాల్లో ఆయన సిక్స్ ప్యాక్ చూపించారు. అటువంటి సుధీర్ బాబుకు చెక్ షర్ట్ వేసి సామాన్య హీరోలా అభిలాష్ రెడ్డి కంకర చూపించారు. హీరో ఇమేజ్ కోసం ఎటువంటి ఫైట్స్ యాడ్ చేయలేదు. స్పెషల్ సాంగ్స్ డిజైన్ చేయలేదు. హీరోయిన్ ఉన్నా, రాజు సుందరం వంటి క్యారెక్టర్ యాడ్ చేసినా కథ నుంచి పక్కకు వెళ్లలేదు. నిజాయతీగా తాను చెప్పాలి అనుకున్న కథను తెరకెక్కించారు.


Also Read: విశ్వం సినిమా రివ్యూ: కామెడీ బావుంది - మరి, సినిమా? శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అనొచ్చా?



'మా నాన్న సూపర్ హీరో' కథ మొదలైన కాసేపటికి ఇంటర్వెల్ ఏం జరుగుతుందో చెప్పవచ్చు. ఇంటర్వెల్ మొదలైన తర్వాత క్లైమాక్స్ ఏం జరుగుతుందో చిన్న పిల్లాడు కూడా చెబుతాడు. కథలో ట్విస్టులు లేవు. కథనంలో మెరుపులు లేవు. నిడివి గురించి ఆలోచించకుండా, నిదానంగా ముందుకు తీసుకు వెళ్లారు. అయితే, చాలా సన్నివేశాలు మనసుల్ని తాకుతాయి. ఆ ఎమోషన్స్ ఆడియన్స్ మనసులో కలిగించడంలో దర్శకుడిగా, రచయితగా అభిలాష్ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా పతాక సన్నివేశాలను ఆయన తెరకెక్కించిన తీరు బావుంది. అయితే... హీరోయిన్ ట్రాక్, రాజు సుందరం ఎపిసోడ్ అనవసరం అనిపిస్తాయి.


జానీ పాత్రలో సుధీర్ బాబు ఓదిగిపోయారు. పలు సన్నివేశాల్లో ఆయన సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు. ప్రేమ్ చంద్ నటనకు అసలు వంక పెట్టలేం. సన్నివేశాలను హృద్యంగా మలచడంలో, ఆర్ద్రత తీసుకు రావడంలో ఆయన నటన ఎంతగానో హెల్ప్ అయ్యింది. తండ్రి పాత్రలో షాయాజీ షిండే బదులు మరొకరు ఉంటే బావుండేది. ఆయన సరిగా చేయలేదని కాదు. ఆ పాత్రకు ఆయన బదులు తెలుగు నటుడు ఉన్నట్టు అయితే మరింత బావుండేది. హీరోయిన్ ఆర్నా, రాజు సుందరం, హర్షవర్ధన్ తదితరులు ఉన్నంతలో బాగా చేశారు.


మా నాన్న సూపర్ హీరో... సగటు కమర్షియల్ సినిమాల మధ్యలో విభిన్నంగా నిలిచే సినిమా. వినోదం కోసం కాకుండా భావోద్వేగంతో చూడాల్సిన సినిమా. ఇందులోని చివరి అరగంట బరువైన గుండెతో ప్రేక్షకుల్ని థియేటర్ల నుంచి బయటకు పంపిస్తుంది.


Also Read'వేట్టయన్' రివ్యూ: మాసీగా తీసిన క్లాస్ మెసేజ్ - వేటగాడు గురి పెడితే ... రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?