Jigra Movie Review: ‘ఆర్ఆర్ఆర్’లో సీతగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఆలియా భట్. ఇప్పుడు ‘జిగ్రా’ అనే లేడీ ఓరియంటెడ్ యాక్షన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. మరి సినిమా ఎలా ఉంది?


కథ: సత్యభామ (ఆలియా భట్), అంకుర్ ఆనంద్ (వేదాంగ్ రైనా) అక్కాతమ్ముళ్లు. వీరి తల్లి చిన్నతనంలోనే చనిపోతుంది. తల్లి చనిపోయిన కొద్దిరోజులకే తండ్రి కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో తమ్ముడు అంకుర్‌ను చిన్నప్పటి నుంచి సత్యభామనే పెంచి పెద్దవాడ్ని చేస్తుంది. బాగా ధనవంతులైన వారి ఇంట్లో హోటల్ మేనేజ్‌మెంట్ స్టాఫ్‌గా పని చేస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో వాళ్లబ్బాయి కబీర్ (యువరాజ్ విజన్), అంకుర్ మంచి ఫ్రెండ్స్. కానీ కబీర్‌కు ఉన్న చెడ్డ అలవాట్ల కారణంగా తనకి దూరంగా ఉండమని సత్య ఎప్పుడూ అంకుర్‌ను హెచ్చరిస్తూనే ఉంటుంది.


విదేశాల నుంచి వచ్చిన కబీర్... అంకుర్ బిజినెస్ ఐడియాని తన ఇంట్లో వాళ్లకు చెప్తాడు. ఈ ఐడియా వాళ్లకి కూడా నచ్చడంతో ఇన్వెస్టర్లకు చెప్పమని మలేషియా దగ్గరలో ఉన్న హన్షి దావో అనే దేశానికి పంపిస్తారు. ఆ దేశంలో కబీర్ ఒక పార్టీలో డ్రగ్స్ తీసుకుంటారు. తర్వాత చెకింగ్‌లో పోలీసులకు దొరికిపోతారు. హన్షి దావోలో డ్రగ్స్‌తో దొరికితే మరణశిక్ష విధిస్తారు. ఈ విషయాన్ని అంకుర్ దగ్గర దాచి రెండు నెలల్లో బయటకు వస్తావని మాయ మాటలు చెప్పి నేరం ఒప్పుకునేలా చేస్తారు కబీర్ తరఫు లాయర్స్. దీంతో తమ్ముడిని కాపాడటానికి సత్యభామ తనకు కుదిరిన ప్రయత్నాలన్నీ చేస్తుంది. కానీ జైలు నుంచి తప్పించడం తప్ప మరో మార్గం కనిపించదు. దీంతో తమ్ముడిని కాపాడేందుకు జైలు నుంచి తప్పించాలని సత్య డిసైడ్ అవుతుంది. మరి ఈ ప్రయత్నంలో సత్య విజయం సాధించిందా? ముత్తు (రాహుల్ రవీంద్రన్), భాటియా (మనోజ్ పహ్వా) ఎవరు? ఇవన్నీ తెలియాలంటే జిగ్రా చూడాల్సిందే...


విశ్లేషణ: ఇండియన్ స్క్రీన్ మీద తక్కువగా కనిపించే సినిమాల్లో జైల్ బ్రేక్ జోనర్ ఒకటి. అంటే జైల్లో ఉన్న వారు తప్పించుకోవడం లేదా జైల్లో ఉన్న తమవారిని బయట వారు తప్పించడానికి ప్రయత్నించడం అన్నమాట. వేరే జోనర్ సినిమాల్లో ఇలాంటి సీన్లు ఒక పార్ట్‌గా కనిపిస్తాయి తప్ప ఇదే పూర్తి థీమ్‌గా వచ్చే సినిమాలు తక్కువే. నితిన్ హీరోగా నటించిన ‘చెక్’ ఈ కోవలోకి వస్తుంది. జోనరే కొత్త తరహా కావడం వల్ల సినిమాకు ఆటోమేటిక్‌గా ఫ్రెష్‌నెస్ వస్తుంది.


సినిమా ప్రారంభం అయిన వెంటనే సూటిగా సుత్తి లేకుండా కథలోకి తీసుకువెళ్తాడు దర్శకుడు వసన్ బాలా. అక్కాతమ్ముళ్ల మధ్య బాండింగ్‌ను చాలా ఫాస్ట్‌గా, ఎఫెక్టివ్‌గా ఎస్టాబ్లిష్ చేశారు వసన్. దీంతో వీరి మధ్య ఎక్కువ సన్నివేశాలు లేకపోయినా ఆ కనెక్షన్‌ను ఆడియన్స్ ఫీల్ అవుతారు. కానీ అంకుర్ అరెస్టయ్యాక సినిమా బాగా స్లో అవుతుంది. ఇంటర్వెల్ వరకు కథ అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ ఆడియన్స్‌లో కలుగుతుంది.


Also Read: 'విశ్వం' ట్విట్టర్ రివ్యూ: యాక్షన్ సీన్లలో బోయపాటిని గుర్తు చేసిన శ్రీను వైట్ల... గోపీచంద్ సినిమా ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?


ఈ సినిమాలో కొత్తదనం ఏంటంటే జైల్లో ఉన్నవాళ్లు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బయట ఉన్నవాళ్లు వారిని విడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఒకరు చేసే ప్రయత్నాలు మరొకరికి తెలియవు. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల నుంచి మంచి థ్రిల్ జనరేట్ అయింది. దీనికి తోడు కొన్ని సన్నివేశాల్లో సస్పెన్స్ మెయింటెయిన్ చేయడానికి వసన్ బాలా రాసిన నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లే కూడా బాగా వర్కవుట్ అయింది. క్లైమ్యాక్స్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్. జైల్ బ్రేక్ ఎపిసోడ్ మొత్తాన్ని బాగా డిజైన్ చేశారు.


సినిమాలో మ్యూజిక్ సోసోగానే ఉంది. పూలోంకా అంటూ సాగే సాంగ్ వినడానికి, చూడటానికి కూడా బాగుంది. అచ్నిత్ టక్కర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు తగ్గట్లు ఉంది. సినిమాటోగ్రాఫర్ స్వప్నిల్ ఫ్రేమ్స్ బాగా పెట్టారు. ముఖ్యంగా క్లైమ్యాక్స్‌లో కొన్ని షాట్లు విజువల్ ఫీస్ట్‌లా అనిపిస్తాయి.


నటీనటుల విషయానికి వస్తే... సత్యభామగా ఆలియా భట్ అద్భుతంగా నటించారు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకుంటారు. అంకుర్‌గా చేసిన వేదాంగ్ రైనా కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత ముత్తు రూపంలో రాహుల్ రవీంద్రన్‌కు మంచి పాత్ర పడింది. ఆయన కూడా చాలా బాగా చేశారు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.


ఓవరాల్‌గా చెప్పాలంటే... ‘జిగ్రా’ ఆడియన్స్‌కు ఒక కొత్త తరహా సినిమాని చూసిన అనుభూతిని ఇస్తుంది కానీ ఫస్టాఫ్‌లో కాస్త జాగ్రత్త పడి ఉంటే బాగుండేది.



Also Read'వేట్టయన్' రివ్యూ: మాసీగా తీసిన క్లాస్ మెసేజ్ - వేటగాడు గురి పెడితే ... రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?