పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రాల్లో 'ఓజీ' (OG Movie) ఒకటి. మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో శ్రియా రెడ్డి కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఆమె పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తున్నారు. అయితే, ఆయన సినిమా ఒక్కటి కూడా చూడలేదని చెబుతున్నారు. మరి, సినిమాకు ఎందుకు ఓకే చెప్పారు? అంటే... ఆసక్తికరమైన అంశాలు చెప్పారు.


స్క్రిప్ట్ తర్వాతే పవన్ కళ్యాణ్!
తెలుగులో ఇద్దరు అగ్ర కథానాయకుల సినిమాల్లో శ్రియా రెడ్డి కీలకమైన పాత్రలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 'ఓజీ' కంటే ముందు ప్రభాస్ 'సలార్' ఓకే చేశారు. తాను మళ్ళీ సినిమాల్లో నటించాలని అనుకోలేదని, ప్రశాంత్ నీల్ ఆరు నెలలు ఫోనుల ఫోనులు చేయడంతో, కథలో మిగతా పాత్రలతో తన పాత్రకూ సమానమైన ప్రాముఖ్యం ఉండటం ఆ సినిమా ఓకే చేశానని చెప్పుకొచ్చారు శ్రియా రెడ్డి. 


'సలార్' తర్వాత మరో సినిమా చేయాలని శ్రియా రెడ్డి అనుకోలేదట. ఆ ఒక్క సినిమా చేసి మళ్ళీ నటనకు ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటే... 'ఓజీ' స్క్రిప్ట్ వచ్చిందని వివరించారు. ఈ సినిమా గురించి శ్రియా రెడ్డి మాట్లాడుతూ ''నాకు సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ గారు బాగా తెలుసు. నా చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. దర్శకుడు సుజీత్ ఫోన్ చేస్తారని, మాట్లాడమని చెప్పారు. సుజీత్ ఫోన్ చేసి ఐదారు నిమిషాలు మాట్లాడిన తర్వాత 'ఓజీ' చేయాలని ఫిక్స్ అయ్యా. కథ అంత బాగా నచ్చింది. 'ఓజీ' ఓకే చేయడానికి మొదటి కారణం స్క్రిప్ట్. ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ గారు'' అని చెప్పారు. 


పవన్ పొలిటికల్ స్పీచ్ ఇష్టం!
తాను పవన్ కళ్యాణ్ సినిమాలు చూడలేదు గానీ తనకు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రసంగాలు అంటే చాలా ఇష్టమని శ్రియా రెడ్డి తెలిపారు. తాను న్యూస్ ఎక్కువ చూస్తానని, ప్రతి రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఇష్టమని, రాజకీయ సభల్లో పౌరుషంగా మాట్లాడతారని, అది తనకు ఎంతో నచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు.


ప్రేక్షకుల ఊహలన్నీ తప్పే!
'ఓజీ' సినిమాలో హిందీ హీరో ఇమ్రాన్ హష్మీ, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, తమిళ నటుడు అర్జున్ దాస్... ఇలా భారీ తారాగణం ఉంది. శ్రియా రెడ్డి పేరు బయటకు రావడంతో వారిలో ఎవరో ఒకరికి జోడిగా ఆమె నటిస్తున్నారని ప్రేక్షకులు ఊహిస్తున్నారని, కామెంట్స్ చేస్తున్నారని... ఆ ఊహలన్నీ తప్పేనని శ్రియా రెడ్డి తెలిపారు. తన క్యారెక్టర్ ఏమిటనేది సినిమా చూస్తే తెలుస్తుందన్నారు.


Also Read రామ్ చరణ్‌ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే  


'ఓజీ'కి సుజీత్ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంకా అరుల్ మోహన్ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 'నాటు నాటు...'కు ఆస్కార్ అందుకున్న 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. కొన్ని రోజుల చిత్రీకరణ చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్రలో బిజీగా ఉండటంతో ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణకు విరామం ఇచ్చారు. 


Also Read : పూజా హెగ్డేను తీసేసి మహేష్ సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్?