దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన చిత్రం 'సీతా రామం'. యుద్ధంతో రాసిన ప్రేమకథ... అనేది ఉపశీర్షిక. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతోంది. ఇందులోని 'కానున్న కళ్యాణం' పాటను విడుదల చేశారు.
విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా... 'కానున్న కళ్యాణం' అనురాగ్ కులకర్ణి, సింధూరి అద్భుతంగా ఆలపించారు. తెలుగు సినీ సాహిత్యానికి ఆస్కార్ స్థాయి గౌరవం అందించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి చివరి రోజుల్లో రాసిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అసలు ఈ పాట నేపథ్యం ఏంటి? సాహిత్యాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం.
పెళ్లి అనేది జీవితంలో ఓ మహత్తరమైన ఘట్టం. అప్పటి వరకూ గడిపిన ఒంటరి జీవితానికి ముగింపు పలికి... సరికొత్తగా ఓ తోడు చేయి అందుకుని ముందుకు నడవాల్సిన సమయం అది. ఆ సమయంలో మనసులో తెలియని ఏదో బెరుకు, ఆందోళన ఉండటం సహజం. తర్వాత జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన తీపి క్షణాలు అవి. మరి అలాంటి సందిగ్ధ స్థితికి తోడు పక్కన ఎవరూ ఉండకూడని పరిస్థితులు జత పడితే ఓ యువతి మనసు ఎలా ఉంటుంది. ఆ అలజడిని సమాధాన పరిచేది ఎవరు. ఏ తోడును నమ్మి ముందడుగు వేస్తుందో అతన్నే కదా ప్రశ్నించాల్సింది. సరిగ్గా అలాంటి అద్భుతమైన సందర్భాన్ని అంతే అర్థవంతంగా చెబుతూ సిరివెన్నెల కురిపించిన ప్రేమ జడి ఈ పాట.
సాహిత్యాన్ని ఓ సారి చూస్తే...
||ఆమె|| కానున్న కల్యాణం ఏమన్నది..!?
||అతడు|| స్వయంవరం మనోహరం..
||ఆమె|| రానున్న వైభోగం ఎటువంటిది..!?
||అతడు|| ప్రతి క్షణం మరో వరం..
||ఆమె|| విడువని ముడి ఇది కదా..
||అతడు|| ముగింపు లేని గాథ గా..
||ఆమె|| తరముల పాటుగా..
||అతడు|| తరగని పాటగా..
||ఆమె|| ప్రతి జత సాక్షిగా..
||అతడు|| ప్రణయమునేలగా.. సదా..
కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా
కళ్ళముందు పారాడగా...
పల్లవి లేకుండా చరణంతోనే మొదలైందా అనిపించేలా పాట రాశారు సీతారామ శాస్త్రి. చరణమంతా అమ్మాయి తన మనసులో ఆందోళనకు, అలజడికి కారణమవుతున్న విషయాలను ప్రశ్నల రూపంలో అడుగుతుంటే... ఆ ప్రేమికుడు సమాధాన పరుస్తున్నాడు. కానున్న కల్యాణం ఏమన్నది అంటే స్వయంవరం మనోహరం అని చెబుతోంది అంటూ సముదాయించాడు. రానున్న వైభోగం ఎటువంటిది అని అమ్మాయి ప్రశ్నిస్తే... ప్రతి క్షణం మరో వరంలా ఉంటుందని ఊరిస్తున్నాడు. విడువని ముడి ఇది కదా అని అమ్మాయి అడిగితే... ముగింపు లేని గాథ అని హామీని ఇస్తున్నాడు. తరముల పాటుగానా అనే అమ్మాయి సందేహానికి ముక్తాయింపు ఇస్తూ మన ప్రేమ తరగని పాట అంటూ ధైర్యమిస్తున్నాడు. ప్రతి జత సాక్షిగా ప్రణయాన్నేలదామంటూ రాబోయే అందమైన రోజులను చూపిస్తున్నాడు. ఈ ప్రశ్న, సమాధానాలకు కోరస్ రూపంలో కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా కళ్లముందు పారాడుతాయంటూ ధైర్యమిచ్చే పదాలు.
||ఆమె|| చుట్టూ ఎవ్వరూ ఉండరుగా..!
||అతడు|| కిట్టని చూపులుగా..
||ఆమె|| చుట్టాలంటూ కొందరుండాలిగా..!
||అతడు|| దిక్కులు ఉన్నవి గా..
||ఆమె|| గట్టి మేళమంటూ ఉండదా..!?
||అతడు|| గుండె లోని సందడి చాలదా..!?
||ఆమె|| పెళ్ళి పెద్దలెవరు మనకి..!?
||అతడు|| మనసులే కదా..!
||ఆమె|| అవా సరే..!
కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా
కళ్ళముందు పారాడగా...
ఈ చరణం ఓ యువతి హృదయంలో పెళ్లి విషయంలో పెట్టుకునే చిన్న చిన్న కోరికలు... అవి ఉండవుగా అనే దిగులు. పెళ్లిలో చుట్టూ ఎవరూ ఉండరుగా అని ప్రశ్నిస్తే... ఆ ప్రేమికుడు ఆ ప్రశ్నను వేరేలా మార్చేస్తూ కిట్టని చూపులుగా అన్నాడు. కిట్టని చూపులు అంటే గిట్టని చూపులు అంటే మనం అంటే నచ్చని వాళ్లు అన్నట్లు. దిష్టి పెట్టేవాళ్లు అన్నట్లు. అంటే ఎవరైనా ఉంటే మన జంట దిష్టి తగులుతుంది అందుకే ఎవరు వద్దన్నట్లు అబ్బాయి సముదాయింపు. అయినా తగ్గని అమ్మాయి వెంటనే కనీసం చుట్టాలంటూ కొందరు ఉండాలిగా అంది. వెంటనే ఆ అబ్బాయి దిక్కులు ఉన్నాయిగా అవే మన చుట్టాలన్నాడు. గట్టి మేళమంటూ ఉండకపోతే పెళ్లి కాదుగా అని అమ్మాయి అడిగితే....మన గుండెలోని సందడి చాలదా అంటూ సర్ది చెప్పాడు. అసలు మన పెళ్లికి పెద్దలెవరు అని అడిగితే....మన మనసులే పెళ్లి పెద్దలంటూ అద్భుతమైన సమాధానమిచ్చాడు. అవునా సరే అంటూ ఆ అమ్మాయి మురిసిపోయింది ఇక.
||అతడు|| తగు తరుణం ఇది కదా..!
||ఆమె|| మదికి తెలుసుగా...
||అతడు|| తదుపరి మరి ఏమిటట..!?
||ఆమె|| తమరి చొరవట...
||అతడు|| బిడియమిదేంటి కొత్తగా..!?
||ఆమె|| తరుణికి తెగువ తగదుగా..
||అతడు|| పలకని పెదవి వెనక..
||ఆమె|| పిలుపు పోల్చుకో..
||అతడు|| సరే మరి..!
కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా
కళ్ళముందు పారాడగా...
సరే ఇప్పుడు అమ్మాయికున్న సందేహాలు తీర్చిన మన హీరో ఊరికే ఊరుకోడుగా... ఇక అందుకే తన విరహ వేదనను ఆ అమ్మాయి ముందు బయటపెట్టే కొంటె పనులు మొదలు పెట్టాడు. ఇప్పుడు అబ్బాయి ప్రశ్నలు అడిగితే అమ్మాయి సమాధానాలిస్తున్నది మాట. తగు తరుణం ఇది కదా అని పద్ధతిగా మొదలు పెట్టాడు. ఆ విషయం మదికి తెలుసుగా అంది ఆ అమ్మాయి. తదుపరి మరి ఏమిటట అంటూ చిలిపితనాన్ని ప్రదర్శించాడు. తమరి చొరవట అంటూ ఆ అమ్మాయి సిగ్గుపడింది. అంతకు ముందు ఆ ఎర్రని సిగ్గుల మొగ్గను అలా చూడని ఆ అబ్బాయి...బిడియమిదేంటి కొత్తగా అని అడిగాడు. తరుణి అంటే స్త్రీ కి తెగువ తగదుగా అంటూ సిగ్గును దాచుకునే ప్రయత్నం చేసింది. తడబడుతున్న తన ప్రియురాలి పెదవులను నిశితంగా పరిశీలించిన ప్రియుడు... పలకని పెదవి వెనుక ఏంటని అడిగితే... ఆ పిలుపేంటో నువ్వే పోల్చుకో అంటూ అమ్మాయి కూడా తన ప్రేమను వ్యక్తపరిచింది. ఇంకేముంది సరే మరి అంటూ తన ప్రియురాలిని దగ్గరకు తీసుకోవటంతో పాట ముగించారు.
పల్లవి, చరణం లాంటి ప్రయోగాలకు కొంచెం దూరంగా సిరివెన్నెల కలం ఈ పాటలో ప్రేమను కురిపించింది. పెళ్లికి ముందు యువతీ యువకుల్లో ప్రత్యేకించి ప్రేమించుకున్న రెండు హృదయాల్లో ఉండే ఆ సంఘర్షణను అద్భుతంగా పలికించారు ఒలికించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన మనల్ని వదిలి వెళ్లిపోయినా....మన హృదయాల్ని ఎప్పటికీ అంటిపెట్టుకుని ఉండే పాటల జాబితాలో మరోటి చేర్చి వెళ్లారు.
ఇంతకు ముందు హను రాఘవపూడిత 'కృష్ణగాడి వీర ప్రేమగాథ', 'పడి పడి లేచే మనసు' సినిమాలకు సంగీతం అందించిన విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారని అర్థమవుతోంది. 1965 మిలటరీ నేపథ్యం ఉన్న కథ, హిమాలయాల్లో సాగే అందమైన ప్రేమ కథకు కావాల్సిన ఆహ్లాద భరిత వాతావరణాన్ని తన స్వరాలతో చెవులకు కట్టారు. ఈతరం మణిరత్నంగా ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలను ఆనందింప చేస్తున్న హను రాఘవ పూడి కెరీర్ లో మరో క్లాసిక్ గా ఈ చిత్రం నిలిచిపోనుందన్న భావనలను అందించేలా సినిమా టేకింగ్ కనిపిస్తోంది. మొత్తంగా సిరివెన్నెల పాట మరోసారి సంగీత ప్రియులను, సాహిత్య హృదయాలను తట్టి లేపుతోంది.
Also Read : 'స్లమ్‌డాగ్ మిలియనీర్'కు 8 ఆస్కార్స్ వచ్చినప్పుడు 'ఆర్ఆర్ఆర్'కు ఎందుకు రాకూడదు?
'అందాల రాక్షసి', 'పడి పడి లేచె మనసు' చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రమిది. రష్మికా మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రలో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read : పవర్ స్టార్, లేడీ పవర్ స్టార్‌పై 'ప్రస్థానం' డైరెక్టర్ వరుస ట్వీట్లు - అసలు ఏమైందంటే?