తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ ఏడాది చాలా మంది దిగ్గజాలను చిత్రసీమ కోల్పోయింది. తాజాగా సీనియర్ టెక్నీషియన్ ఒకరు మరణించారు. పూర్తి వివరాల్లోకి వెళితే... 


సీనియర్ ఎడిటర్ వెంకటేశ్వరరావు ఇకలేరు
సీనియర్ ఎడిటర్ పి. వెంకటేశ్వర రావు ఈ రోజు (జూన్ 20, మంగళవారం) చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఇప్పుడు ఆయన వయసు 72 ఏళ్ళు. ఇవాళ మధ్యాహ్నం 12  గంటలకు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో చిత్రాలకు వెంకటేశ్వర రావు  పని చేశారు. ఎన్నో గొప్ప చిత్రాలకు ఎడిటర్ గా ఆయన సేవలు అందించారు. 


కెఎస్ఆర్ దాస్ మేనల్లుడే ఈయన!
ఎడిటర్ వెంకటేశ్వర రావు ఎవరో కాదు... అలనాటి అగ్ర హీరోలతో పలు హిట్స్ తీసిన యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్, అగ్ర దర్శకుడు కెఎస్ఆర్ దాస్ మేనల్లుడు!


విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కథానాయకుడిగా నటించిన 'యుగంధర్'తో పాటు 'మొండి మొగుడు పెంకి పెళ్ళాం', 'కెప్టెన్ కృష్ణ', 'ఇద్దరు అసాధ్యులు', 'ముద్దాయి' వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు వెంకటేశ్వర రావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. సుమారు 200లకు పైగా సినిమాలకు ఆయన పని చేశారు. అప్పట్లో సౌత్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప ఎడిటర్లలో ఆయన పేరు వినపడేది. 


గొప్ప దర్శకులతో పని చేసిన వెంకటేశ్వర రావు
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, మేనమామ కెఎస్ఆర్ దాస్, పి. వాసు, మంగిమందన్, వై.కె. నాగేశ్వర రావు, బోయిన సుబ్బారావు వంటి ప్రముఖ దర్శకులతో వెంకటేశ్వర రావు పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకటేశ్వర రావు కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. తెలియజేస్తున్నారు. 


గురువారం అంతిమ సంస్కారాలు
వెంకటేశ్వర రావు అంతిమ సంస్కారాలు ఈ నెల 22వ తేదీ (గురువారం) నాడు చెన్నైలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఆయన మృతి పట్ల తెలుగు ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోటగిరి  వెంకటేశ్వర రావు (చంటి), ప్రధాన కార్యదర్శి మార్తాండ్ కె వెంకటేష్  సంతాపాన్ని ప్రకటించారు.


Also Read రామ్ చరణ్‌ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే


ఈ ఏడాది 2023 ప్రారంభం నుంచి తెలుగు చిత్రసీమకు కోలుకోలేని రీతిలో విషాదాలు ఎదురవుతూ ఉన్నాయి. కళాతపస్వి కె. విశ్వనాథ్, నటి జమున, యువ కథానాయకుడు నందమూరి తారక రత్న తదితరులను కోల్పోయింది. ఇటీవల నటుడు శరత్ కుమార్ సైతం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. 


వీవీ వినాయక్, శ్రీను వైట్ల, ఏఎస్ రవికుమార్ చౌదరి వంటి దర్శకులకు గురువు అయిన సాగర్, సూర్య సహా ఎందరో తమిళ కథానాయకుల నటనకు తెలుగులో తన గొంతుతో ప్రాణం పోసిన ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి, దిగ్గజ గాయని వాణి జయరామ్ కూడా ఈ ఏడాది తుదిశ్వాస విడిచారు. ఒక్కొక్కరి మరణం తెలుగు చిత్రసీమ ప్రముఖులను ఎంతో బాధించింది. సీనియర్లతో తమకు ఉన్న అనుబంధాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. 


Also Read మీ కడుపు మంటకు ఫ్రీగా మజ్జిగ ఇస్తా - రూమర్స్, ట్రోలర్స్‌కు తమన్ దిమ్మతిరిగే రిప్లై