"యుద్ధంలో పోరాటం చేయడానికి ఇతర దేశాలు తమ సైనికులను పంపడం సరైన చర్య కాకపోవచ్చు. కానీ, తమ దేశస్థులను సురక్షితంగా వెనక్కి తీసుకు రావడం కోసం సైనికులను పంపడం బాధ్యత" అని హీరో రామ్ పోతినేని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో భారతీయులను సేవ్ చేయమని ఆయన కోరారు. అక్కడ భారతీయులు ధైర్యంగా ఉండాలని, వారి కోసం ప్రార్థనలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఉక్రెయిన్ వార్ గురించి రామ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.






Also Read: యూట్యూబ్‌లో ఆ రికార్డ్ సాధించిన ఫస్ట్ సౌతిండియన్ హీరో రామ్


ఉక్రెయిన్ మీద దాడిని రష్యా అధినేత పుతిన్ సమర్ధించుకుంటున్నారు. రష్యా సైనిక దాడులకు ఉక్రెయిన్ భయపడటం లేదు. ధైర్యంగా ఎదుర్కొంటోంది. ఇప్పుడు రష్యా - ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న రావణకాష్టం గురించి ప్రపంచం అంతా దృష్టి సారించింది. ఉక్రెయిన్ అంతా యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అక్కడ ఉన్న మన దేశస్థుల గురించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఓ భారతీయుడి మరణం పలువుర్ని కలచివేసింది. వీలైనంత త్వరగా ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులు అందరినీ దేశానికి క్షేమంగా తీసుకు రావాలని కోరుతున్నారు. రామ్ చేసిన ట్వీట్ భారతీయుల ఆకాంక్షకు అద్దం పడుతోందని పలువురు నెటిజన్లు అంటున్నారు.


సినిమాల గురించి మాత్రమే కాకుండా... భారతీయ పౌరుడిగా బాధ్యతతో రామ్ ట్వీట్స్ చేస్తుంటారు. గతంలోనూ సామాజిక సమస్యలపై ఆయన స్పందించిన సందర్భాలు ఉన్నాయి. ఇక, సినిమాలకు వస్తే... ప్రస్తుతం 'ది వారియర్' సినిమాలో ఆయన నటిస్తున్నారు. అది పూర్తి అయిన తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. ఈ రెండు సినిమాలకూ శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. 


Also Read: బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పాన్ ఇండియా సినిమా, ఇదిగో అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌