దర్శకుడు బోయపాటి శ్రీను పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధం అయ్యారు. రామ్ పోతినేని కథానాయకుడిగా ఆయన ఓ సినిమా చేయనున్నారు. బోయపాటి, రామ్ కలయికలో తొలి చిత్రమిది. పాన్ ఇండియా లెవల్‌లో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి. హిందీలో డబ్బింగ్ అయ్యాయి. ఆయన సినిమాలకు ఉత్తరాది ప్రేక్షకుల్లో డిమాండ్ ఉంది. మరోవైపు రామ్ సినిమాలకు కూడా హిందీలో సూపర్ మార్కెట్ ఉంది. రామ్ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేయగా... మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు వీళ్ళిద్దరి కలయికలో సినిమా అంటే కచ్చితంగా నార్త్‌లో డిమాండ్ ఉంటుందని చెప్పవచ్చు.
బోయపాటి శ్రీను, రామ్ కలయికలో సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రామ్ హీరోగా రూపొందుతున్న 'ది వారియర్' సినిమాకు ఆయనే నిర్మాత. బోయపాటి సినిమా ఆయనకు రామ్‌తో రెండో సినిమా. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో, ఉన్నత నిర్మాణ విలువలతో ఈ సినిమాను నిర్మించనున్నట్టు శ్రీనివాసా చిట్టూరి వెల్లడించారు. హీరోగా రామ్ 20వ చిత్రమిది. బోయపాటి శ్రీనుకు 10వ సినిమా.
'భద్ర', 'తులసి', 'సింహ', 'దమ్ము', 'లెజెండ్', 'సరైనోడు', 'జయ జానకి నాయక', 'అఖండ'... బోయపాటి శ్రీను బ్లాక్ బస్టర్ చిత్రాలు చేశారు. అయితే... సినిమా, సినిమాకు మధ్య ఆయనకు విరామం వస్తోంది. కానీ, ఈసారి విరామం లేకుండా 'అఖండ' విడుదలైన వెంటనే కొత్త సినిమా ప్రకటించారు. 'ఇస్మార్ట్ శంకర్'తో భారీ విజయం అందుకున్న రామ్, ఆ తర్వాత 'రెడ్'తో డీసెంట్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో 'ది వారియర్' చేస్తున్నారు. ఆ తర్వాత పాన్ సినిమా ప్లాన్ చేశారు.
నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ "బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. అదీ రామ్‌తో 'ది వారియర్' తర్వాత సినిమా కావడం ఇంకా హ్యాపీ. మా సంస్థకు ఇది ప్రతిష్టాత్మక సినిమా. రామ్‌తో తెలుగు, తమిళ భాషల్లో 'ది వారియర్' నిర్మిస్తున్నాం. బోయపాటి - రామ్ సినిమా కూడా భారీ స్థాయిలో, ఉన్నత నిర్మాణ విలువలతో తీస్తాం" అని అన్నారు.
Also Read: సమంత - పూజా హెగ్డే మధ్య గొడవ ముగిసినట్టేనా!?
Also Read: 'సన్ ఆఫ్ ఇండియా' రివ్యూ: వికటించిన ప్రయోగం!