ప్రముఖ నటుడు శరత్‌ బాబు అనారోగ్య సమస్యలతో ఇటీవల హాస్పిటల్ లో అడ్మిట్ అయిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ లోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే శరత్‌ బాబు ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొందరు నెటిజన్లు ఓ అడుగు ముందుకేసి ఆయన కన్నుమూసినట్లుగా వదంతులు ప్రచారం చేసారు. పలు ప్రముఖ వైబ్ సైట్లు సైతం శరత్ బాబు ఇకలేరంటూ వార్తలు ప్రచురించాయి. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడి హెల్త్ పై ఆయన సోదరి స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని.. శరత్ బాబు ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోందని తాజాగా మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. 


సోషల్ మీడియాలో శరత్ బాబు ఆరోగ్యం గురించి అన్నీ తప్పుడు వార్తలు వస్తున్నాయని ఆయన సోదరి ప్రకటనలో పేర్కొన్నారు. శరత్ బాబు కొంచెం రికవరీ అయ్యారని, రూమ్ కి కూడా షిఫ్ట్ చేయడం జరిగిందని ఆమె తెలిపారు. తొందరలోనే శరత్ బాబు పూర్తిగా కోలుకొని మీడియాతో మాట్లాడుతారని ఆశిస్తున్నామని వెల్లడించారు. ఆయన గురించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తలను ఎవరూ నమ్మవద్దని ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేసారు. 


కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 72 ఏళ్ళ శరత్ బాబు.. గతంలో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్య అస్వస్థకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్ పై శరత్ బాబుకు చికిత్స అందించిన వైద్యులు.. ఆయన ట్రీట్మెంట్ కు స్పందిస్తున్నారని, కాకపోతే అవయవాలు బాగా దెబ్బతిన్నాయని చెప్పారు. ముఖ్యంగా కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం వంటి అవయవాల పనితీరు సరిగా లేదని హెల్త్ బులిటన్ లో పేర్కొన్నారు. అప్పటి నుంచీ శరత్ బాబుకు హాస్పిటల్ లోనే చికిత్స అందిస్తుండగా.. తాజాగా ఆయన ఆరోగ్యం విషమించినట్లు రూమర్స్ స్ప్రెడ్ చేసారు. ఖుష్బు వంటి ప్రముఖ సెలబ్రిటీలు సైతం శరత్‌ బాబుకు నివాళులంలా ట్వీట్లు చేశారు. దీంతో కొన్ని మీడియా సంస్థలు అదే వాస్తవం అనుకుని ఆయన మరణించారంటూ వార్తలు పబ్లిష్ చేశాయి. దీనిపై శరత్ బాబు సోదరి స్పందిస్తూ.. అవన్నీ తప్పుడు వార్తలని, శరత్ బాబు కోలుకుంటున్నారని తెలిపారు. 


కాగా, దక్షిణాది చిత్ర పరిశ్రమలో దాదాపు ఐదు దశాబ్దాలుగా నట ప్రయాణం కొనసాగిస్తున్న శరత్ బాబు.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 220కి పైగా సినిమాల్లో నటించారు. హీరోగానే కాకుండా విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో  వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 1973లో 'రామరాజ్యం' సినిమాతో శరత్ బాబు తొలిసారిగా కథానాయకుడిగా నటించాడు. కన్నెవయసు, పంతులమ్మ, అమెరికా అమ్మాయి, మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, అన్వేషణ, సంకీర్తన, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, ఆపద్భాందవుడు లాంటి ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాల్లో శరత్ బాబు నటించారు. ఆయన చివరగా పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమాలో కనిపించారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో హాస్పత్రిలో జాయిన్ అయ్యారు. శరత్ బాబు వీలైనంత త్వరగా కోలుకోవాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. 


Also Read : రజనీకాంత్ 100% కరెక్ట్, నిజాలే మాట్లాడతారు - వైసీపీలో ఇష్యూలో జగపతి బాబు మద్దతు