టాలీవుడ్ లో సంక్రాంతి పండుగను సినిమాలకు అతి పెద్ద సీజన్ గా భావిస్తుంటారు. అందుకే స్టార్ హీరోల చిత్రాలను, క్రేజీ మూవీస్ ను అదే సీజన్ లో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఈ ఏడాది పండక్కి చిరంజీవి, బాలకృష్ణ, విజయ్, అజిత్ కుమార్ లాంటి స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. 2024 పొంగల్ కి 'గుంటూరు కారం'తో పాటుగా మరికొన్ని సినిమాలు రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే ప్రకటనలు వచ్చేసాయి. లేటెస్టుగా 'నా సామిరంగ' కూడా బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు నాగార్జున ఫస్ట్ లుక్, మహేష్ బాబు లుక్ కు సిమిలారిటీస్ ఉండటం ఆసక్తిరంగా మారింది. 


సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'గుంటూరు కారం'. 'హైలీ ఇన్‌ఫ్లేమబుల్' అనేది ట్యాగ్‌ లైన్. ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ గ్లిమ్స్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మహేశ్ గళ్ళ లుంగీ ధరించి, ఎన్నో ఏళ్ళ తర్వాత బీడీ నోట్లో పెట్టుకొని మాస్ లుక్ లో ఆకట్టుకున్నాడు. అలానే నోటిలో నుంచి బీడీ తీస్తూ.. 'ఏందట్టా జూస్తున్నావ్.. బీడీ త్రీడీలో కనిపిస్తోందా?' అంటూ మాస్ డైలాగ్ తో అదరగొట్టాడు.


కింగ్ అక్కినేని నాగార్జున సైతం తాజాగా 'నా సామిరంగ' ఫస్ట్ లుక్ లో లుంగీ కట్టుకొని, లైటర్ తో బీడీ వెలిగిస్తూ ఊర మాస్ అవతార్ లో ఆశ్చర్యపరిచారు. టైటిల్ గ్లింప్స్ లో పగిలిపోయిన బల్బ్ ఫ్యూజ్ తో బీడీ ముట్టించుకుంటూ కనిపించాడు. అంతేకాదు బీడీ కాలుస్తూ 'ఈసారి పండక్కి నా సామి రంగా' అంటూ తనదైన శైలిలో పవర్ ఫుల్ డైలాగ్ తో ఆకట్టుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత నాగ్ ను అలాంటి మాస్ గెటప్ లో చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. 


Also Read: కింగ్ నాగార్జునకు విలన్ గా మారిన విలక్షణ దర్శకుడు - ఆయన్ను గుర్తు పట్టారా?


ఇలా నాగార్జున - మహేష్ బాబు ఇద్దరూ ఫస్ట్ లుక్స్ లో లుంగీ కట్టుకొని బీడీలు తాగుతూ కనిపించారు. ఫ్యాన్స్ కి వింటేజ్ గెటప్స్ ని గుర్తు చేసారు. ఊహించని విధంగా 'నా సామిరంగ' - 'గుంటూరు కారం' సినిమాలు వచ్చే సంక్రాంతికే రాబోతుండటంతో, రెండిటి మధ్య కంపేరిజన్స్ మొదలయ్యాయి. రెండు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను పక్కపక్కన పెట్టి నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. 'ఈసారి సంక్రాంతికి బీడీలు 3Dలో కనిపిస్తాయేమో' అని, 'సంక్రాంతి పండక్కి బీడీల మధ్య యుద్ధం' చూడబోతున్నామని కామెంట్లు చేస్తున్నారు.


'నా సామిరంగ' అనేది రూరల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. ‘పోరింజు మరియం జోస్’ అనే మలయాళ మూవీ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు. ఇక 'గుంటూరు కారం' ఒక యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో మహేశ్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిర్మాత రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. 


మహేశ్ బాబు గతంలో సంక్రాంతి సీజన్ లో 'ఒక్కడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'బిజినెస్ మ్యాన్', 'సరిలేరు నీకెవ్వరూ' వంటి బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నారు. మరోవైపు నాగార్జున సైతం గత పదేళ్లలో 'సోగ్గాడే చిన్నినాయనా', 'బంగార్రాజు' వంటి రెండు పొంగల్ బ్లాక్ బస్టర్లు రుచి చూసారు. అందుకే ఈసారి ఫెస్టివల్ సీజన్ కు రావడం పక్కా అని ఫిక్స్ అయిపోయారు. కింగ్ మాస్ జాతర చూస్తారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.


కాకపోతే 'నా సామిరంగ',  'గుంటూరు కారం' సినిమాకు పోటీగా మరికొన్ని చిత్రాలు పెద్ద పండక్కి రావాలని నిర్ణయించుకున్నాయి. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న 'ఈగల్'.. జాంబిరెడ్డి హీరో తేజ సజ్జా 'హనుమాన్' సినిమా సంక్రాంతికి విడుదల అవుతాయని మేకర్స్ ప్రకటించారు. అలానే విజయ్ దేవరకొండ - పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ మూవీని కూడా ఫెస్టివల్ బరిలో దించాలని నిర్మాతలు భావిస్తున్నారట. మరి ఫైనల్ గా 2024 పొంగల్ రేసులో ఏయే సినిమాలు పోటీ పడతాయో వేచి చూడాలి.


Also Read: ధనుష్ మూవీలో పవర్ ఫుల్ రోల్‌ లో కింగ్ నాగ్!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial