కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) బర్త్ డే స్పెషల్ గా ఆయన నటిస్తున్న 'నా సామి రంగ' సినిమా (Naa Sami Ranga Movie)ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ గ్లింప్స్.. ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఊర మాస్ లుక్ లో సర్ప్రైజ్ చేశారు నాగ్. అయితే ఈ వీడియోలో ఆసక్తి కలిగించే మరో అంశం ఏంటంటే... దర్శకుడు కరుణ కుమార్ (Karuna Kumar) విలన్ గా కనిపించడం!


'నా సామి రంగ' గ్లింప్స్ ప్రారంభంలో కారులో నుంచి బయటకు వచ్చిన ఓ వ్యక్తి... 'ఈ పండక్కి పనైపోవాలి' అంటూ ఇంటెన్స్ వాయిస్ తో డైలాగ్ చెప్తాడు. లోపలికి వెళ్ళి స్టైల్ గా సిగరెట్ తాగుతూ నిలబడతాడు. కాసేపటికి నాగార్జున చేతిలో చావు దెబ్బలు తిని, తలుపు బద్దలు కొట్టుకొని బయట పడతాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు 'పలాస' దర్శకుడు కరుణ కుమార్.


'పలాస 1978' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమమైన కరుణ కుమార్... డెబ్యూ మూవీతోనే హిట్టు కొట్టాడు. సమాజంలోని కుల వ్యవస్థ, అణగారిన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. ఈ క్రమంలో జరిగే తిరుగుబాటు వంటి అంశాలతో రా అండ్ రస్టిక్ డ్రామాని చూపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలో సుధీర్ బాబుతో తీసిన 'శ్రీదేవి సోడా సెంటర్‌' సినిమా కూడా అలరించింది. 


Also Read: ధనుష్ మూవీలో పవర్ ఫుల్ రోల్‌ లో కింగ్ నాగ్!


ప్రస్తుతం వరుణ్ తేజ్ తో 'మట్కా' అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్న కరుణ కుమార్... ఇప్పుడు 'నా సామి రంగ' చిత్రంలో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. గతంలో 'ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య' సినిమాలో చిన్న పాత్రలో నటించిన దర్శకుడు... ఇప్పుడు ఏకంగా నాగార్జున లాంటి అగ్ర హీరోకి ప్రతినాయకుడిగా మారాడు. 


2024 సంక్రాంతికి రాబోతున్న 'నా సామిరంగ' సినిమాలో కరుణ కుమార్ రోల్ ఎంత ఉంటది? మెయిన్ విలనా? సెకండ్ విలనా? అనేది తెలియదు కానీ, ఆయన లుక్ అండ్ గెటప్ మాత్రం బాగున్నాయి. ఇది వర్కౌట్ ఐతే తెలుగు తెరకు మరో మంచి విలన్ దొరికినట్లే. మరి దర్శకుడు ఇకపై దర్శకత్వంపైనే దృష్టి పెడతారా? లేదా 'డైరెక్టర్ కమ్ యాక్టర్' గా రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తారా? అనేది చూడాలి. 


విలన్స్ గా రాణిస్తున్న స్టార్ డైరెక్టర్స్..


గతంలో కె. విశ్వనాథ్, జంధ్యాల దగ్గర నుంచి పూరీ జగన్నాథ్ వరకూ అనేక మంది దర్శకులు బిగ్ స్క్రీన్ మీద మెరిశారు. వారిలో కొందరు విలన్ వేషాలు వేసి మెప్పించారు. ప్రస్తుతం గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఎస్.జె సూర్య, అనురాగ్ కశ్యప్, మిస్కిన్ లాంటి స్టార్ డైరెక్టర్స్ ప్రతినాయకుడి పాత్రల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే.


Also Read: 'సెల్యులాయిడ్ సైంటిస్ట్' నాగార్జున - ఈ సినిమాలే నాగ్‌ను ‘కింగ్’ చేశాయ్!




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial