అక్కినేని నట వారసుడిగా ఆరంగ్రేటం చేసిన 'కింగ్' నాగార్జున.. కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన చిత్రాలు, విలక్షమైన పాత్రల్లో నటిస్తూ 'ట్రెండ్ సెట్టర్' గా నిలిచారు. ఒకే రకమైన ఇమేజ్ కు పరిమితం అవ్వకుండా, ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలు ఎంపిక చేసుకుంటూ టాలీవుడ్ 'పాత్ బ్రేకర్' అనిపించుకున్నారు. స్టార్ డైరెక్టర్స్ వెంట పరుగులు తీయకుండా, ఇండస్ట్రీకి న్యూ టాలెంట్ ని పరిచయం చేస్తూ 'సెల్యులాయిడ్ సైంటిస్ట్' గా కొనియాడబడుతున్నారు. గత ఓవైపు వెండితెరపై అలరిస్తూనే మరోవైపు బుల్లితెరపై సత్తా చాటారు. హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్ గా, బిజినెస్ మ్యాన్ గా, టీవీ హోస్ట్ గా తనదైన ముద్ర వేసుకున్నారు. ఈరోజుతో 64 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. నాగ్ బర్త్ డే సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుందాం!


నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు - అన్నపూర్ణ దంపతులకు 1959 ఆగస్టు 29న మద్రాసులో జన్మించాడు నాగార్జున. సొంతూరు ఆంధ్ర ప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా రామాపురం అయినప్పటికీ, ఏఎన్నార్ సినీ కెరీర్ కోసం మద్రాసు వెళ్లారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. అందుకే నాగ్ స్కూలింగ్ అంతా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో జరిగింది. లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసాడు. మద్రాస్‌లోని అన్నా యూనివర్శిటీలో మెకానికల్ ఇంజినీరింగ్‌ ఫస్ట్ ఇయర్ చదివిన నాగ్.. ఈస్టర్న్ మిచిగాన్ యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్‌ పట్టా పొందాడు. 


బాలనటుడిగా తెరంగేట్రం.. 'విక్రమ్' తో హీరోగా ఎంట్రీ
1967లో 'సుడిగుండాలు' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నాగార్జున యాక్టింగ్ కెరీర్ ప్రారంభించాడు. 'వెలుగు నీడలు'చిత్రంలో బాలనటుడిగా కనిపించాడు. 1986 'విక్రమ్' వంటి సూపర్ హిట్ సినిమాతో హీరోగా ఆరంగ్రేటం చేశారు. 'మజ్ను' మూవీతో ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత 'కలెక్టర్ గారి అబ్బాయి' 'కిరాయి దాదా' 'జానకి రాముడు' 'విక్కీ దాదా' చిత్రాలతో మంచి విజయాలు సాధించిన నాగ్.. 'ఆఖరి పోరాటం' సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ రుచిచూశారు. 1989లో వచ్చిన 'గీతాంజలి' సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు, కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇది ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకుంది. 


ట్రెండ్ సెట్టర్ 'శివ'
అదే ఏడాది విడుదలైన 'శివ' సినిమా నాగార్జునను సూపర్‌ స్టార్‌గా మార్చింది. ఇది ఆయన కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ మాత్రమే కాదు, టాలీవుడ్ లో ఒక ట్రెండ్‌ సెట్టర్‌. తెలుగు సినిమా అంటే శివకి ముందు, శివ తర్వాత అని మాట్లాడుకుంటున్నారంటే, అది ఎలాంటి సంచలనం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. 1990లో అదే సినిమాని హిందీలో రీమేక్ చేసి, బ్లాక్ బస్టర్ హిట్టుతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు నాగ్. ఆ తర్వాత విభిన్న స్క్రిప్ట్‌లతో ప్రయోగాలు చేసి "సెల్యులాయిడ్ సైంటిస్ట్" అనిపించుకున్నారు. ఈ క్రమంలో కొన్ని పరాజయాలు కూడా రుచి చూసారు. 


1992లో 'ప్రెసిడెంట్ గారి పెళ్ళాం' సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన నాగ్.. అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. 'రక్షణ', 'వారసుడు', 'అల్లరి అల్లుడు' సినిమాలు బిగ్గెస్ట్ హిట్లు సాధించాయి. 1994లో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన 'హలో బ్రదర్' మూవీ ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని అందించింది. అదే ఏడాది 'క్రిమినల్' వంటి తెలుగు హిందీ బైలింగ్విల్ మూవీలో నటించారు. 'నిన్నే పెళ్లాడతా' చిత్రంతో నిర్మాతగా మారిన నాగార్జున.. మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇది ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డుతో పాటుగా బెస్ట్ ఫిలింగా ఫిల్మ్‌ ఫేర్ అవార్డును గెలుచుకుంది. 


'అన్నమయ్య' లో నట విశ్వరూపం..
యువ సామ్రాట్ గా సక్సెస్ ఫుల్ గా సాగిపోతున్న సమయంలో రూట్ మార్చి 1997లో 'అన్నమయ్య' లాంటి అద్భుతమైన సినిమాలో నటించారు నాగార్జున. 'నిన్నే పెళ్లాడతా' మూవీలో లవర్ బాయ్ గా కనిపించిన, వెంటనే భక్తుడి పాత్రలో నటించి మెప్పించడం ఆయనకే చెల్లింది. అన్నమాచార్యులు పాత్రలో నాగ్ నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పాలి. ఆయన నటనకు మెచ్చి స్పెషల్ జ్యూరీ నేషనల్ అవార్డ్ వరించింది. 'నువ్వు వస్తావని' సినిమాతో బిగ్ హిట్టు కొట్టిన అగ్ర హీరో.. ఆ తర్వాత కొన్ని ప్లాప్స్ అందుకున్నాడు. 


నాగార్జున కెరీర్ ని మళ్ళీ ట్రాక్ లో పెట్టిన సినిమా 'సంతోషం'. ఆ తర్వాత 'మన్మథుడు' 'శివమణి' 'నేనున్నాను' 'మాస్' 'శ్రీరామదాసు' వంటి బ్లాక్ బస్టర్ హిట్లు సాధించారు. 'కింగ్' సినిమా తర్వాత 'కింగ్ నాగార్జున' గా మారిపోయారు. 'మనం' మూవీలో మూడు తరాల అక్కినేని హీరోలంతా కలిసి నటించి తమ ఫ్యామిలీకి మెమరబుల్ హిట్ అందించారు. 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాతో తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించిన నాగ్.. 'ఊపిరి' చిత్రంలో వీల్ చైర్ లోనే కూర్చొని హిట్టు కొట్టాడు. ఆ తర్వాత కొన్ని పరాజయాలు పలకరించినా ప్రయోగాలు మాత్రం మానుకోలేదు. మధ్యలో 'బిగ్ బాస్' రియాలిటీ షోతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. గతేడాది 'బంగార్రాజు' తో కొట్టాడు.. 'బ్రహ్మాస్త్ర' వంటి భారీ సినిమాలో భాగం అయ్యారు. 


బెస్ట్ యాక్టర్ గా నేషనల్ ఫిలిం స్పెషల్ జ్యూరీ అవార్డ్.. 
గత 37 ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలు అందిస్తున్న నాగార్జున.. ఇప్పటి వరకూ 98 చిత్రాల్లో నటించారు.. తన కెరీర్ లో ఎన్నో మైలురాళ్ళు అధిరోహించారు. తన సినిమాల ద్వారా ఎందరో ప్రతిభావంతులైన దర్శకులను నటీనటులు మరియు సాంకేతిక నిపుణులను ఇండస్ట్రీకి పరిచయం చేసారు. ఈ క్రమంలో ఎన్నో అవార్డులు రివార్డులు సాధించారు. బెస్ట్ యాక్టర్ గా 4 నంది అవార్డులతో పాటుగా, ప్రొడ్యూసర్ గా 5 పురష్కారాలు గెలుచుకున్నారు. 'అన్నమయ్య' సినిమాకి బెస్ట్ యాక్టర్ గా స్పెషల్ మెన్షన్ నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకున్నారు. ఇవే కాకుండా పలు ఫిలిం ఫేర్ అవార్డ్స్, ఐఫా ఉత్సవ్, సినిమా అవార్డ్స్ నాగ్ ఖాతాలో ఉన్నాయి. 


ఆరు పదులు దాటిన వయసులోనూ ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా పర్ఫెక్ట్ ఫిజిక్ ను మెయింటైన్ చేయడం నాగార్జునకే చెల్లింది. ఓవైపు తన ఇద్దరు కొడుకులు నాగచైతన్య & అఖిల్ లు హీరోలుగా సినిమాలు చేస్తున్నా.. రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తూ, 'అక్కినేని' లెగసీని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం తన 99వ చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్న నాగ్.. తన మైలురాయి 100వ సినిమా కోసం ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని, సుఖ శాంతులతో ఇలాంటి బర్త్ డేలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ.. 'ABP దేశం' కింగ్ అక్కినేని నాగార్జునకు పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.


Also Read: కింగ్ వస్తున్నాడు.. కత్తి పట్టుకొని సైకిల్ మీద సరికొత్తగా రాబోతున్న నాగ్!