తమిళ చలన చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం సృష్టించింది. కేరళ తీరంలో మొదలైన కేసు, కోలీవుడ్ తీరాన్ని తాకిందంటూ జోరుగా ప్రచారం జరిగింది. మరీ ముఖంగా తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితురాలైన తమిళ నటి, నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి (Varalakshmi Sarathkumar)కి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) నోటీసులు ఇచ్చిందంటూ వార్తలు వచ్చాయి. దాంతో ఆవిడ స్పందించారు. 


నాకు సమన్లు రాలేదు...
హాజరు కావాలని ఆదేశాలు లేవు
''ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల దృష్ట్యా ఈ సమస్య గురించి స్పష్టత ఇవ్వడం ముఖ్యమని నేను భావించాను. నాకు ఎన్ఐఏ సమన్లు ఇచ్చిందని జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమే. అవన్నీ పుకార్లు మాత్రమే. నాకు ఎటువంటి సమన్లు జారీ చేయలేదు. వ్యక్తిగతంగా హాజరు కావాలని ఎవరూ ఆదేశించలేదు. నేను కూడా ఎక్కడికి వెళ్ళలేదు'' అని వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ లేఖ విడుదల చేశారు. అసలు, ఆమె పేరు డ్రగ్స్ కేసులో ఎందుకు వచ్చింది? కారణం ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే... 


ఆగస్టు 18న కేరళలోని ఓ ఫిషింగ్ బోటును ఎన్ఐఏ అధికారులు సీజ్ చేశారు. ఆ బోటులో సుమారు 300 కేజీల కొకైన్ దొరికింది. దాని విలువ సుమారు రూ. 2100 కోట్లు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులు... వరలక్ష్మి దగ్గర గతంలో పనిచేసిన మేనేజర్ ఆదిలింగం (Adilingam)కి కూడా సమన్లు జారీ చేశారు. దాంతో నెక్స్ట్ టార్గెట్ వరలక్ష్మీ శరత్ కుమార్ అంటూ ప్రచారం మొదలైంది. 


ఆదిలింగంతో సంబంధం లేదు - వరలక్ష్మి
ఆదిలింగం పేరుతో డ్రగ్స్ కేసులో తన పేరు ముడిపెడుతూ వరుస కథనాలు వచ్చి పడుతుండటంతో అతని గురించి కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ స్పందించారు. ''మూడేళ్ళ క్రితం నా దగ్గర ఫ్రీలాన్స్ మేనేజర్ గా ఆదిలింగం పని చేశారు. నేను ఆ సమయంలో వేరే ఫ్రీలాన్స్ మేనేజర్లతో కూడా వర్క్ చేశా. ఆదిలింగంతో పని చేసినది కొన్ని రోజులు మాత్రమే. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతనితో మాటలు కూడా లేవు. దాంతో వార్తల్లో నా పేరు రావడం చూసి షాక్ అయ్యాను'' అని వరలక్ష్మీ శరత్ కుమార్ పేర్కొన్నారు. 


నిజానిజాలు తెలుసుకోకుండా...
ప్రభుత్వానికి సహకరించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, సంతోషంగా సహకరిస్తానని వరలక్ష్మీ శరత్ కుమార్ తెలిపారు. నిజానిజాలు తెలుసుకోకుండా సెలబ్రిటీల గురించి ఇటువంటి వార్తలు రాయడం, వాళ్ళను కేసుల్లోకి లాగడం నిరాశ కలిగిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  దయచేసి అవాస్తవాలను ప్రచారం చేయవద్దని మీడియాకు వరలక్ష్మీ శరత్ కుమార్ విజ్ఞప్తి చేశారు.


Also Read టార్గెట్ పాన్ ఇండియా - సెప్టెంబర్‌ బాక్సాఫీస్ బరిలో తెలుగు సినిమాలే టాప్!




 
'క్రాక్'తో మారిన వరలక్ష్మి కెరీర్
తెలుగులో వరలక్ష్మి శరత్ కుమార్ కెరీర్ గురించి చెప్పాలంటే... 'క్రాక్'కు ముందు, ఆ తర్వాత అని చెప్పాలి. రవితేజ సినిమాలో విలన్ జయమ్మగా ఆమె నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత 'యశోద', 'వీర సింహా రెడ్డి' సినిమాల్లో సైతం మంచి రోల్స్ చేశారు. ప్రస్తుతం 'శబరి' అని ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నారు. రవితేజ, గోపీచంద్ మలినేని కలయికలో రూపొందుతున్న తాజా సినిమాలో కూడా కీలక పాత్ర చేస్తున్నట్లు సమాచారం. 


Also Read ప్రతి పండక్కి... ప్రతి నెలలో శ్రీ లీల సినిమా - వినాయక చవితి నుంచి సంక్రాంతి వరకు!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial