Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో బాలీవుడ్ మొత్తం షేక్ అయింది. ఈ నెల 30న చంపేస్తామంటూ ముంబై కంట్రోల్ రూమ్ కు ఫోన్ వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ అనే ప్రాంతం నుంచి కాల్ చేస్తున్నామని, తన పేరు రాకీ భాయ్ అని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పినట్టు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ బెదిరింపు కాల్ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఆ వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేస్తున్నట్లు ముంబై పోలీసులు చెబుతున్నారు. సల్మాన్ ఖాన్ కు బెదిరింపు కాల్ రావడంతో మరోసారి బాలీవుడ్ ఉలిక్కిపడింది. దీంతో సల్మాన్ ఖాన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సల్మాన్ ఖాన్‌కు ఇలాంటి బెదిరింపు కాల్స్ ఇప్పుడేమీ కొత్త కాదు. అయితే ఈ కాల్స్ అన్నీ పేరుమోసిన గ్యాంగ్ స్టర్ ల నుంచి రావడమే కాస్త ఆందోళన కలింగించే అంశం. అయితే ఇప్పుడు వచ్చిన ఫోన్ కూడా అలాంటి గ్యాంగస్టర్ ల నుంచి వచ్చిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా సల్మాన్ కు ఇలా బెదిరింపు కాల్స్ వచ్చాయి. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్గీ బ్రార్, రోహిత్ బ్రార్ ల నుంచి సల్మాన్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అప్పట్లో వీరిపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ ను కూడా నమోదు చేశారు. తర్వాత ఈ బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ తన స్వీయ రక్షణ కోసం బుల్లెట్ ఫ్రూఫ్ నిస్సాన్ SUV వాహనాన్ని కొనుగోలు చేశారు. ఈ కారు కొన్ని రోజుల క్రితమే సల్మాన్ కు చేరింది. దీన్ని ఆయన విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. ఈ కారుకు ఎన్నో సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. సౌత్ ఆసియాలోనే ఈ వాహనానికి చాలా పాపులారిటీ ఉంది. అలాగే రక్షణ కోసం గన్ లైసెన్స్ కు కూడా అప్లై చేసినట్టు తెలుస్తోంది.
కాగా, సల్మాన్ ఖాన్ కొన్నేళ్ల క్రితం రాజస్థాన్ లోని కృష్ణ జింకల వేట నేపథ్యంలో ఆయన పై కేసు నమోదైంది. వాస్తవానికి ఆ కృష్ణ జింకలను బిష్ణోయ్ అనే తెగ ప్రజలు చాలా విశేషంగా ఆదరిస్తారట. అందుకే ఇప్పుడు ఆ తెగగు చెందిన లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్ ను టార్గెట్ గా పెట్టుకున్నారని బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. అంతేకాదు, సల్మాన్ ఖాన్ బిష్ణోయ్ తెగకు క్షమాపణలు చెప్పాలని ఆ గ్యాంగ్ స్టర్ చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక సల్మాన్ ఖాన్ ప్రస్తుత సినిమాల విషయానికొస్తే.. ఆయన ఇటీవల ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాలో నటించారు. ఈ మూవీ తర్వలోనే విడుదల కానుంది. ప్రస్తుతం సల్మాన్ ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే, షెహనాజ్ గిల్, రాఘన్ జుయల్, సిద్ధార్థ్ నిగమ్, భూమికా చావ్లా తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈనెల 21 తేదీన ఈ సినిమా విడుదల కానుంది.