Sailesh Kolanu about Saindhav Climax: సంక్రాంతి బరిలో దిగనున్న సినిమాలన్నీ తమ విజయంపై నమ్మకంతో ఉన్నాయి. ఎంతో గట్టి పోటీ మధ్య దిగుతున్నా కూడా ప్రతీ సినిమా ఆడుతుందని మేకర్స్ నమ్ముతున్నారు. అదే విధంగా ‘సైంధవ్’ కూడా హిట్ అవుతుందని మూవీ టీమ్ నమ్మకంతో ఉన్నారు. వెంకటేశ్ కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ చిత్రంగా తెరకెక్కిన ‘సైంధవ్’ను శైలేష్ కొలను డైరెక్ట్ చేశాడు. జనవరి 13న ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతుండడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు మేకర్స్. ఆ ఈవెంట్‌లో డైరెక్టర్ శైలేష్ కొలను ‘సైంధవ్’ క్లైమాక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


ఓ రేంజ్ యాక్షన్‌తో ‘సైంధవ్’..
ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న వెంకటేశ్‌ను.. ఫుల్ యాక్షన్ హీరోగా చూపించే ప్రయత్నం చేశాడు శైలేష్ కొలను. ఇప్పటికే విడుదలయిన టీజర్, ట్రైలర్ చూస్తుంటే.. ‘సైంధవ్’లో ఏ రేంజ్ యాక్షన్, వైలెన్స్ ఉండబోతుందో అర్థమవుతోంది. అయితే ట్రైలర్‌లో ప్రేక్షకులు చూసింది కొంచమే అని సినిమాలో ఇంకా చాలా ఉంటుందని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శైలేష్ బయటపెట్టాడు. ముఖ్యంగా ఈ సినిమాలో క్లైమాక్స్ చాలా కీలకమని అన్నాడు. ముందుగా క్లైమాక్స్ అనుకున్న తర్వాతే మిగతా కథను రాయడం మొదలుపెట్టానని చెప్పుకొచ్చాడు శైలేష్ కొలను. ప్రేక్షకులంతా కచ్చితంగా క్లైమాక్స్‌ను ఇష్టపడతారని నమ్మకం వ్యక్తం చేశాడు.


అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది..
‘సైంధవ్’ క్లైమాక్స్ అనేది ఒక రైడ్‌లాగా ఉంటుందని, అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని శైలేష్ కొలను తెలిపాడు. ఇప్పటికే మూవీ ట్రైలర్ అందరి అంచనాలను పెంచేయగా.. క్లైమాక్స్ గురించి దర్శకుడు చెప్పిన మాటలు ప్రేక్షకుల్లో మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి. ఇక వెంకటేశ్ కూడా సినిమా బ్రహ్మాండంగా వచ్చిందని, కచ్చితంగా హిట్ అవుతుందని వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ మూవీ ట్రైలర్‌ను బట్టి చూస్తే ఒక ఇంజెక్షన్ కోసం హీరో ఫైట్ చేస్తాడని, ఆ హీరో వెనుక ఏదో ఫ్లాష్‌బ్యాక్ ఉంటుందని అర్థమవుతోంది. దాదాపుగా ట్రైలర్‌లోనే సినిమా కథను బయటపెట్టేసిన శైలేష్.. అసలు హీరోకు ఉన్న ఫ్లాష్‌బ్యాక్ ఏంటి అనే విషయాన్ని సస్పెన్స్‌లో పెట్టాడు. అది ప్రేక్షకులకు ఆసక్తికరమైన అంశంగా మారింది.


అంతమందితో పోటీ..
సంక్రాంతి బరిలో దిగనున్న ఎన్నో సినిమాల్లో ‘సైంధవ్’ కూడా ఒకటి. ఈ మూవీతో మహేశ్ బాబు ‘గుంటూరు కారం’తో, నాగార్జున ‘నా సామిరంగ’తో పోటీపడనున్నాడు వెంకటేశ్. అంతే కాకుండా ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో వచ్చిన ‘హనుమాన్’కు కూడా ‘సైంధవ్’ గట్టి పోటీ ఇస్తుందని వెంకీ మామ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇక ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించగా.. రుహానీ శర్మ, ఆండ్రియా వంటి హీరోయిన్స్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్‌లో వర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న నవాజుద్దీన్ సిద్ధికీ.. ‘సైంధవ్’తో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. విలన్స్ పాత్రల్లో ఆర్య, ముఖేష్ రిషీ కనిపించనున్నారు. జనవరి 13 కోసం వెంకీ మామ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Also Read: నాకు ఇక్కడ హీరోలు ఎవరూ నచ్చలేదు - ‘సైంధవ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో శైలేష్ కొలను