Sailesh Kolanu at Saindhav Pre Release Event: సీనియర్ హీరో వెంకటేశ్ కెరీర్‌లోనే 75వ ల్యాండ్‌మార్క్ చిత్రంగా తెరకెక్కింది ‘సైంధవ్’. ఈ మూవీకి శేలైష్ కొలను దర్శకత్వం వహించాడు. కేవలం రెండు సినిమాలు మాత్రమే అనుభవం ఉన్న దర్శకుడికి వెంకటేశ్ ల్యాండ్‌మార్క్ చిత్రం తెరకెక్కించే అవకాశం ఎలా ఇచ్చారా అని ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యపోయారా. కానీ ‘సైంధవ్’ టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత వెంకీ మామను కొత్త అవతారంలో చూపించడానికి శైలేష్ ప్రయత్నించాడని ప్రశంసిస్తున్నారు. ఇక వైజాగ్‌లో జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్తూనే ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు వెంకటేశ్‌కు థ్యాంక్స్ చెప్పుకున్నాడు.


వైజాగ్ బాగా కలిసొచ్చింది..
‘సైంధవ్’ టీజర్, ట్రైలర్, పోస్టర్లపై శైలేష్ కొలను పేరు ముందు డాక్టర్ అని ఉంటుంది. ముందుగా దాని గురించి క్లారిటీ ఇస్తూ తాను పీహెచ్‌డీ చేశానని తెలిపాడు శైలేష్. ఆ తర్వాత వైజాగ్‌తో తనకు ఉన్న ప్రత్యేకమైన అనుబంధాన్ని బయటపెట్టాడు. ‘‘డిగ్రీ చేస్తున్నప్పుడు నేను, నా గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో చెప్పకుండా వైజాగ్‌కు వచ్చాం. ఇక్కడ నుండి అరకు వెళ్లి రెండు, మూడు రోజులు బాగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్లాం. వైజాగ్ ఎంత కలిసొచ్చిందంటే అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ‘హిట్ 1’ షూటింగ్ కోసం వైజాగ్ వచ్చాం. ‘హిట్ 2’ దాదాపుగా వైజాగ్‌లోనే షూట్ చేశాం. మీ కల్చర్‌ను చాలా ఎక్స్‌పీరియన్స్ చేశాను. ‘సైంధవ్’ కూడా స్టీల్ ప్లాంట్ కాలనీలోనే 20 రోజులు షూట్ చేశాం. వైజాగ్ బాగా కలిసొచ్చింది నాకు. ముందు రెండు సినిమాలు హిట్ చేశారు. మూడో సినిమా కూడా వైజాగ్ వల్లే హిట్ అవుతుందేమో. ఇంత ప్రేమ చూపించినందుకు థ్యాంక్స్’’ అంటూ వైజాగ్‌ను ప్రశంసల్లో ముంచేశాడు దర్శకుడు శైలేష్.


ట్రైలర్‌లో చూసింది కొంచమే..
‘‘సినిమా గురించి చెప్పాలంటే ఇంతమంది నటీనటులను, ఇంతమంది స్టార్ క్యాస్ట్‌తో నిజాయితీ అయిన సినిమా తీశాం. ట్రైలర్‌లోనే సినిమా మూడ్ ఏంటో మీకు అర్థమయిపోయి ఉంటుంది. ట్రైలర్‌లో చూసింది కొంచమే. థియేటర్‌కు వెళ్లి చూస్తే సినిమాలో మంచి డ్రామా ఉంటుంది. వెంకీ మామను ఎప్పుడూ చూడని విధంగా చూపించడానికి ట్రై చేశాను. 75వ సినిమా నా చేతికి ఇచ్చారు. దానిని పెద్ద బాధ్యతగా తీసుకొని వెంకీ మామను ఎలా చూడడానికి ఇష్టపడతారో అలాగే చూపించాను. జనవరి 13న అందరూ థియేటర్లకు వెళ్లి నా అద్భుతమైన యాక్టర్లు ఇచ్చిన పర్ఫార్మెన్స్‌లను, వెంకీ మామ ఇచ్చిన ఎక్స్‌పీరియన్స్‌ను మీరు ఎక్స్‌పీరియన్స్ చేసి ఎంజాయ్ చేయండి. మీరు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను’’ అని అన్నాడు శైలేష్ కొలను.


కమల్ హాసన్ అంటే ఇష్టం..
‘సైంధవ్’ సినిమా చేయకముందు తాను కమల్ హాసన్ ఫ్యాన్ అని గొప్పగా చెప్పుకునేవాడని శైలెష్ బయటపెట్టాడు. ‘‘ఎవరు ఇష్టమని అడిగితే.. నాకు ఇక్కడ ఎవరూ పెద్దగా నచ్చలేదు. కమల్ హాసన్ అంటే చాలా ఇష్టం, ఆయననే చూసి పెరిగాను అని చెప్పేవాడిని. ఈ సినిమా ప్రయాణం అంతా అయిపోయిన తర్వాత చెప్తున్నాను. నేను మీ ఫ్యాన్ కూడా సార్’’ అంటూ వెంకటేశ్‌పై అభిమానాన్ని చెప్పుకున్నాడు. తరువాత నుండి వెంకటేశ్ సినిమాలకు ఫస్ట్ డే, ఫస్ట్ షో వెళ్లి విజిల్ వేస్తానని అన్నాడు. ‘‘ఇన్నిరోజులు నాకు టెన్షన్ రాలేదు కానీ ఇందాక మీ జర్నీ వీడియో చూస్తున్నప్పుడు ఇంత పెద్ద జర్నీలో ఇంత బుడ్డోడైనా నాకు మీరు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దానికి నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. ప్రాణం పెట్టి పనిచేశాను. ఆ తర్వాత ‘సైంధవ్’కు పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాడు.


Also Read: ‘నా సామిరంగ’ ట్రైలర్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?