Conjuring Kannappan review in Telugu streaming on Netflix starring Satish Regina Cassandra: తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ సినిమాల ద్వారా పరిచయమైన తమిళ నటుడు సతీష్. ఆయన హీరోగా నటించిన హారర్ ఎంటర్‌టైనర్ 'కాంజురింగ్ కన్నప్పన్'. డిసెంబర్ 8న తమిళనాడు థియేటర్లలో విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇప్పుడు తెలుగు డబ్బింగ్ వెర్షన్ 'కాంజూరింగ్ కన్నప్ప' పేరుతో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం


కలలోకి వెళితే దెయ్యం... బయటకు వచ్చినా భయం
కథ: కన్నప్ప (సతీష్) వీడియో గేమ్ డెవలపర్. ఉద్యోగం రాలేదు. ఇంటర్వ్యూలు అటెండ్ కావడం ఉద్యోగంగా పెట్టుకున్నాడని, త్వరగా ఉద్యోగం వస్తే చూడాలని ఉందని తల్లి లక్ష్మి (శరణ్య పొన్‌వన్నన్‌) ఫీలవుతుంది. తండ్రి (వీటీవీ గణేష్)కు వస్తున్న పెన్షన్ డబ్బులే కన్నప్ప కుటుంబానికి ఆధారం. వాటర్ మోటార్ పని చేయకపోవడంతో స్నానానికి బావిలో నీళ్లు తోడుకుంటాడు కన్నప్ప. నీళ్లతో పాటు డ్రీమ్ క్యాచర్ కూడా వస్తుంది. అందులో ఒక ఈక పీకి పక్కన పడేస్తాడు. ఆ తర్వాత నుంచి రాత్రి నిద్రపోయిన తర్వాత కలలో బ్రిటీషర్ల బంగ్లాకు వెళతాడు. అక్కడ మూడు దెయ్యాలు ఉంటాయి. తొలుత పీడకల అని వదిలేసినా ఆ తర్వాత కలలో బాడీకి ఏం జరిగితే బయట అది జరుగుతుందని తెలుసుకుంటాడు. ఉదాహరణకు కలలో షర్ట్ చిరిగితే బయట కూడా చిరుగుతుంది. దెబ్బ తగిలితే బయటకు వచ్చిన తర్వాత గాయం ఉంటుంది. 


కన్నప్ప కాకుండా అతని తల్లిదండ్రులు, మావయ్య, సైక్రియాట్రిస్ట్ (రిడిన్ కింగ్ స్లే), డెవిల్ (ఆనంద రాజ్) డ్రీమ్ క్యాచర్ ఈకలు ఎందుకు, ఎలా పీకారు? బంగ్లాలో దెయ్యాలు వాళ్లను ఏం చేశాయి? వాటిని నుంచి తప్పించుకోవడంలో ఎక్సార్సిస్ట్ ఏడుకొండలు (నాజర్), డార్క్ డెవ్స్ (రెజీనా) కన్నప్పతో పాటు మిగతా వాళ్లకు ఎలా సాయం చేశాయి? చివరకు ఏమైంది? అనేది 'కాంజూరింగ్ కన్నప్ప' సినిమా.


కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉన్నప్పటికీ...
విశ్లేషణ: హారర్ ఫార్ములా తెలుగు, తమిళ ప్రేక్షకులకు కొత్త కాదు. దెయ్యం కథలకు కామెడీ మిక్స్ చేసి బాక్సాఫీస్ బరిలో భారీ విజయాలు సాధించిన సినిమాలు ఎన్నో. అందుకు 'కాంచన', 'రాజుగారి గది' హారర్ ఫ్రాంచైజీలను ఉదాహరణగా చెప్పవచ్చు. భారీ భవంతిలో దెయ్యం, దాన్ని చూసి భయపడే జనం... మెజారిటీ హారర్ ఫిలిమ్స్ తీసుకుంటే, ప్రేక్షకులను భయపెట్టడానికి దర్శక రచయితలు ఫాలో అయ్యే ఫార్ములా ఒక్కటే ఉంటుంది. 'కాంజూరింగ్ కన్నప్ప' సినిమాలోనూ అటువంటి సీన్లు ఉన్నాయి. కాకపోతే కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉంది. అది ఏమిటంటే... 


డిఫరెన్స్ తీసుకొచ్చిన డ్రీమ్ క్యాచర్...
ప్రేక్షకులు ఇది వరకు చూసిన హారర్ సినిమాల నుంచి 'కాంజూరింగ్ కన్నప్పన్'ను వేరు చేసింది ఒక్కటే... డ్రీమ్ క్యాచర్. అందులో ఈక (feather) పీకితే కలలోకి, ఆ దెయ్యాల కోటలోకి వెళ్లడం కొంచెం కొత్తగా ఉంది. అది తప్పిస్తే... కథ, కథనం, ఆ సన్నివేశాలన్నీ రొటీన్.


హీరో సతీష్, మిగతా పాత్రలను పరిచయం చేయడానికి దర్శకుడు సెల్విన్ రాజ్ చాలా టైమ్ తీసుకున్నారు. హీరో ముందుగా దెయ్యాల బంగ్లాలోకి వెళ్లినా... మిగతా అందరూ అక్కడ చేరుకోవడానికి ఎక్కువ టైమ్ పట్టింది. దాంతో కథ ఎంత సేపటికీ ముందుకు కదల్లేదు. దానికి తోడు బ్రిటీషర్లు పాయింట్ తప్ప ఫ్లాష్ బ్యాక్ కూడా కొత్తగా లేదు. 'చంద్రముఖి'ని గుర్తుకు తెస్తుంది. అందులో జ్యోతిక మంచి దెయ్యం, రజనీకాంత్ చెడ్డ దెయ్యం అయితే ఎలా ఉంటుంది? ఆ తరహాలో తీశారు. 'మర్యాద రామన్న'లో హీరోకి హీరోయిన్ సాయం చేసినట్టు... ఆ బంగ్లాలో మంచి దెయ్యం హీరోకి సాయం చేస్తుంది.


క్లైమాక్స్ క్యూరియాసిటీ కలిగిస్తుంది. సినిమా ఎండింగ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి చూసేలా చేసింది. యువన్ శంకర్ రాజా హారర్ సినిమాలకు కావాల్సిన సంగీతాన్ని ఇచ్చారు. ప్రొడక్షన్ డిజైన్ బావుంది. నిర్మాతలు బాగా ఖర్చు చేశారు. 


సతీష్... రెజీనా... నో లవ్ ట్రాక్
సినిమాలో సతీష్ హీరో. హీరోయిన్ రెజీనా కూడా ఉన్నారు. అయితే... ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ లేదు. రెగ్యులర్ ఫిలిమ్స్ నుంచి 'కాంజూరింగ్ కన్నప్పన్'లో ఇదొక రిలీఫ్. తమ పాత్రల పరిధి మేరకు ఇద్దరూ నటించారు. సతీష్, వీటీవీ గణేష్, రిడిన్, ఆనందరాజ్ వంటి కమెడియన్లు ఉండటంతో కొన్ని సీన్లు నవ్వించాయి. బాలీవుడ్ నటి ఎలీ అవరం దెయ్యం పాత్రలో నటించారు. ఆమెను ప్రేక్షకులు గుర్తు పట్టడం కష్టమే.


Also Read: కాథల్ ది కోర్ రివ్యూ: అమెజాన్ ఓటీటీలో మమ్ముట్టి గే రోల్ చేసిన సినిమా... జ్యోతిక డామినేట్ చేసిందా?


తెలుగులో ఈ మధ్య 'మసూద', 'విరూపాక్ష' వంటి డిఫరెంట్ అండ్ కంప్లీట్ హారర్ సినిమాలు వచ్చాయి. 'కాంజూరింగ్ కన్నప్పన్' అటువంటి సినిమా కాదు. హారర్ అండ్ కామెడీ మిక్స్ చేసి తీసిన సినిమా. కథ, కథనం, సన్నివేశాల పరంగా కొత్తగా ఏమీ లేదు. కాకపోతే కాసేపు నవ్వుకోవడానికి, రెగ్యులర్ హారర్ మూమెంట్స్ వచ్చినా సరే భయపడి థ్రిల్ కావడానికి ఇదొక ఆప్షన్ అంతే.


Also Read#90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ రివ్యూ : ఈటీవీ విన్‌లో శివాజీ నటించిన వెబ్ సిరీస్