ప్రముఖ హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియో ఉక్రెయిన్‌కు పది మిలియన్ డాలర్లు విరాళం ఇచ్చారు. భారతీయ కరెన్సీలో 77 కోట్ల రూపాయలు అన్నమాట. మెరుగైన సమాజం, పర్యావరణ హితం కోసం లియోనార్డో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధన సహాయం చేస్తుంటారు. అయితే... ఉక్రెయిన్‌కు విరాళం ఇవ్వడం వెనుక మరో కారణం కూడా ఉంది.
లియోనార్డో అమ్మమ్మ హెలెన్‌ది ఉక్రెయిన్. సౌత్ ఉక్రెయిన్‌లోని ఒడెస్సాలో హెలెన్ జన్మించారు. 1917లో తల్లిదండ్రులతో కలిసి జెర్మనీకి ఆమె వలస వెళ్లారు. జర్మనీలో లియోనార్డో తల్లి యిర్మీలిన్‌కి హెలెన్ జన్మినిచ్చారు. లియోనార్డోకి ఏడాది వయసు ఉన్నప్పుడు భర్త నున్నచీ యిర్మీలిన్ విడాకులు తీసుకున్నారు. మనవడిని కుమార్తెతో కలిసి హెలెన్ పెంచారు. ఆవిడ 2008లో మరణించారు. 'టైటానిక్', 'ద మ్యాన్ ఇన్ ద ఐరన్ మాస్క్'తో పాటు కొన్ని చిత్రాల ప్రీమియర్ షోలకు తల్లి, అమ్మమ్మతో కలిసి లియోనార్డో హాజరయ్యారు. అమ్మమ్మ మాతృభూమిలో మనుషులు చేస్తున్న పోరాటానికి అండగా పది మిలియన్ డాలర్లు విరాళం ఇచ్చారు.
Also Read: పెంపుడు పులితో బంకర్ లో, ఉక్రెయిన్ ను విడిచి రానంటున్న తెలుగు యువకుడు!
ఉక్రెయిన్‌లో జన్మించిన హాలీవుడ్ నటి మిలా కునిస్, భర్త అష్టన్ కుచర్‌తో కలిసి ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఉక్రెయిన్ కోసం మూడు మిలియన్ డాలర్లు డొనేట్ చేయడమే కాకుండా... 30 మిలియన్ డాలర్ల విరాళాలు సేకరించాలని అనుకుంటున్నట్టు తెలిపారు. ఆల్రెడీ 15 మిలియన్ డాలర్లు విరాళాల రూపంలో ప్రజల నుంచి వచ్చినట్టు తెలిపారు. 'రెసిడెంట్ ఈవిల్' స్టార్ మిల్లా జోవోవిచ్ సైతం ఉక్రెయిన్‌లో జన్మించారు. ఆమె కూడా మాతృభూమి కోసం ఓ పోస్ట్ చేశారు. హాలీవుడ్ యాక్టర్లు ర్యాన్ రోనాల్డ్‌సన్, బ్లేక్ లైవ్లీ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు.