ఏపీలో సినిమా టికెట్ రేట్లను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవోను అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానికి థ్యాంక్స్ చెబుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు.


‘మా సమస్యలు విని కొత్త జీవో, సవరించిన టికెట్ రేట్ల ద్వారా వాటిని పరిష్కరించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు.’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మధ్య బలమైన బంధం ఏర్పడాలి.’ అని పేర్ని నానిని ట్యాగ్ చేశారు.


ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై వైఎస్ జగన్‌కు, పేర్ని నానికి సినీ ప్రముఖులు ధన్యవాదాలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే ఈ విషయమై సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. 


‘తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా, అటు థియేటర్ల మనుగడను, ప్రజలకి వినోద అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని, సినిమా టికెట్ రేట్స్ సవరిస్తూ సరికొత్త GO జారీ చేసిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ గారికి పరిశ్రమ తరుపున కృతజ్ఞతలు చిన్న సినిమాకు ఐదవ షో అవకాశం కల్పించటం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశం. సంబంధిత మంత్రివర్యులు పేర్ని నాని గారికి, అధికారులకి, కమిటీకి ధన్యవాదాలు.’ అంటూ చిరంజీవి తన ట్వీటర్ పోస్టులో పేర్కొన్నారు.