సినిమా టికెటింగ్ విధానంపై  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీవ్రం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇది పెద్ద సినిమాలకు ఇబ్బందిగా మారుతుందని చాలా మంది ఇప్పటికే అభిప్రాయడుతున్నారు. ఇటీవలే రిలీజ్‌ అయిన అఖండ్ మూవీపై దీని ఎఫెక్ట్ బాగానే పడింది. కలెక్షన్‌లు భారీగా పడిపోయాయి. ప్రత్యేక షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఎక్కడెక్కడ స్పెషల్ షోలు వేశారో ఆ థియేటర్లను సీజ్ చేశారు. 
భారీ బడ్జెట్‌తో తీసిన సినిమాలపై కొత్త టికెటింగ్ విధానం కచ్చితంగా చాలా ప్రభావం చూపనుంది. భారీగా కలెక్షన్‌లు పడిపోనున్నాయి. దీనిపై భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలు ఎలా స్పందిస్తారనే చర్చ జోరుగా సాగుంది. ముఖ్యంగా ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి సినిమాలకు ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందనే చర్చ నడుస్తోంది. 
ఈ చర్చ సాగుతుండగానే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాత రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్‌లో ట్రిపుల్ ఆర్ టీం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు డీవీవీ దానయ్య రియాక్ట్ అయ్యారు. ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. 
ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ట్రిపుల్ ఆర్ టీం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టింది. ఈ సందర్భంగా ఓ విలేకరి... ఏపీలో సినిమా టెకెట్‌ ధరల విషయంలో ఏం చేయబోతున్నారని అడిగారు. పనిలో పనిగా ... ఎన్టీఆర్ సన్నిహితులు ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్నారని... వాళ్ల హెల్ప్‌ ఏమైనా తీసుకుంటారా అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా సినిమా టికెట్‌ ధరల విషయంపై ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని అన్నారు డీవీవీ దానయ్య. త్వరలోనే ఈ అంశం కొలిక్కి వస్తుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద సినిమాలకు వర్కౌట్ కాదని అన్నారు. 
గతంలో కూడా ఓసారి దానయ్య ట్వీట్ చేస్తూ ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ విషయంలో చిక్కు ముడి విప్పేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పుడు మరోసారి అదే విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేశారు.