టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా '83' అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. '83' చిత్ర నిర్మాతలు తమను మోసం చేశారంటూ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫైనాన్షియల్ కంపెనీ కంప్లైంట్ చేసింది. ముంబైలోని అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుని ఆశ్రయించింది. ఈ సినిమాలో పెట్టుబడులు పెట్టే ఆలోచనతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫైనాన్షియల్ కంపెనీ.. నిర్మాతలను కలవగా వారు పాజిటివ్ గా స్పందించి అగ్రిమెంట్స్ చేసుకున్నారు. 

 

సినిమా హక్కులు ఇప్పిస్తామని చెప్పి రూ.15.90 కోట్లు ఖర్చు చేయించారు. కానీ ఇప్పుడు ఆ విషయంలో తమను మోసం చేశారని చెబుతోంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫైనాన్షియల్ కంపెనీ. నిజానికి తమ కంపెనీతో ఉన్న అగ్రిమెంట్ ప్రకారం.. సినిమాకి సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో తమను కూడా ఇన్వాల్వ్ చేయాలని.. కానీ నిర్మాతలు అలా చేయలేదని సదరు కంపెనీ వెల్లడించింది.  

 

తమ పర్మిషన్ తీసుకోకుండానే.. దీపికా పదుకొనె, కబీర్‌ ఖాన్, సాజిద్‌ నడియాడ్‌వాలా, ఫాంటమ్‌ ఫిలిమ్స్, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్ లతో పలు అగ్రిమెంట్స్ రాసుకున్నారని ఫైనాన్షియల్ కంపెనీ ఆరోపిస్తోంది. '83' సినిమా నిర్మాతలపై ఐపీసీ 406, 420, 120బీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 

 

1983 వరల్డ్ కప్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటించగా.. అతడి భార్య పాత్రలో దీపికా పదుకోన్ కనిపించనుంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సమయంలో ఇలా చీటింగ్ కేసు పెట్టడంతో రిలీజ్ వాయిదా పడుతుందేమోనని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. 

 


 


 


 


 


 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి