రివ్యూ: గమనం
రేటింగ్: 2.75/5
ప్రధాన తారాగణం: శ్రియ శరణ్, శివ కందుకూరి, ప్రియాంకా జవాల్కర్, చారు హాసన్, సుహాస్, రవిప్రకాష్, బిత్తిరి సత్తి తదితరులతో పాటు అతిథి పాత్రలో నిత్యా మీనన్
ఎడిటర్: రామకృష్ణ అర్రం
కెమెరా: జ్ఞానశేఖర్ వీఎస్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
సంగీతం: ఇళయరాజానిర్మాతలు: రమేష్ కరుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వీఎస్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుజనా రావువిడుదల తేదీ: 10-12-2021


తెలుగులో యాంథాల‌జీ సినిమాలు త‌క్కువ‌. అదీ వెండితెరపైకి వచ్చిన సినిమాలు మరీ తక్కువ. 'వేదం', అంతకు ముందు 'ఓం శాంతి', ఆ తర్వాత 'చందమామ కథలు', 'అ!', 'కేరాఫ్ కంచరపాలెం', 'మనమంతా' వంటివి మాత్రమే వచ్చాయి. ఓ కథతో కాకుండా కొన్ని కథల సమాహారంగా ఈ సినిమాలు తెరకెక్కాయి. తాజాగా మరో సినిమా వచ్చింది. అదే 'గమనం'. మూడు కథల సమాహారంగా ఈ సినిమా రూపొందింది. హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదలకు సామాన్యుల జీవితాల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి? ఏమిటి? అనేది సినిమా.


కథ: కమల (శ్రియ శరణ్)కు వినికిడి లోపం ఉంది. ఆమె భర్త ఉద్యోగానికి అని దుబాయ్ వెళ్లడంతో చంటిబిడ్డతో హైద‌రాబాద్‌లోని ఓ మురికివాడ‌లో ఉంటుంది. భర్త తిరిగొచ్చాక... సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు కొనుక్కుని అందులో హ్యాపీగా ఉండాలనేది ఆమె కోరిక. ఆమె భర్త వచ్చాడా? లేదా?
అలీ (శివ కందుకూరి)ది మరో కథ. అతని తల్లితండ్రులు చిన్నతనంలో మరణించడంతో తాతయ్య (చారుహాసన్) పెంపకంలో పెరుగుతాడు. క్రికెటర్ కావాలనేది అతడి కల. అందుకోసం ఏం చేశాడు? అతని ప్రేయసి జారా (ప్రియాంకా జవాల్కర్) ఏం చేసింది? ఎందుకు అలీని తాతయ్య ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు?
ఇక, సోదరులైన ఇద్దరు అనాథ బాలలది మరో కథ. చెత్త ఏరుకుంటూ రోడ్డు పక్కన పైపుల్లో నిద్రపోతూ జీవిస్తుంటారు. ఒకరోజు ఓ బర్త్ డే పార్టీలో చిన్నారి కేక్ కట్ చేయడం చూసి... ఆ ఇద్దరిలో చిన్నోడు కూడా కేక్ కట్ చేయాలని అనుకుంటాడు. అందుకోసం డబ్బులు దాచుకుంటాడు. రూ. 200 తీసుకుని బేకరీకి వెళితే... కేక్ రూ. 500 అని తెలుస్తుంది. అప్పుడు ఆ రెండొందలతో మట్టి విగ్రహాలు కొని ఐదొందలు సంపాదించాలని ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ఏమైంది?
కమల, అలీ, అనాథల జీవితాల్లో హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలు ఎటువంటి మార్పులు తీసుకొచ్చాయి? ఏమైంది? అనేది మిగతా సినిమా. 


విశ్లేషణ: ఆర్ట్ సినిమాలు నిదానంగా సాగుతాయి. ప్రతి సన్నివేశాన్ని కళాత్మకంగా మలిచే క్రమంలో కథనం నెమ్మదించినా... దర్శకులు కాస్త చూసీ చూడనట్టు వదిలేస్తారు. దర్శకురాలు సుజనా రావు ఆర్ట్ సినిమా తరహాలో తీయాలని మాటలను పొదుపుగా వాడుతూ, 'గమనం' తీశారు. ఆ మధ్య హైదరాబాద్ భారీ వర్షాలు, వరదలకు ఎంతోమంది సామాన్యులు కష్టాలు పడ్డారు. ఆ కష్టాలను చూసి కరిగి, కన్నీటి కథలను తెరపైకి తీసుకురావాలని అనుకోవడం మంచి ప్రయత్నం. సినిమా మొదలైన తర్వాత కథలు, పాత్రలు పరిచయం చేయడానికి దర్శకురాలు చాలా సమయం తీసుకున్నారు. కథలను తెరకెక్కించిన తీరు డాక్యుమెంటరీని తలపించినా... కళాత్మకంగా ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను చూసే ప్రేక్షకులకు ఇటువంటి సినిమాలు నచ్చకపోవచ్చు. అలాగని, కథలో విషయం లేదని కాదు... చాలా ఉంది.


ఉదాహరణకు... సినిమాలో అనాథ బాలలు డబ్బులు సంపాదించాలని ఉన్న డబ్బుతో మట్టి వినాయక విగ్రహాలు కొని లాభానికి అమ్మాలని ప్రయత్నిస్తారు. వర్షంలో ఓ ముస్లిం యువతిని మట్టి విగ్రహం కొనమని ఇద్దరిలో చిన్నోడు అడుగుతాడు. మతం అన్నది అతడికి తెలియదని ఆ సన్నివేశంలో దర్శకురాలు చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే, శ్రియ కథలో... హియరింగ్ మెషిన్ పెట్టుకున్న తర్వాత ఆమె భర్తకు ఫోన్ చేస్తుంది. భార్యకు వినికిడి లోపం ఉన్నది కాబట్టి... ఆమెకు వినబడదని, వేరొకరు వింటున్నారని అనుకుని భర్త మాట్లాడతాడు. అది భార్య వింటుంది. ఆ సన్నివేశం తీసిన తీరు బావుంటుంది. అలాగే, శివ కందుకూరి క్రికెట్ ఆడే సమయంలో అవుట్ అయిన తర్వాత కోచ్ చెప్పే మాటలు... 'ప్రతి ఆటగాడు ఎక్కడో ఓడిపోవాల్సిందే' వంటివి బావున్నాయి. 30 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ చూసి 'ఇంత ఇల్లు కట్టుకున్నారంటే ఎంత చెత్త ఏరుకున్నారో' అని అనాథ బాలుడు అనుకోవడం అతడిలో ఉన్న అమాయకత్వాన్ని తెలియజేస్తుంది. ఇటువంటి మంచి మాటలు, సన్నివేశాల్లో మెరుపులు ఉన్నాయి. అయితే... దర్శకురాలికి తొలి సినిమా కావడంతో అక్కడక్కడా కొంత తడబాటు కనిపించింది. అయితే... ఆమెకు సినిమాటోగ్రాఫర్, ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన జ్ఞానశేఖర్ నుంచి మంచి మద్దతు లభించింది. వర్షం నేపథ్యంలో తెరకెక్కించిన సన్నివేశాల్లో ఛాయాగ్రహణం సహజంగా ఉంటుంది. సినిమా కలర్ టోన్ రెగ్యుల‌ర్‌గా కాకుండా... డిఫ‌రెంట్‌గా ఉంటుంది. 'మర్యాదతో మమ్మల్ని మట్టిలో కలుపుతావ్ అనుకుంటే... ఆ మర్యాదను మట్టిలో కలిపేశావ్' అని చారు హాసన్ ఓ డైలాగ్ చెబుతారు. ఇటువంటి మంచి మాటలు కొన్ని సాయి మాధవ్ బుర్రా కలం నుంచి వచ్చాయి. కృష్ణకాంత్ రాయగా... కైలాష్ ఖేర్ పాడిన 'సాంగ్ ఆఫ్ లైఫ్' బావుంది. మంచి సాహిత్యం, సంగీతం, గాత్రం కలబోత ఆ పాట అని చెప్పాలి. కొన్నాళ్ల పాటు గుర్తు చేసుకునే విధంగా ఉంది. ఇళయరాజా నేపథ్య సంగీతం సినిమాకు బలం. 


సాంకేతిక అంశాలను పక్కన పెడితే... హీరోయిన్లకు మంచి పాత్రలు దక్కాయి. పలు కమర్షియల్ సినిమాల్లో కథానాయికగా నటించిన శ్రియ, ఇందులో కొత్తగా కనిపిస్తారు. గృహిణి పాత్రలో ఒదిగిపోయారు. నటిగానూ భావోద్వేగాలలను అలవోకగా పండించారు. 'ఎస్ఆర్ కళ్యాణ మండపం', 'తిమ్మరుసు' సినిమాల్లో ప్రియాంకా జవాల్కర్ కమర్షియల్ కథానాయికగా కనిపించారు. ఈ 'గమనం'లో ముస్లిం యువతి కనిపించారు. కళ్లతో హావభావాలు పలికించారు. అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలు చేయగలనని నిరూపించుకున్నారు. అయితే... కథలో, సన్నివేశాల్లో ఆమె పాత్రకు ప్రాముఖ్యం తక్కువ. అనాథ బాలలుగా నటించిన ఇద్దరూ బాగా చేశారు. శివ కందుకూరి నటన భావోద్వేగభరిత సన్నివేశాల్లో ఆకట్టుకుంటుంది. గత సినిమాలతో పోలిస్తే... పరిణితి చూపించారు. చారు హాసన్, సంజయ్ స్వరూప్, సుహాస్ పాత్రల పరిధి మేరకు చేశారు. నిత్యా మీనన్ ఓ పాటలో కనిపించారు. అంతే!  'గమనం' ఓ మంచి ప్రయత్నం అని చెప్పవచ్చు. కన్నీటి కథలను కళ్లకు కట్టినట్టు చూపించాలని, కళాత్మకంగా తెరకెక్కించాలని చేసిన ప్రయత్నాన్ని, తీరును అభినందించాలి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల మధ్యలో ఇటువంటి వైవిధ్యమైన సినిమాలకు ఎంత మంది ప్రేక్షకులు వస్తారు? ఎంతమంది హర్షిస్తారు? అనేది ప్రస్తుతానికి చెప్పలేం.