తెలుగు చిత్ర పరిశ్రమకు మరో వారసుడు వస్తున్నాడు. మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) తమ్ముడు రఘు కొడుకు మాధవ్ భూపతిరాజు (Maadhav Bhupathiraju) కథానాయకుడిగా కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాతో ఆయన హీరోగా పరిచయం కానున్నారు.
'పెళ్లి సందD' దర్శకురాలు గౌరీతో...
జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి 'పెళ్లి సందD' ఫేమ్ గౌరీ రోణంకి దర్శకురాలు. ఈ రోజు (గురువారం, మార్చి 23న) పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు కెమెరా స్విచ్ఛాన్ చేయగా... దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ అందజేశారు. నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, చదలవాడ శ్రీనివాస రావు, నటుడు రఘు తదితరుల హాజరై మాధవ్ భూపతిరాజుకు ఆశీస్సులు అందజేశారు.
అబ్బాయికి పెదనాన్న విషెస్!
''హీరోగా పరిచయం అవుతున్న మా అబ్బాయి మాధవ్ భూపతిరాజుకు ఆల్ ది వెరీ బెస్ట్. మీరందరూ మా వాడిని ఆశీర్వదించి ప్రేమాభిమానాలు చూపించండి'' అని రవితేజ ట్వీట్ చేశారు. షూటింగులో బిజీగా ఉండటం వల్ల ప్రారంభోత్సవానికి ఆయన రాలేకపోయారని నిర్మాత జేజేఆర్ రవిచంద్ తెలిపారు.
వచ్చే నెలలో షూటింగ్!
ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళుతుందని హీరోగా పరిచయమవుతున్న మాధవ్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరికీ చాలా థాంక్స్. జేజేఆర్ రవిచంద్ గారి సంస్థలో రెండో చిత్రమిది. వచ్చే నెల నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తాం. సినిమా విడుదల అయ్యేంత వరకూ మీ అందరి మద్దతు కావాలి'' అని రిక్వెస్ట్ చేశారు.
యూత్‌ఫుల్... కలర్‌ఫుల్!
చిత్రనిర్మాత జేజేఆర్ రవిచంద్ మాట్లాడుతూ... ''మా సినిమా ఓపెనింగుకు వచ్చిన రాఘవేంద్ర రావు గారు, సురేష్ బాబు గారు, మొదటి నుంచి నాకు మద్దతుగా ఉన్న చదలవాడ శ్రీనివాసరావు గారు, ఇతరులకు థాంక్స్. 'పెళ్లి సందD'తో గౌరి రోణంకి దర్శకురాలిగా నిరూపించుకున్నారు. ఆమె రెండో చిత్రాన్ని మా సంస్థలో చేయడం సంతోషంగా ఉంది. రవితేజ గారి సోదరుడు రఘు గారి అబ్బాయి మాధవ్ భూపతి రాజును హీరోగా పరిచయం చేయడం కూడా హ్యాపీగా ఉంది. మంచి కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. గతంలో సాంబశివ క్రియేషన్స్ సంస్థలో ఐదు చిత్రాలు చేశా. జేజేఆర్ సంస్థ స్థాపించి నవీన్ చంద్రతో ఓ సినిమా చేశా. ఇది రెండో సినిమా'' అని చెప్పారు.
Also Read : సెప్టెంబర్‌లో 'ఖుషి' ఖుషీగా - విజయ్ దేవరకొండ, సమంత సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
తనకు ఈ సినిమా సెకండ్ డెబ్యూ అని దర్శకురాలు గౌరి రోణంకి తెలిపారు. తనకు అవకాశం ఇవ్వడంతో పాటు హీరో మాధవ్ మీద నమ్మకం ఉంచినందుకు నిర్మాతకు థ్యాంక్స్ చెప్పారు. ఇది యూత్ ఫుల్, కలర్ ఫుల్ సినిమా అని తెలిపారు. త్వరలో కథానాయికతో పాటు ఇతర నటీనటుల వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : రామ్, కళా దర్శకత్వం : కిరణ్ కుమార్ మన్నె, కూర్పు : విప్లవ్, సంగీతం : అనూప్ రూబెన్స్, నిర్మాత : జేజేఆర్ రవిచంద్, రచన & దర్శకత్వం : గౌరి రోణంకి.
Also Read : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల