ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడిస్తున్నాయి. అందుకే మన దర్శక నిర్మాతలు వరల్డ్ వైడ్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని, సినిమాలు తెరకెక్కిస్తున్నారు. సినీ ప్రియులకు సరికొత్త అనుభూతిని పంచడానికి ఖర్చుకు వెనుకాడడం లేదు. తెలుగు సినిమాకు ఆస్కార్ సాధించే సత్తా ఉందని నిరూపించడిన తర్వాత, ఫిలిం మేకర్స్ అంతా రిచ్ గా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు తమిళంలోనూ పలు భారీ బడ్జెట్ మూవీస్ రూపొందుతున్నాయి. ప్రస్తుతం సెట్స్ మీదున్న, 2023-24లో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రాల గురించి ఇప్పుడు చూద్దాం!

ప్రాజెక్ట్ K:


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి ఫేం నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమా 'ప్రాజెక్ట్ K'. అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొనె, దిశా పటాని వంటి స్టార్ క్యాస్టింగ్ ఈ చిత్రంలో భాగం అవుతోంది. సూపర్ హీరో కథాంశంతో రూపొందుతున్న ఫిక్షనల్ సోషియో ఫాంటసీ మూవీ ఇది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా కోసం దాదాపు 600 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రెజెంట్ సెట్స్ మీదున్న ఇండియన్ సినిమాల్లో ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ అని చెప్పాలి. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. 2024 జనవరి 12న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

ఆదిపురుష్:


 

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఆది పురుష్'. రామాయణం ఇతిహాసం ఆధారంగా ఈ మైథలాజికల్ డ్రామాని తీస్తున్నారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందిస్తున్న ఈ సినిమా బడ్జెట్ 550 కోట్లు దాటుతుందని అంటున్నారు. వాస్తవానికి ఈ సినిమాని 450 కోట్లలో తీస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి అదనంగా మరో 100 కోట్లు ఖర్చు చేసి మంచి ఔట్ పుట్ అందించడానికి కృషి చేస్తున్నట్లు టాక్. టీ సిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా.. సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నారు. 2023 జూన్ 16న భారీ ఎత్తున ఈ సినిమా రిలీజ్ కానుంది.

'సలార్':


'KGF' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా 'సలార్'. హాంబులే బ్యానర్ లో రూపొందుతున్న ఈ యాక్షన్ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తీస్తున్నట్లుగా నివేదికలు పేర్కొంటున్నాయి. 2023 సెప్టెంబర్ లో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.

RC15:


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాత్కాలికంగా RC15 అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో 50వ సినిమా కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్మాత.. ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. అందులోనూ RRR తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా ఇది. అందుకే దాదాపు 350 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. 2024 సంక్రాంతికి లేదా వచ్చే యేడాది సమ్మర్ లో ఈ పాన్ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

'పుష్ప: ది రూల్'


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరక్టర్ సుకుమార్ కాంబినషన్ లో రాబోతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'పుష్ప 2'. బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ 'పుష్ప: ది రైజ్' చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ కి వచ్చిన రెస్పాన్స్ ని దృష్టిలో పెట్టుకొని, మేకర్స్ బడ్జెట్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. దాదాపు రూ.350 కోట్ల వరకూ ఖర్చు చేయడానికి రెడీ అయ్యారని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రంలో రష్మీక మందన్నా హీరోయిన్ గా నటించగా.. ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు.

NTR30:


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా డైరక్టర్ కొరటాల శివ ఓ భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. NTR30 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేయబడిన ఈ సినిమా.. ఈరోజు మార్చి 23న ప్రారంభం కానుంది. RRR చిత్రంలో గ్లోబల్ స్టార్ ఇమేజ్ రావడంతో.. ఇప్పుడు తారక్ పై అత్యధిక బడ్జెట్ ఖర్చు చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించే ఈ పాన్ ఇండియా చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుంది. 2024 సమ్మర్ లో రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

 

మరికొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు:

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న 'హరి హర వీరమల్లు'.. సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న SSMB28 చిత్రాలు వారి కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఇక తమిళంలో మణిరత్నం డైరెక్ట్ చేసిన 'పొన్నియన్ సెల్వన్ 2' సినిమా కోసం భారీగానే ఖర్చు చేశారు. శంకర్ దర్శకత్వంలో విశ్వ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న 'ఇండియన్ 2' చిత్రం కూడా ఈ జాబితాలోకే వస్తుంది.