మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మళ్ళీ షూటింగులతో బిజీ బిజీ కానున్నారు. అతి త్వరలో హైదరాబాద్ పాతబస్తీలో సందడి చేయనున్నారు. ఆయన్ను ఈ వారమే అక్కడికి సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తీసుకు వెళ్లనున్నారు. అసలు వివరాల్లోకి వెళితే... 


పాతబస్తీలో పాట... ఇతర నగరాల్లోనూ!RC 15 song shoot at Hyderabad Old City : రామ్ చరణ్, శంకర్ కలయికలో పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. అది ప్రేక్షకులకు తెలుసు. ఈ వారం ఆ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. అందులో పాతబస్తీలో రామ్ చరణ్ మీద ఓ పాటలో కొంత షూట్ చేయనున్నారు. మిగతా పార్ట్ రాజమండ్రి, విశాఖలో షూట్ చేస్తారని తెలిసింది. ఇంతకు ముందు కూడా ఏపీలోని ఆ రెండు నగరాల్లో షూటింగ్ చేశారు. 


సాంగ్స్ తీయడంలో శంకర్ కంటూ ఒక స్టైల్ ఉంది. ఆయన సినిమాల్లోని పాటల్లో భారీతనం కనబడుతుంది. రామ్ చరణ్ కోసమూ ఆయన అటువంటి సాంగ్స్ ప్లాన్ చేశారట. ఆ మధ్య విదేశాల్లో బాస్కో సీజర్ కొరియోగ్రఫీలో తీసిన సాంగ్ కూడా సినిమాలో హైలైట్ అవుతుందట.   


జూన్‌లో గుమ్మడికాయ కొడతారా?
రామ్ చరణ్, శంకర్ సినిమా మొదలై చాలా రోజులు అయ్యింది. మధ్యలో కమల్ హాసన్ 'భారతీయుడు 2' చిత్రీకరణకు శంకర్ చెన్నై వెళ్ళడం, 'ఆర్ఆర్ఆర్'కు విదేశాల్లో అవార్డులు రావడంతో రామ్ చరణ్ అక్కడకు వెళ్ళడం వల్ల బ్రేకులు పడ్డాయి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... జూన్ నెలాఖరుకు సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశారట!


ఐఏఎస్ అధికారిగా...
ముఖ్యమంత్రి అభ్యర్థి!
శంకర్ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా కనిపించనున్నారు. అభ్యుదయం పార్టీ సీయం క్యాండిడేట్ చరణ్. రాజమండ్రి, విశాఖలో ఆ సీన్స్ తీసినప్పుడు విజువల్స్ లీక్ అయ్యాయి. ఫ్లాష్‌బ్యాక్ కాకుండా ప్రజెంట్‌కు వస్తే... ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారు. తండ్రీ కొడుకులుగా రెండు క్యారెక్టర్లు ఉంటాయని టాక్. 


Also Read : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్  


ఈ సినిమాలో కియారా అడ్వాణీ (Kiara Advani) ఓ కథానాయిక. మరో కథానాయికగా  తెలుగమ్మాయి అంజలి నటిస్తున్నారు. ఆమె ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో చరణ్ భార్యగా కనిపించనున్నారు. శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పతాకంపై 'దిల్‌' రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు.


Also Read : కళా తపస్వికి తెలుగు ప్రభుత్వాలు గౌరవం ఇవ్వలేదా? ఆయన స్థాయికి అది అవమానమేనా? 


'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' చిత్రంతో రామ్ చరణ్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమాలో 'నాటు నాటు...' పాట ఆస్కార్స్ షార్ట్ లిస్టులో ఉండటం, ఇంకా పలు విదేశీ అవార్డులు రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత చేయబోయే చిత్రాలు సైతం అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని, ఆ సినిమా విడుదలకు ముందు నుంచి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడీ శంకర్ సినిమాతో పాటు తర్వాత చేయబోయే సినిమాలను సైతం పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా చూస్తున్నారు.